బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 13, 2020 , 00:36:54

ఫస్ట్‌ హాఫ్‌ సూపర్‌ హిట్‌

ఫస్ట్‌ హాఫ్‌ సూపర్‌ హిట్‌

హోరాహోరీ సమరాలు.. ఉత్కంఠ విజయాలు.. అనూహ్య మలుపులతో ఇప్పటి వరకు 24 రోజుల్లో 28 మ్యాచ్‌లతో ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తొలి అర్ధభాగం ముగిసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా హౌజ్‌ఫుల్‌ కాకున్నా.. ఫస్ట్‌ హాఫ్‌ అదిరిపోవడంతో.. సెకండ్‌ హాఫ్‌లో బొమ్మ దద్దరిల్లడం ఖాయంగానే కనిపిస్తున్నది. మరి ఈ దశలో ప్లే ఆఫ్స్‌ రేసులో ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే.. 

లీగ్‌ దశలోని 56 మ్యాచ్‌ల్లో సోమవారంతో 28 పూర్తయ్యాయి. ప్రతీ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడేసింది. ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తుండగా.. పంజాబ్‌ అట్టడుగున ఉంది. అన్నివిభాగాల్లో హేమాహేమీలతో మంచి జోష్‌లో ఉన్న ముంబై ఐదు విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే.. యువ ఆటగాళ్ల అండతో ఢిల్లీ కూడా పది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు మరో రెండు మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కొట్టేయడం దాదాపు ఖాయమే. కోల్‌కతా, బెంగళూరు కూడా తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు కష్టపడుతున్నాయి. హైదరాబాద్‌, రాజస్థాన్‌ మూడేసి విజయాలతో ముందంజ వేయాలని తహతహలాడుతున్నాయి. మూడుసార్లు చాంపియన్‌ చెన్నై పరిస్థితే కాస్త ఆందోళనగా కనిపిస్తున్నది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదరక.. బౌలింగ్‌లో ప్రభావం చూపలేక ఈ సీజన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ధోనీ సేన మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిస్తేనే ముందంజ వేస్తుంది.

పంజాబ్‌కు కష్టమే..

ఎనిమిది జట్లలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్‌ నెగ్గిన రాహుల్‌ సేన మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌ ఆటగాళ్లే ఉన్నా.. బౌలింగ్‌లో పస లేక ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

సన్‌ ‘రైజ్‌'అయ్యేనా..!

ఇప్పటి వరకు మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్‌ ఐదో స్థానంలో ఉంది. మిషెల్‌ మార్ష్‌, భువనేశ్వర్‌ కుమార్‌ గాయపడటంతో కాస్త డీలాపడ్డ సన్‌రైజర్స్‌.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి.