గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 08, 2020 , 02:31:00

ప్రాక్టీస్‌ షురూ..

ప్రాక్టీస్‌ షురూ..

 కోర్టులో చెమటోడ్చిన సింధు, సిక్కి, సాయి ప్రణీత్‌ 

 హైదరాబాద్‌: ఎన్ని రోజులకు.. ఎన్ని రోజులకు! కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలలుగా నిలిచిపోయిన బ్యాడ్మింటన్‌ ఆట ఎట్టకేలకు మళ్లీ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌-3 నిబంధనలు, భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్‌), రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శుక్రవారం బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌ ప్రారంభమైంది. టోక్యో(2020)ఒలింపిక్స్‌కు అర్హత అవకాశాలు కల్గిన ఎనిమిది మంది షట్లర్లకు సాయ్‌ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇండ్లకే పరిమితమైన షట్లర్లు కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య కోర్టులోకి అడుగుపెట్టారు. పుల్లెల గోపీచంద్‌ సాయ్‌ అకాడమీలో ప్రపంచ చాంపియన్‌ సింధుతో పాటు సాయి ప్రణీత్‌, సిక్కి రెడ్డి ప్రాక్టీస్‌ చేశారు. జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో పాటు విదేశీ కోచ్‌ పార్క్‌ టై సాంగ్‌ సమక్షంలో తొలుత ఉదయం 6.30-8.30 మధ్య సింధు ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఈ వారం రోజుల పాటు సింధు ఇదే సమయంలో ప్రాక్టీస్‌ చేస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ మీడియాకు తెలిపారు. సాయంత్రం సమయంలో సుచిత్రా అకాడమీలో ఫిట్‌నెస్‌ శిక్షణ ఉన్న కారణంగా సింధు ఉదయం షటిల్‌ ప్రాక్టీస్‌ చేస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్‌ వరకు ఎలాంటి టోర్నీలు లేకున్నా ఫిట్‌నెస్‌, ఆటపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు శ్రమించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. మరోవైపు 8.30-10.30 మధ్య సమయంలో సిక్కి రెడ్డి, సాయి ప్రణీత్‌ ప్రాక్టీస్‌ చేశారు. కొవిడ్‌-19 వ్యాప్తి దృష్ట్యా అకాడమీని పలు జోన్లుగా విభజించారని ప్రణీత్‌ పేర్కొన్నాడు. కోర్టులున్న గ్రీన్‌జోన్‌లోకి ప్లేయర్లు, కోచ్‌లకు మాత్రమే అనుమతి ఉందని చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్‌ చేయడం వలన ఒకింత అలసటకు గురయ్యానని సిక్కి చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌ అర్హతకు పోటీపడుతున్న సైనా నెహ్వాల్‌, శ్రీకాంత్‌, అశ్విని పొన్నప్ప, డబుల్స్‌ జోడీ చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌ త్వరలో ప్రాక్టీస్‌ సెషన్లలో పాల్గొనే అవకాశముంది. 


logo