గురువారం 09 జూలై 2020
Sports - Apr 17, 2020 , 08:44:36

కరోనా ఖాతాలో ఐపీఎల్‌!

కరోనా ఖాతాలో ఐపీఎల్‌!

  • లీగ్‌ 13వ సీజన్‌ వాయిదా 
  • బీసీసీఐ అధికారిక ప్రకటన
  • ఆతిథ్యానికి సిద్ధమన్న లంక బోర్డు

కరోనా వైరస్‌ క్రీడా టోర్నీలను నీడలా వెంటాడుతున్నది. చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఖాతాలో ఐపీఎల్‌ కూడా చేరిపోయింది. ఇప్పటికే ఈ ప్రమాదకర వైరస్‌తో ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడగా, ఘన చరిత్ర కల్గిన వింబుల్డన్‌ ఏకంగా రద్దయ్యింది. ఇలా రెండింటికే పరిమితం గాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు వైరస్‌ బారిన పడినవే. రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్న వేళ..దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. పరిస్థితులు సద్దమణిగాక అప్పుడు ఆలోచిద్దామంటూ బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించింది. 

న్యూఢిల్లీ: ఐపీఎల్‌పై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఫ్రాంచైజీలు, విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న వార్తలకు కొనసాగింపుగా బీసీసీఐ గురువారం స్పష్టత ఇచ్చింది. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ తదుపరి ప్రకటన వచ్చేంత వరకు లీగ్‌ 13వ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బోర్డు స్పష్టంగా పేర్కొంది. దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం గత నెల 29 నుంచి మొదలుకావాల్సి ఉన్నా..కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈనెల 14 వరకు వాయిదా వేశారు. 

అయితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడంతో లాక్‌డౌన్‌ను పొడిగించక తప్పలేదు. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘ కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. తదుపరి నోటీసు వచ్చేంత వరకు లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసేందుకు బీసీసీఐ ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ఆటలో భాగమైన మన దేశ ప్రజల ఆరోగ్యం మొదటి ప్రాధాన్యం. పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత  ఫ్రాంచైజీల యజమానులు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, స్టేక్‌ హోల్డర్లతో       చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, క్రికెట్‌ సంఘాల సలహాలు, సూచనలు అనుసరిస్తూ ముందుకు వెళ్తాం’ అని షా అన్నాడు. 


సెప్టెంబర్‌లో ఐపీఎల్‌! 

ప్రస్తుతమున్న ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టీపీ) ప్రకారం అంతర్జాతీయ షెడ్యూల్‌ చాలా బిజీగా ఉంది. అయితే సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌ను రద్దు చేయడం లేక..టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తే ఐపీఎల్‌ నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఐపీఎల్‌ కోసం ఆసియా కప్‌ను రద్దు చేస్తే ఊరుకోబోమని పీసీబీ చీఫ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

మేము నిర్వహిస్తాం: లంక బోర్డు 

ఐపీఎల్‌ టోర్నీని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) గురువారం ప్రకటించింది. ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు శమ్మీ సిల్వా స్పందిస్తూ లీగ్‌ నిర్వహణ విషయమై..త్వరలోనే బీసీసీఐ లేఖ రాస్తామని తెలిపారు. భారత్‌తో పోలిస్తే..శ్రీలంకలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే చనిపోయారు. 


logo