శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 01:00:54

వాలీబాల్‌ C/O ఇనుగుర్తి

వాలీబాల్‌ C/O ఇనుగుర్తి

  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు
  • స్పోర్ట్స్‌ కోటాలో 60 మందికి ఉద్యోగాలు

సరైన సదుపాయాలే కాదు.. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. అక్కడ ప్రాక్టీస్‌ చేసినవాళ్లు నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ మట్టిలో ఆట నేర్చుకున్న ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన వరంగల్‌కు యాభై కిలోమీటర్లు.. ప్రస్తుత జిల్లా కేంద్రం మహబూబాబాద్‌కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మారుమూల గ్రామమే ఇనుగుర్తి. సరదాగా వాలీబాల్‌ ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టిన స్థానిక యువతకు కొమురయ్య సార్‌ దిశానిర్దేశం తోడవడంతో మట్టిలో మాణిక్యాలయ్యారు. ప్రతిభకు పరిమితులుండవని నిరూపిస్తున్న ఇనుగుర్తి క్రీడాకారులపై ప్రత్యేక కథనం.. 

మహబూబాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): సుమారు ఐదు దశాబ్దాలకు ముందు నాటిన విత్తనం నేడు మహావృక్షంగా మారి ఫలాలనిస్తున్నది. వ్యాయామం కోసమని ప్రారంభించిన ఆ క్రీడ.. వారికి మెరుగైన ఉపాధితో పాటు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సరదాగా నేర్చుకున్న వాలీబాల్‌ క్రీడ.. స్థానిక యువతకు ప్రభు త్వ ఉద్యోగాల వైపు మళ్లించింది. యాభై ఏండ్ల క్రితం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఇనుగుర్తి పాఠశాలలో అడుగుపెట్టిన కందునూరి కొమురయ్య ప్రోత్సాహంతో వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకున్న 60 మంది ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో భారత మాజీ కెప్టెన్‌ వెంకటనారాయణ, ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ స్పోర్ట్స్‌ అధికారి మల్లారెడ్డితో పాటు పలువురు ఆర్టీసీ, ఎక్సైజ్‌, రెవెన్యూ, పోలీస్‌, విద్యాశాఖ, డీఆర్‌డీఏలో ఉద్యోగాలు చేస్తున్నారు. 

టెక్నిక్‌కు పెట్టింది పేరు


గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం పూట సరదాగా ఆడుకునే వాలీబాల్‌ ఆట ఇనుగుర్తికి ఇంత పేరు తెచ్చిపెట్టింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని.. సవాళ్లను అధిగమిస్తేనే ఫలితాలు సాధించగలమని నమ్మిన యువత క్రమశిక్షణతో ముందుకు సాగడం వల్లే అది సాధ్యపడింది. ఆరంభం నుంచే ఆటలోని టెక్నిక్‌ నేర్చుకునే ఇక్కడి యువత.. దాన్ని కెరీర్‌ ఆసాంతం కొనసాగించడం విశేషం. కఠిన పరిస్థితుల్లోనూ అత్యుత్తమ ఆటతీరు కనబర్చడం.. ఒత్తిడిలోనూ మెరుగైన ఫలితాలు రాబట్టడం ఇక్కడి ఆటగాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య. ఇనుగుర్తి నుంచి ఇంతమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చేందుకు ప్రధాన కారణం.. ఓటమి అంగీకరించని తత్వమే అని చెప్పొచ్చు. వాలీబాల్‌తో గుర్తింపు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన చాలామంది.. కొత్త కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేస్తుండటంతో ఇనుగుర్తి వాలీబాల్‌ కర్మాగారంగా కొనసాగుతున్నది. 

ఆయనే ఆద్యుడు..

గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయాలని నిర్ణయించుకున్న కొమురయ్య.. పాఠశాల ముగిసిన అనంతరం స్థానిక కుర్రాళ్లకు కబడ్డీ, వాలీబాల్‌లో శిక్షణ ఇచ్చేవారు. విద్యార్థులు వాలీబాల్‌లో కనబరుస్తున్న ప్రతిభకు ముగ్ధులైన ఆయన.. 1973లో పాఠశాల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు రాత్రి, పగలు ప్రాక్టీస్‌ చేయించేవారు. ఆయన కృషికి ఫలితంగా విద్యార్థులు ఆటలో మెరికల్లాగా తయారవడంతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగిన ఇనుగుర్తి బరిలో దిగుతుందంటే.. ప్రత్యర్థి జట్లు ముందే ఓటమిని అంగీకరించేవంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1985లో ఉద్యోగ విరమణ చేసిన కొమురయ్య.. ఆ తర్వాత కూడా కుర్రాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు. ఆయన స్ఫూర్తితో ఇనుగుర్తి నుంచి 150 మంది ఆటగాళ్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. క్రీడాభిమానులతో అభినవ ద్రోణాచార్యుడనిపించుకున్న కొమురయ్య 2012లో మృతిచెందగా.. ఆయన చూపిన మార్గంలో భిక్షపతి, రాజేందర్‌ ప్రస్తుతం యువతకు శిక్షణ ఇస్తున్నారు.

VIDEOS

logo