గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 02:38:33

టైటిల్‌ వేటలో

టైటిల్‌ వేటలో

  • క్వాలిఫయర్‌-2లో ఢిల్లీతో హైదరాబాద్‌ ఢీ

యాభై రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. క్వాలిఫయర్‌-1లో అద్భుత విజయంతో ముంబై తుదిపోరులో అడుగుపెడితే.. హైదరాబాద్‌, ఢిల్లీ మధ్య జరుగనున్న క్వాలిఫయర్‌-2తో మరో ఫైనలిస్ట్‌ ఎవరో నేడు తేలిపోనుంది. గత నాలుగు మ్యాచ్‌లు నెగ్గి ఊపు మీదున్న హైదరాబాద్‌ను.. ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓడిన ఢిల్లీ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి!

రైజర్స్‌ నెగ్గాలంటే..

ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బెస్ట్‌ బౌలింగ్‌ దళంగా గుర్తింపు తెచ్చుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. బౌలర్ల దమ్ముతోనే ఈ సీజన్‌లోనూ దుమ్మురేపుతున్నది. ఈ సారి హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే అనిపించినా.. చివరి మూడు మ్యాచ్‌ల్లో చక్కటి విజయాలతో ముందంజ వేసిన వార్నర్‌ సేన.. ఎలిమినేటర్‌లో బెంగళూరును ఇంటిదారి పట్టించింది. ఇదే జోరు కొనసాగిస్తే.. ఢిల్లీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు.

వీళ్లు కీలకం..

బ్యాటింగ్‌లో వార్నర్‌, విలియమ్సన్‌, హోల్డర్‌.. బౌలింగ్‌లో రషీద్‌, సందీప్‌, నటరాజన్‌ కీలకం కానున్నారు. బెయిర్‌స్టోను పక్కనపెట్టి హోల్డర్‌ను తీసుకోవడంతో జట్టులో సమతూకం వచ్చింది. పదునైన బౌన్సర్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెడుతున్న హోల్డర్‌.. బ్యాటింగ్‌లోనూ చక్కటి ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాలందిస్తున్నాడు. మనవాళ్లు సమిష్టిగా ఇదే జోరు కొనసాగిస్తే.. అయ్యర్‌ సేనకు కష్టాలు తప్పకపోవచ్చు.

ఢిల్లీ కథే వేరు.. 

ఐపీఎల్‌లో మిగిలిన జట్లన్నీ.. టైటిల్‌ కోసం పోటీలు పడుతుంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం పుష్కరకాలంగా తుదిపోరుకు చేరేందుకే నానా తంటాలు పడుతున్నది. 12 సీజన్‌లలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేకపోయిన ఢిల్లీ.. ఈ సారి రాత మార్చుకోవాలని పట్టుదలతో కనిపిస్తున్నది. ‘దేశీ బాయ్స్‌'తో కళకళలాడుతున్న క్యాపిటల్స్‌ గత ఆరు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తప్పిదాలను సరిదిద్దుకొని సమిష్టిగా సత్తాచాటితేనే ఫైనల్‌ కోరిక తీరుతుంది.

వీళ్లపైనే భారం..

ఈ సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధవన్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పైనే ఢిల్లీ ఎక్కువగా ఆధారపడుతున్నది. గత మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన స్టొయినిస్‌, పంత్‌ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నది. 

ఈ సీజన్‌లో హైదరాబాద్‌ నెగ్గిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఎనిమిది మంది వేర్వేరు ఆటగాళ్లకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డులు దక్కాయంటే.. మనవాళ్ల టీమ్‌ వర్క్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2014 నుంచి ఐపీఎల్‌ ఆడిన ప్రతిసారి 500 పరుగుల మైలురాయి దాటిన వార్నర్‌ నాయకుడిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో ‘డేవిడ్‌ భాయ్‌'ఇదే జోరు కొనసాగిస్తే రైజర్స్‌ కప్పుకొట్టడం పక్కా.

వేగం ఉన్నా..

ఐపీఎల్‌లోనే అత్యంత వేగంగా బంతులు విసురుతున్న నోర్జే, రబాడ నిలకడగా రాణిస్తున్నా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించలేకపోతున్నారు. రబాడ వికెట్లు పడగొడుతున్నా.. డెత్‌ ఓవర్స్‌లో పరుగులు నియంత్రించడంలో విఫలమవుతున్నాడు. సీనియర్‌ అశ్విన్‌, అక్షర్‌ స్పిన్‌ బాధ్యతలు చక్కగా మోస్తున్నారు.

ముఖాముఖి..

ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌దే పైచేయి అయింది. రెండు సార్లూ మొదట బ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌.. తొలిసారి బౌలింగ్‌ బలంతో, రెండోసారి బ్యాటింగ్‌తో గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ బౌలర్లు 17 వికెట్లు పడగొడితే.. ఢిల్లీ బౌలర్లు 6 వికెట్లే తీశారు. రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఒక్కడే 6 వికెట్లు పడ గొట్టడం కొసమెరుపు.

8 అబుదాబిలో జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట ఛేజింగ్‌ చేసిన జట్లే గెలిచాయి.

ఉత్కంఠ పోరాటాల్లో తేలిపోయే ఢిల్లీ.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏడు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడి అందులో ఆరింట ఓడింది. ఆ గెలిచిన ఒక్కటి హైదరాబాద్‌పైనే కావడం  క్యాపిటల్స్‌కు ఊరటనిచ్చే అంశం.