గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 00:45:07

కరోనా క్రీనీడ

కరోనా క్రీనీడ

కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్నది. చైనాలో పుట్టి శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్‌ మహమ్మారి వల ్లలక్షల మంది ప్రభావితం అవుతూనే ఉన్నారు. కరోనా వల్ల ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడుతుండగా, అసలు టోక్యో ఒలింపిక్స్‌ జరుగుతాయా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. వైరస్‌ ప్రభావం ఇలాగే కొనసాగితే విశ్వక్రీడల నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, షెడ్యూల్‌ ప్రకారం కాకపోయినా..ఈ యేడాదిలోనే నిర్వహిస్తామని జపాన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నది. ఒకవేళ పరిస్థితులు చేయిదాటితే ఏంటన్న దానిపై ఇప్పటికిప్పుడే తుది నిర్ణయానికి రాలేకపోతున్నది.

  • టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధం షెడ్యూల్‌ ప్రకారమేనన్న ఐవోసీ

లుసానే/టోక్యో: క్రీడా ప్రపంచంపై ప్రమాదకర కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్నది. చైనా నుంచి 60కు పైగా దేశాలకు ఈ వైరస్‌ వ్యాప్తిచెందింది. చైనాలో ఇప్పటికే 3,100 మందికి పైగా మృతి చెందగా.. దక్షిణకొరియా, ఇటలీ, ఇరాన్‌లో వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నది. ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9వరకు ఒలింపిక్స్‌ జరగాల్సిన జపాన్‌లోనూ 230 కరోనా కేసులు నమోదవడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నది. విశ్వక్రీడల నిర్వహణే సందిగ్ధంలో పడింది.  ఈ విషయంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ)వరుస ప్రకటనలు చేస్తున్నా పూర్తి స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. మరోవైపు జపాన్‌ క్రీడా శాఖ మాత్రం విశ్వక్రీడలు వాయిదా పడతాయనేలా వ్యాఖ్యలు చేస్తున్నది. ప్రస్తుతం ఒలింపిక్‌ క్వాలిఫికేషన్స్‌తో పాటు చాలా టోర్నీలు రద్దు లేదా వాయిదా పడుతున్నాయి. కొన్ని టోర్నీలు జరుగుతున్నా వాటికి ప్రేక్షకులు రాకపోవడంతో మైదానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. 


ఎప్పుడైనా నిర్వహించొచ్చు: జపాన్‌ మంత్రి 

జూలైలో విశ్వక్రీడల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఐవోసీ చెప్పగా.. జపాన్‌ క్రీడా శాఖ మంత్రి సీకో హషిమొటో మాత్రం వాయిదా పడొచ్చనేలా వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏ సమయంలోనైనా ఒలింపిక్స్‌ నిర్వహించే వెసులుబాటు ఉందంటూ చెప్పారు. పార్లమెంట్‌ ఎగువ సభలో ఎదురైన ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘2020లో నిర్వహించలేకుంటేనే విశ్వక్రీడలను రద్దు చేసే అధికారం ఐవోసీకి ఉంటుంది. ఈ క్యాలెండర్‌ ఏడాది ముగిసేలోపు ఎప్పటికైనా వాయిదా వేసుకోవచ్చని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’ అని హషిమొటో బదులిచ్చారు. మరోవైపు ఐవోసీ మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ జరుగుతాయని చెబుతున్నది.


ఏర్పాట్లు చేస్తున్నాం : ఐవోసీ

మరో ఐదు నెలల్లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఐవోసీ మంగళవారం ప్రకటించింది. లుసానేలో రెండు రోజుల పాటు జరిగిన  ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం అనంతరం ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ మాట్లాడాడు. ప్రస్తుతమైతే జూలైలోనే ఒలింపిక్స్‌ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పాడు. ఏవైనా తుది నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అది జూన్‌లోనే అని వెల్లడించాడు. జూన్‌ 15-17 మధ్య ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మరోసారి సమావేశం కానుంది. 


నో షేక్‌ హ్యాండ్స్‌

అనారోగ్యం ప్రబలుతున్న కారణంగా తదుపరి శ్రీలంక పర్యటనలో ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించుకున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ చెప్పాడు. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టు సందర్భంగా 10మంది ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బంది జ్వరం బారిన పడడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పాడు. బ్యాక్టీరియా, క్రిములను నివారించేందుకు తమ వైద్య బృందం ఈ సూచనలు చేసిందని చెప్పాడు. అయితే సఫారీలతో సిరీస్‌లో అనారోగ్యం నుంచి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు త్వరగానే కోలుకోగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆ జట్టే కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ సైతం వ్యాపిస్తుండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని ఇంగ్లండ్‌ అనుకుంటున్నది. ఎన్‌బీఏ సైతం ఆటగాళ్లను హెచ్చరించింది. అభిమానులకు కరచాలనాలు, హైఫైలు ఇవ్వొద్దని సూచించింది.


ఐపీఎల్‌పైనా ప్రభావం!

ఈ నెల 29న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌పై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఆగ్నేయాసియా నుంచి ప్లేయర్లెవరూ టోర్నీలో పాల్గొనకున్నా.. మ్యాచ్‌లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరవ్వడమే కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.  భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో వ్యాధి వ్యాప్తిపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే, ఈ నెల 12న ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌కు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. అసలు ఆ అంశం గురించి సమావేశంలో చర్చించలేదని తెలిపాడు. ప్రస్తుతానికి వైరస్‌ వల్ల ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కూడా వెల్లడించాడు. 


logo