సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 19:51:37

ఐపీఎల్​ 2020: ఐదు రోజులకోసారి కరోనా పరీక్షలు

ఐపీఎల్​ 2020: ఐదు రోజులకోసారి కరోనా పరీక్షలు

న్యూఢిల్లీ: ఐపీఎల్ కోసం యూఏఈలో శిక్షణ శిబిరానికి చేరుకునేలోపే భారత ఆటగాళ్లు, సిబ్బందికి వారం వ్యవధిలో బీసీసీఐ ఏడుసార్లు కరోనా వైరస్ పరీక్షలు ‘చేయించనుంది. కనీసం ఐదుసార్లు పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిన వారినే యూఏఈలో ఏర్పాటు చేసే బయో బబుల్​లో ప్రాక్టీస్​కు అనుమతించనుంది.  అలాగే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు జరుగనున్నాయి. ఆ సమయంలో ఎవరైనా బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం ఏడు రోజుల క్వారంటైన్​లోనైనా ఉండాలని నిబంధన తెచ్చింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ముసాయిదాను రూపొందించింది.

“ఐపీఎల్ కోసం యూఏఈలో ఏర్పాటు చేసే బయో బబుల్​లో ప్రవేశించే ముందు భారత ఆటగాళ్లు, సిబ్బంది.. కొవిడ్​-19 పీసీఆర్ పరీక్షలు వారం వ్యవధిలో ప్రతి 24గంటలకు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో కనీసం ఐదుసార్లు నెగిటివ్ వచ్చిన వారు.. యూఏఈలో ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వస్తే 14రోజులు క్వారంటైన్​లో ఉండి, ఆ తర్వాత పీసీఆర్ టెస్టుల్లో రెండుసార్లు నెగిటివ్ వస్తే.. ఐపీఎల్​ ఆడేందుకు అనుమతి ఉంటుంది. యూఏఈకి వచ్చే ముందే విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది కూడా పీసీఆర్ టెస్టులు చేయించుకొని, కరోనా నెగిటివ్​గా తేలాలి. పాజిటివ్ వచ్చినవారు వారి దేశాల్లోనే క్వారంటైన్​లో ఉండి, నెగిటివ్​ వచ్చాక యూఏఈకి బయలుదేరాల్సి ఉంటుంది” అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మంగళవారం తెలిపారు.

కాగా యూఏఈకి వెళ్లాక తొలి ఏడు రోజులు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఎవరూ ఒకరినొకరు కలుసుకునే వీలులేదు, హోటల్ గదుల్లో ఒంటరిగానే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలోనూ మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. 


logo