శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 00:46:27

రాకింగ్‌ రాహుల్‌... శతక్కొట్టిన లోకేశ్‌

రాకింగ్‌ రాహుల్‌... శతక్కొట్టిన లోకేశ్‌

ఐపీఎల్‌లో సారథిగా తొలి మ్యాచ్‌లోనే తీవ్ర ఉత్కంఠ పోరును ఎదుర్కొన్న లోకేశ్‌ రాహుల్‌ రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. కళాత్మక షాట్లతో దుబాయ్‌ స్టేడియాన్ని దడదడలాడించాడు. గేర్లు మార్చుతూ సాగిన అతడి ఇన్నింగ్స్‌కు కోహ్లీ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా కలిసి వచ్చాయి. దీంతో రికార్డు సెంచరీ నమోదు చేసిన లోకేశ్‌.. భారీ స్కోరుకు బాటలు వేస్తే.. బౌలర్లు సమిష్టిగా విజృంభించి బెంగళూరును బెంబేలెత్తించారు. డెత్‌ ఓవర్స్‌లో చెత్త బౌలింగ్‌తో భారీ స్కోరు సమర్పించుకున్న  కోహ్లీ సేన.. ఛేజింగ్‌లో ఏ మాత్రం పోటీనివ్వలేక చేతులెత్తేసింది.

దుబాయ్‌: నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో లోకేశ్‌ రాహుల్‌ (69 బంతుల్లో 132 నాటౌట్‌; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) నిరూపించాడు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా.. సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో గురువారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 206 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో దూబే 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (30) టాప్‌ స్కోరర్‌. పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, మురుగన్‌ అశ్విన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

అతనొక్కడే..

18 ఓవర్లు ముగిసేసరికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్కోరు 157/3. రాహుల్‌ సెంచరీకి చేరువైనా.. మహా అయితే మరో 20 పరుగులు చేస్తుందేమో అనుకుంటే.. కేఎల్‌ రాహుల్‌ విజృంభణతో రెండు ఓవర్లలో 49 పరుగులు రాబట్టింది. అందులో రాహుల్‌ 9 బంతులు ఏదుర్కొని 42 రన్స్‌ పిండుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇన్‌ఫామ్‌ బ్యాట్స్‌మన్‌ చివరి వరకు క్రీజులో నిలిస్తే జట్టుకు ఎంత మేలు జరుగుతుందో చెప్పడానికి. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (26)తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జంట కుదురుగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి కింగ్స్‌ ఎలెవన్‌ 50/0తో నిలిచింది. పూరన్‌ (17) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. రాహుల్‌ మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. మెరిపిస్తాడనుకున్న మ్యాక్స్‌వెల్‌ (5) ఇలా వచ్చి అలా వెళ్లాడు. దీంతో భారీ స్కోరు కష్టమే అనుకుంటే లోకేశ్‌ విజృంభణతో పంజాబ్‌ చివరి 4 ఓవర్లలో 74 పరుగులు చేసింది. అందులో రాహుల్‌ ఒక్కడే 60 రన్స్‌ కొట్టడం విశేషం. ఈ క్రమంలో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఎనిమిదేండ్ల రికార్డును రాహుల్‌ బద్దలు కొట్టాడు. 

ఒకరి వెంట ఒకరు..

భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. 1/2, 2/3, 3/4.. ఇలా స్కోరు బోర్డుపై రెండంకెల స్కోరు నమోదు కాకముందే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న దేవదత్‌ పడిక్కల్‌ (1)ను కాట్రెల్‌ బోల్తా కొట్టించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఫిలిప్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. బెంగళూరుకు అసలు దెబ్బ మాత్రం కోహ్లీ (1) రూపంలో తగిలింది.  పుల్‌షాట్‌ ఆడే క్రమంలో విరాట్‌ కొట్టిన బంతిని రవి బిష్ణోయ్‌ అందుకోవడంతోనే రాయల్‌ చాలెంజర్స్‌ ఆశలు ఆవిరయ్యాయి.  అద్భుతాలు చేస్తారేమో అనుకున్న ఫించ్‌ (20), డివిలియర్స్‌ (28) కూడా ఎక్కువసేపు నిలువలేకపోవడంతో సగం ఓవర్లు ముగియకముందే కోహ్లీసేన ఓటమి ఖాయమైంది. చివర్లో సుందర్‌, శివమ్‌ దూబే (12) కాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. 

జోన్స్‌కు సంతాపంగా.. 

  • ఆసీస్‌ మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌జోన్స్‌ మృతికి సంతాపంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు చేతులకు నల్ల రిబ్బన్లతో బరిలో దిగారు. 
  • ఐపీఎల్‌లో ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోరును రాహుల్‌      (132 నాటౌట్‌) తన పేరిట రాసుకున్నాడు. పంత్‌ (128 నాటౌట్‌) రెండో స్థానంలో ఉన్నాడు. 
  •  ఈ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ కాగా..ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది రెండో శతకం.
  • లీగ్‌లో వేగంగా (60 ఇన్నింగ్స్‌ల్లో) 2 వేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ (63 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉంది.

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (నాటౌట్‌) 132, మయాంక్‌ (బి) చాహల్‌ 26, పూరన్‌ (సి) డివిలియర్స్‌ (బి) దూబే 17, మ్యాక్స్‌వెల్‌ (సి) ఫించ్‌ (బి) దూబే 5, కరుణ్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 206/3. వికెట్ల పతనం: 1-57, 2-114, 3-128, బౌలింగ్‌: ఉమేశ్‌ 3-0-35-0, స్టెయిన్‌ 4-0-57-0, సైనీ 4-0-37-0, చాహల్‌ 4-0-25-1, సుందర్‌ 2-0-13-0, దూబే 3-0-33-2. 

బెంగళూరు: పడిక్కల్‌ (సి) రవి (బి) కాట్రెల్‌ 1, ఫించ్‌ (బి) రవి 20, ఫిలిప్‌ (ఎల్బీ) షమీ 0, కోహ్లీ (సి) రవి (బి) కాట్రెల్‌ 1, డివిలియర్స్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) మురుగన్‌ 28, సుందర్‌ (సి) మయాంక్‌ (బి) రవి 30, దూబే (బి) మ్యాక్స్‌వెల్‌ 12, ఉమేశ్‌ (బి) రవి 0, సైనీ (బి) మురుగన్‌ 6, స్టెయిన్‌ (నాటౌట్‌) 1, చాహల్‌ (ఎల్బీ) మురుగన్‌ 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 17 ఓవర్లలో 109. వికెట్ల పతనం: 1-2, 2-3, 3-4, 4-53, 5-57, 6-83, 7-88, 8-101, 9-106, 10-109, బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-17-2, షమీ 3-0-14-1, రవి 4-0-32-3, మురుగన్‌ అశ్విన్‌ 3-0-21-3, నీషమ్‌ 2-0-13-0, మ్యాక్స్‌వెల్‌ 2-0-10-1.