గురువారం 09 జూలై 2020
Sports - Jun 13, 2020 , 01:49:30

ప్రేక్షకులకు అనుమతి!

ప్రేక్షకులకు అనుమతి!

  • అభిమానుల మధ్యే భారత్‌-ఆసీస్‌ టెస్టు సిరీస్‌
  • ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌ ప్రకటన

కాన్‌బెర్రా: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్‌ఇండియా... ప్రేక్షకుల సమక్షంలోనే సిరీస్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి. 40 వేల సామర్థ్యమున్న స్టేడియాల్లో 10 వేల మంది ప్రేక్షకులతో వచ్చే నెల నుంచి ఈవెంట్లను నిర్వహించేందుకు అనుమతిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ శుక్రవారం ప్రకటించారు. ‘40 వేల సామర్థ్యమున్న ఔట్‌డోర్‌ స్టేడియాల్లో 25 శాతం మంది ప్రేక్షకులతో ఈవెంట్లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తాం’అని మారిసన్‌ ప్రకటించారు. దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రమంగా నిబంధలను సడలిస్తున్నది. దీంతో టీమ్‌ఇండియా టూర్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌నకు ప్రేక్షకులను అనుమతించనుంది. కాగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టుతో టీమ్‌ఇండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

జింబాబ్వే పర్యటన రద్దు

ఓ వైపు ఆసీస్‌ పర్యటనకు ప్రేక్షకులకు అనుమతి లభించడంతో అభిమానులు సంతోషిస్తున్న తరుణంలో టీమ్‌ఇండియా జింబాబ్వే పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లంక టూర్‌ అనంతరం ఆగస్టులో జింబాబ్వేతో జరగాల్సిన టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు.. లంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లడం లేదు’అని జై షా స్పష్టం చేశాడు. వ్యక్తిగత ప్రాక్టీస్‌ కోసం ఆటగాళ్లకు అనుమతిచ్చిన బీసీసీఐ శిక్షణ శిబిరాల విషయంలో మాత్రం పునరాలోచనలో ఉంది. కొవిడ్‌-19 వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌ను ఇప్పుడప్పుడే ప్రారంభించొద్దని భావిస్తున్నది. అనుకూలమైన వాతావరణం ఏర్పడిన తర్వాతే క్రికెటర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తామని జైషా తెలిపాడు. 

రద్దుకావడం బాధాకరం: రాజ్‌పుత్‌

టీమ్‌ఇండియా పర్యటన రద్దుకావడం బాధాకరమని జింబాబ్వే హెడ్‌ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పేర్కొన్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమ్‌ఇండియాతో ఆడాలని ప్రతీ జట్టు కోరుకుంటుందని అలాంటి అవకాశం కోల్పోవడం అసంతృప్తిగా ఉందని రాజ్‌పుత్‌ అన్నాడు. ‘పర్యటన రద్దు కావడం బాధాకరం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జైట్టెనా టీమ్‌ఇండియాతో ఆడేందుకు ఆసక్తి చూపుతుంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లయిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా వంటి వాళ్లను ఎదుర్కోవాలని అంతా ఆశిస్తారు. కానీ పరిస్థితుల ముందు ఎవరైనా తలవంచాల్సిందే’అని లాల్‌చంద్‌ చెప్పుకొచ్చాడు.


logo