నేటి నుంచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ

బ్యాంకాక్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అనంతరం ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రపంచ చాంపియన్ సింధు.. పోటీ తీవ్రంగా ఉండే ఈ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పురుషుల విభాగంలో బరిలో ఉన్న కిడాంబి శ్రీకాంత్‌కు కాస్త సులువైన ‘డ్రా’ ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం గతేడాది చివర్లో చైనా వేదికగా జరుగాల్సిన ఈ టోర్నీ కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. బుధవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఆదివారం ముగియనుంది. సీజన్ చివర్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన ప్లేయర్లు ఈ టోర్నీలో తలపడాల్సి ఉండగా.. కరోనా ఆందోళనతో జపాన్, చైనా షట్లర్లు టోర్నీకి దూరమవడంతో ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న శ్రీకాంత్‌కు ఈ మెగాటోర్నీలో పోటీపడే అవకాశం దక్కింది.
లండన్ శిక్షణ పనికొచ్చేనా..
ఈ ఏడాది ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ జరుగాల్సి ఉండటంతో.. లాక్డౌన్ అనంతరం సింధు ప్రత్యేక శిక్షణ కోసం లండన్ వెళ్లింది. అక్కడ ట్రైనింగ్ ముగించుకు ఈ తెలుగమ్మాయి నేరుగా థాయ్‌లాండ్ సూపర్ సిరీస్‌ల్లో పాల్గొంది. వారం వ్యవధిలో రెండు సిరీస్‌లు ఆడిన సింధు వాటిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటి టోర్నీలో తొలి రౌండ్ దాటలేకపోయిన సింధు.. రెండో టోర్నీ క్వార్టర్ ఫైనల్లో రచనోక్ ఇంతనోన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ పరాజయాలను పక్కన పెట్టి ఫైనల్స్‌లో సత్తాచాటాలని పీవీ సింధు దృఢ నిశ్చయంతో ఉంది.
రెండు గ్రూప్‌లు.. ఎనిమిది మంది ప్లేయర్లు..
బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్‌ల తరహాలో కాకుండా.. ఈ టోర్నీ గ్రూప్‌ల వారిగా సాగుతుంది. మహిళల విభాగం గ్రూప్ ‘బి’లో పీవీ సింధుతో పాటు ప్రపంచ రెండో ర్యాంకర్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ), ప్రపంచ మూడో ర్యాంకర్ రచనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్), చోచువాంగ్ (థాయ్‌లాండ్) ఉన్నారు. ఫలితంతో సంబంధం లేకుండా మూడు మ్యాచ్‌లు ఆడనున్న సింధు.. అందులో రెండింట్లో నెగ్గితే నాకౌట్‌కు దూసుకెళ్తుంది. రెండు గ్రూప్‌ల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరేసి ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు చేరుతారు. ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గ్రూప్-ఏలో ఉన్నప్పటికీ.. సింధుకు తై జూ యింగ్, రచనోక్ ఇంతనోన్‌తో తీవ్ర పోటీ ఎదురయ్యే చాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా తైజూతో సింధు రికార్డు చెత్తగా ఉంది. ఇరువురి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సింధు 5-15తో వెనుకంజలో ఉంది. వీరిద్దరు తలపడ్డ గత రెండు మ్యాచ్‌ల్లో తైజూనే గెలుపొందింది.
శ్రీకాంత్‌కు చక్కటి చాన్స్..
పురుషుల గ్రూప్ ‘బి’లో కీడాంబి శ్రీకాంత్‌తో పాటు అండర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్), వాంగ్ జూ వుయ్ (చైనీస్ తైపీ), లాంగ్ అంగుస్ (హాంకాంగ్) పోటీ పడుతున్నారు. 2014 సూపర్ సిరీస్ మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన శ్రీకాంత్.. ఈ సారి ఎలాంటి ఆటతీరు కనబరుస్తాడో చూడాలి. తన సహచర ఆటగాడు సాయి ప్రణీత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి మధ్యలోనే తప్పుకున్న శ్రీకాంత్.. కఠిన శిక్షణ అనంతరం తిరిగి సత్తాచాటాలని భావిస్తున్నాడు. డబుల్స్ విభాగాల్లో భారత నుంచి టాప్-8లో ఎవరూ లేకపోవడంతో మనవాళ్లకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కలేదు.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా