మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 17, 2020 , 01:12:21

సింధు ఇక వచ్చే ఏడాదే..

సింధు ఇక వచ్చే ఏడాదే..

హైదరాబాద్‌: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు.. ఈ ఏడాది కోర్టులో అడుగుపెట్టడం అనుమానమే అనిపిస్తున్నది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఏడు నెలల తర్వాత పునఃప్రారంభమైన డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న ఈ తెలుగు షట్లర్‌.. ప్రస్తుతం తన దృష్టి టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉందని చెప్పింది. నాలుగు నెలల విరామం అనంతరం ఇటీవలే హైదరాబాద్‌లోని జాతీయ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ ప్రారంభించిన సింధు.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఆసియా ఓపెన్‌ (జనవరి 12-17)లో బరిలోకి దిగనుంది. ‘నేను టోర్నీలు ఆడటం లేదు కానీ ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నా. తిరిగి  కోర్టులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నా. ఈ ఏడు నెలలు చాలా కొత్తగా గడిచాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి ఒక్క ప్లేయర్‌ నుంచి అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే టాప్‌-10 ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలు దాదాపు సమానంగానే ఉంటాయి’అని సింధు చెప్పింది.