మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 13, 2020 , 00:44:14

తలుపులు మూసి తలపడాల్సిందే..

తలుపులు మూసి తలపడాల్సిందే..

ఐపీఎల్‌ అంటేనే.. ఉత్సాహం, ఉల్లాసం, కేరింతలు, భారీ జనసందోహం..అభిమాన ఆటగాళ్ల విన్యాసాలు చూసేందుకు బారులు తీరే ప్రేక్షక గణం. అబ్బురపరిచే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ఎలాగైనా తిలకించి తీరాలనుకునే ఫ్యాన్‌ బ్యాచ్‌.. ఇసుకేస్తే రాలని జనజాతర..! ఇదంతా ఒకప్పటి మాట.. ఈసారి మాత్రం లీగ్‌కు ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ అంతకంతకు ప్రబలుతుండటంతో.. భారీ సంఖ్యలో జనాలు ఒక్క చోట చేరడం మంచిది కాదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించుకోవాలని తేల్చిచెప్పింది. దీనికి తోడు విదేశీ క్రికెటర్లకు వచ్చే నెల 15వరకు వీసాలు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అటు విదేశీ ఆటగాళ్లు లేక ఇటు ప్రేక్షకులు లేక కాసులతో గలగలలాడే ఐపీఎల్‌ కళా విహీనంగా తయారైంది. అసలు లీగ్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇలాగే వైరస్‌ విజృంభణ కొనసాగితే ఈయేడాది ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. శనివారం జరిగే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీలో లీగ్‌ భవిష్యత్‌పై కీలక నిర్ణయం వెలువడనుంది. మరోవైపు కరోనా వైరస్‌ కరాళనృత్యంతో ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడగా, మరికొన్ని రద్దయ్యాయి.

  • మైదానాల్లో ప్రేక్షకుల్లేకుండానే ఐపీఎల్‌ మ్యాచ్‌లు
  • కరోనా భయంతో జనసమూహానికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ‘నో’
  • ఏప్రిల్‌ 15 వరకు విదేశీ క్రికెటర్లకు అనుమతి నిరాకరణ

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై కరోనా ప్రభావం గట్టిగా పడింది. కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఇప్పటికే విదేశీ ఆటగాళ్ల వీసాలపై ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం.. తాజాగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించింది. వచ్చే నెల 15 వరకు క్రీడాపోటీలు వీక్షించేందుకు భారీగా జనాలు గుమిగూడకుండా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు లేక లీగ్‌ కళతప్పుతుందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా.. తాజా నిర్ణయంతో మైదానాలు కూడా బోసిపోనున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. శనివారం జరిగే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం అనంతరం 13వ సీజన్‌ నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.


ఒక్కచోట చేరొద్దనే..

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29న వాంఖడే వేదికగా.. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 4 వేల మంది మృత్యువాత పడగా.. లక్ష మందికి పైగా చికిత్స పొందుతున్నారు. మనదేశంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 70కి చేరడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ‘ఏ క్రీడా పోటీల కోసమైనా భారీ జన సమూహాలు ఒక్కచోట చేరకుండా చూడాలి. వీలైతే టోర్నమెంట్‌లను రద్దు చేయాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఖాళీ స్టేడియాల్లో ఆటలు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను అనుమతించొద్దు. బీసీసీఐ సహా అన్నీ క్రీడా సమాఖ్యలు వైద్య, ఆరోగ్య  శాఖ తాజా ఆదేశాలు పాటించాలని కోరాం’ అని కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి రాధేశ్యామ్‌ జులానియా స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం బుధవారమే దౌత్య, ఉద్యోగ సంబంధిత వీసాలు మినహా.. అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. దీంతో వాణిజ్య వీసాల విభాగంలోకి వచ్చే విదేశీ ఆటగాళ్లు భారత్‌కు రావడం కష్టమైపోయింది. ఏప్రిల్‌ 15 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటివరకు లీగ్‌ తొలి దశ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరి కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోవడంతో పాటు ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు అంగీకరిస్తాయా లేక.. లీగ్‌ వాయిదాకు పట్టుబడుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం తర్వాతే ఈ అంశంపై క్లారిటీ రానుంది.


ఫ్రాంచైజీలకు ఇబ్బందేంలేదు!

భారీ జన సమీకరణ జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఖాళీ మైదానాల్లో నిర్వహించడం కొత్తగా అనిపించినా.. ఈ నిర్ణయం వల్ల ఫ్రాంచైజీలకు వచ్చే నష్టమేమీ లేదు. వాయిదా వేయడం లేదా రద్దు చేయడం కన్నా.. ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు జరిగితేనే మంచిదని ఫ్రాంచైజీ యజమానులు భావిస్తున్నట్లు సమాచారం. టికెట్ల ఆదాయాల్లో ఫ్రాంచైజీలకు వాటా ఉన్నా.. దాని వల్ల వచ్చే నష్టం తక్కువే. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ముందస్తు బీమా సైతం ఉంటుంది. ఇక మైదానంలో యాడ్‌ రెవెన్యూ రూపంలో కాస్త దెబ్బపడినా.. దానికి రెండింతల మొత్తాన్ని ప్రసార మాద్యమాల ద్వారా తిరిగి పొందొచ్చు.


వాళ్లు లేకుంటే..

ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌ 12 సీజన్‌లను గమనిస్తే.. ప్రతిసారి ఎవరో ఒక విదేశీ ఆటగాడు స్టార్‌గా ఎదిగిన విషయం అవగతమవుతుంది. ప్రతి టీమ్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లకు తుది జట్టులో ఉండే చాన్స్‌ ఉండటంతో.. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఆటగాళ్లకే ఫ్రాంచైజీలు ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు కల్పిస్తాయి. అలాంటిది విదేశీ ఆటగాళ్లు లేకుంటే మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. ఇది లీగ్‌ మనుగడకే ముప్పు తెచ్చే ప్రమా దం లేకపోలేదు. ప్రేక్షకులను అనుమతించకున్న ఫర్వాలేదు కానీ.. విదేశీ  ఆటగాళ్లను ఆడనిస్తే అదే పదివేలు అని ఫ్రాంచైజీల యజమానులు భావిస్తున్నారు.


ఆటలు అవసరమా..!

మహమ్మారి కారణంగా ప్రాణాలు పోతుంటే ఆటలు అవసరమా అనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు లీగ్‌ నిర్వహణకు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీకి వైరస్‌ భయం పట్టుకోవడంతో అరుణ్‌జైట్లీ-ఫిరోజ్‌ షా కోట్లాలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 


బాక్సర్లకు స్పెషల్‌ వెల్‌కమ్‌

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో దుమ్మురేపి తొమ్మిది టోక్యో (2020) బెర్తులు ఖరారు చేసుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మన బాక్సర్లను భారత బాక్సింగ్‌ సమాఖ్య ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచింది. 


కరోనా బారిన  క్రీడా టోర్నీలు 

కరోనా వైరస్‌ కారణంగా దేశంలో టోర్నీలు వాయిదా పడుతూనే ఉన్నాయి. వైరస్‌ అంతకంతకు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగా ప్రేక్షకులు లేకుండా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ బారిన పడ్డ  కొన్ని టోర్నీలు ఇవి. 

అథ్లెటిక్స్‌: ఫెడరేషన్‌ కప్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌(ఏప్రిల్‌ 6-8) 

బ్యాడ్మింటన్‌: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌(మార్చి 24-29) 

బాస్కెట్‌బాల్‌: ఫిబా అర్హత టోర్నీ(మార్చి 18-22) 

క్రికెట్‌: ఏప్రిల్‌ 15వరకు ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యంపై సందేహం. 

  • దక్షిణాఫ్రికాతో లక్నో, కోల్‌కతాలో జరిగే వన్డేలు ప్రేక్షకులు లేకుండానే సాగే అవకాశం 
  • ప్రేక్షకులు హాజరు లేకుండానే రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ చివరి రోజు ఆట
  • రోడ్‌సెఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ రద్దు(మార్చి 7-22) 

ఫుట్‌బాల్‌: ఖాళీ స్టేడియంలో కోల్‌కతా, చెన్నై మధ్య ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌(మార్చి 14) 

  • భారత్‌, ఖతార్‌ మధ్య భువనేశ్వర్‌లో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ వాయిదా(మార్చి 26), భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌(జూన్‌ 9)
  • సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌లు వాయిదా(ఏప్రిల్‌ 14-27) 
  • ఐ లీగ్‌ మిగిలిన  28 మ్యాచ్‌లు ఖాళీ స్డేడియాల్లో నిర్వహణ 

గోల్ఫ్‌: ఇండియా ఓపెన్‌ వాయిదా(మార్చి 19-22) 

పారాస్పోర్ట్స్‌: ఆల్‌ నేషనల్‌, స్టేట్‌ చాంపియన్‌షిప్‌లు ఏప్రిల్‌ 15వరకు వాయిదా 

షూటింగ్‌: న్యూఢిల్లీలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్‌ ప్రపంచకప్‌ వాయిదా(మార్చి 15-25) 


ఐఎస్‌ఎల్‌ ఫైనల్లో ప్రేక్షకులకు నోఎంట్రీ..

మార్చి 14న గోవా వేదికగా జరుగాల్సిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఖాళీ కుర్చీల మధ్యే జరుగనుంది. ఇక రంజీ ఫైనల్‌ చివరి రోజు ఆటతో పాటు.. ఇండి యా ఓపెన్‌ కూడా ప్రేక్షకులను అనుమతించకుండానే నిర్వహించనున్నారు. ఇక మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ టోర్నీల సంఖ్య రోజు రోజు కు పెరిగిపోతూనే ఉంది. ఈ వైరస్‌ ప్రభావం ఇలా గే సాగితే.. టోక్యో ఒలింపిక్స్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశాలు లేకపోలేదు. 


logo
>>>>>>