బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Jul 31, 2020 , 00:30:45

నవంబర్‌ 10న ఐపీఎల్‌ ఫైనల్‌!

నవంబర్‌ 10న ఐపీఎల్‌ ఫైనల్‌!

ముంబై: యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ చెప్పినట్లు నవంబర్‌ 8న కాకుండా రెండు రోజులు ఆలస్యంగా 10వ తేదీన తుదిపోరు జరిగే చాన్స్‌లు ఉన్నాయి. ఐపీఎల్‌ ప్రసారదారు స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ కోరిక మేరకు దీపావళి సమయంలో ఫైనల్‌ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ప్రకటనల రూపంలో మరింత ఆదాయం ఆర్జించేందుకు స్టార్‌ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ రెండు రోజులు ఫైనల్‌ ఆలస్యంగా జరిగితే..ఆస్ట్రేలియా పర్యటనకు యూఏఈ నుంచే టీమ్‌ఇండియా నేరుగా బయల్దేరాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని జట్లకు చెందిన ఆటగాళ్లు కూడా యూఏఈలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఉండిపోనున్నారు. ఒక వేళ నవంబర్‌ 8న కాకుండా 10న జరిగితే ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌ తొలిసారి ఆదివారం జరిగే ఆస్కారం లేకుండా పోతుంది. అయితే మరో మూడు రోజుల్లో జరుగనున్న ఐపీఎల్‌ పాలక మండలి భేటీలో ఫైనల్‌పై తుది నిర్ణయం వెలువడనుంది. భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బ్రిజేశ్‌ పటేల్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్లే ఫ్రాంచైజీలు తమ ఏర్పాట్లలో మునిగిపోయాయి.logo