మంగళవారం 07 జూలై 2020
Sports - May 29, 2020 , 22:36:02

ఒకే వేదికైనా ఓకే..

ఒకే వేదికైనా ఓకే..

భారత్‌, ఆసీస్‌ టెస్టు సిరీస్‌పై సీఏ చీఫ్‌ రాబర్ట్స్‌

మెల్‌బోర్న్‌: ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఈ ఏడాది చివర్లో జరుగనున్న భారత పర్యటనపై చాలా ఆశలు పెట్టుకుంది. కరోనా కష్టకాలంలో ఖాళీ మైదానాల్లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించడం కన్నా టీమ్‌ఇండియాతో ద్వైపాక్షిక సిరీసే లాభదాయకం అని భావించిన సీఏ.. పొట్టి ప్రపంచకప్‌ ఆతిథ్యాన్ని పక్కనబెట్టి మరీ కోహ్లీ సేనతో పోరు కోసం రెడీ అవుతున్నది. వైరస్‌ ప్రభావం వల్ల ప్రయాణ ఆంక్షలు కొనసాగితే.. టెస్టు సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడే విషయంపై కూడా దృష్టిపెట్టామని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ పేర్కొన్నాడు. గురువారం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం బ్రిస్బేన్‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీలో టెస్టు మ్యాచ్‌లు జరుగాల్సి ఉంది. ఇందులో అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు జరుగనున్న టెస్టు గులాబీ బంతితో డై అండ్‌ నైట్‌ మ్యాచ్‌గా నిర్వహించనున్నారు. అయితే కొవిడ్‌-19 ప్రభావం అప్పటికీ తగ్గకపోతే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తామని రాబర్ట్స్‌ అన్నాడు. ‘అంతర్జాతీయ ప్రయాణాలతో పాటు దేశీయ ప్రయాణాలపై కూడా అప్పటి వరకు ఆంక్షలు తొలగిపోతాయనుకుంటున్నాం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మధ్య రాకపోకల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. ఒకే మైదానంలో నాలుగు మ్యాచ్‌లు నిర్వహించడం గురించి ఆలోచిస్తాం. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది’ అని రాబర్ట్స్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా ఖాళీ మైదానాల్లో, బయో సెక్యూరిటీ పద్ధతిలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహిస్తే మరింత నష్టపోతుందని కెవిన్‌ అభిప్రాయపడ్డాడు.  


logo