గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Jul 29, 2020 , 02:15:55

ఆగస్టు 2న భేటీ

 ఆగస్టు 2న భేటీ

  • ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ జీసీ సమావేశం..  లీగ్‌ షెడ్యూల్‌కు తుదిరూపు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2020 నిర్వహణకు రంగం సిద్ధం కాబోతున్నది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న లీగ్‌ కోసం బీసీసీఐ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే బీసీసీఐ నుంచి ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) అధికారికంగా లేఖ అందుకోగా, తాజాగా లీగ్‌ను ఎలా నిర్వహించాలనే దానిపై బోర్డు సమావేశం కాబోతున్నది. వచ్చే నెల 2న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌(జీసీ) ఆన్‌లైన్‌లో భేటీ కాబోతున్నది. ఇందులో లీగ్‌ నిర్వహణ కోసం తీసుకోబోతున్న అంశాలపై బోర్డు సభ్యులు కూలంకషంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని లీగ్‌ను బయో బబుల్‌ వాతావరణంలో నిర్వహించే ఆలోచనలో ఉన్న బీసీసీఐ అందుకు తగ్గట్లు ప్రామాణిక నిర్వహణ పద్ధతి(ఎస్‌వోపీ) మార్గదర్శకాలను విడుదల చేయనుంది. లీగ్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీలు ఎస్‌వోపీని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీలో చర్చించిన అనంతరం ఎస్‌వోపీ మార్గదర్శకాలను ఫ్రాంచైజీలకు అందజేస్తామని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం మీడియాతో అన్నారు. 

గంగూలీ, జై షా హాజరు: 

ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆన్‌లైన్‌ భేటీకి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా హాజరు కానున్నారు. ఈనెల 27తో వీరి పదవీకాలం ముగిసినా..జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులపై వీరు..సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కమిటీ ప్రతిపాదించిన కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌పై వచ్చే నెల 17న సుప్రీం కోర్టు విచారించే అవకాశముంది. 


logo