గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 02:26:02

యూఏఈకి బీసీసీఐ బృందం

యూఏఈకి బీసీసీఐ బృందం

  • ఈ నెల మూడో వారంలో పయనం! ..  ఐపీఎల్‌ ఏర్పాట్ల కోసం.. 

న్యూఢిల్లీ: యూఏఈలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించడంతో ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇందుకోసం బీసీసీఐ బృందం ఈ నెల మూడో వారం నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో పర్యటించనుందని సమాచారం. ఐపీఎల్‌ పాలక మండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌, బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమీన్‌తో పాటు పలువురు అధికారులు, ఫ్రాంచైజీల ప్రతినిధులు యూఏఈకి పయనమవనున్నారు. ఈ ఏడాది టోర్నీ టైటిల్‌ స్పాన్సర్‌ను 18వ తేదీన ఎంపిక చేశాక.. 22వ తేదీ యూఏఈకి బీసీసీఐ బృందం వెళ్లాలని అనుకుంటున్నదని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. యూఏఈలో బీసీసీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. యూఈఏకి వెళ్లనున్న బీసీసీఐ బృందం.. టోర్నీ జరిగే దుబాయ్‌, అబుదాబి, షార్జా మైదానాలకు వెళ్లనుంది. 

బయో బబుల్‌ ఏర్పాట్లను పరిశీలించనుంది. అలాగే లీగ్‌ నిర్వహణపై యూఏఈ క్రికెట్‌ బోర్డుతో పాటు ఆ దేశ కీలక మంత్రులతోనూ చర్చలు జరుపనుంది. కరోనా వైరస్‌ ప్రమాదం లేకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, పాటించాల్సిన వైద్య మార్గదర్శకాలపై సమాలోచనలు చేయనుంది. కాగా కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్ర ప్రభు త్వం సైతం అన్ని అనుమతులను మంజూరు చేసింది. 

ఈసీబీకి బీసీసీఐ అనుమతి పత్రాలు 

ఐపీఎల్‌ ఆతిథ్యానికి సంబంధించిన పూర్తి అనుమతులతో కూడిన పత్రాలను బీసీసీఐ నుంచి ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) అందుకుంది. ఈ విషయాన్ని ఈసీబీ మంగళవారం వెల్లడించింది. ‘మాకు ఇష్టమైన క్రీడలో అత్యున్నత టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నాం. క్రికెట్‌ అభిమానులంతా ఆస్వాదించేలా ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి కృషి చేస్తాం’ అని ఈసీబీ చైర్మన్‌ షేక్‌ నహయన్‌ మబారక్‌ తెలిపాడు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షల అనంతరం ఐపీఎల్‌ కోసం ఈ నెల 20వ తేదీ తర్వాత ఐపీఎల్‌ జట్లు యూఏఈకి బయలుదేరనున్నాయి. అక్కడికి వెళ్లినప్పుటి నుంచి ఆటగాళ్లు, సిబ్బంది బయో బబుల్‌లోనే ఉండనున్నారు.      

ప్రత్యేకంగా నెట్‌బౌలర్లు

ప్రత్యేకంగా నెట్‌బౌలింగ్‌ కోసమే దాదాపు పది మంది యువ బౌలర్లను ఆటగాళ్లతో పాటు యూఏఈకి తీసుకెళ్లాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నా యి. ఫస్ట్‌క్లాస్‌, అండర్‌-19, అండర్‌-23 బౌలర్లను తీసుకుకెళ్లేందుకు జాబితా ను తయారు చేసుకుంటున్నాయి. అలాగే ఢిల్లీ కూడా ఆరుగురు నెట్‌బౌలర్లను తీసుకోవాలని యోచిస్తుండగా.. మిగిలిన జట్లు ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. 


logo