ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 00:49:54

పేస్‌కు దాసోహం

పేస్‌కు దాసోహం

టెస్టు క్రికెట్‌లో భారత్‌ అత్యల్ప స్కోరు  

  • రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ 
  • గులాబీ టెస్టులో ఆసీస్‌ భారీ విజయం

ఆసీస్‌ పేసర్లు బంతికి బదులు నిప్పుగోళాలు సంధిస్తుంటే.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని అతిరథ మహారధులు పోరాటం పక్కన పెట్టి.. పెవిలియన్‌కు క్యూ కట్టారు. పేస్‌, స్వింగ్‌కు ఎదురొడ్డి పోరాడాల్సిన ముగ్గురు మొనగాళ్లు చేతులెత్తేయడంతో టీమ్‌ఇండియా తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది. రెండో రోజు ఆట తర్వాత గులాబీని హస్తగతం చేసుకునేలా కనిపించిన కోహ్లీసేన.. మూడోరోజు మెరుగైన ప్రదర్శన చేయలేక పువ్వును వదిలి ముల్లును పట్టుకుంది. 

అడిలైడ్: ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భారత్‌కు అవమానకర ఓటమి ఎదురైంది. బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యంతో టీమ్‌ఇండియా తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్పోరు నమోదు చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన డే అండ్‌ నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన 0-1తో వెనుకబడింది. కంగారూ పేసర్ల ధాటికి నిలబడలేకపోయిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైంది. హజిల్‌వుడ్‌ (5/8), కమిన్స్‌ (4/21) ధాటికి.. భారత ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం 90 పరుగుల సులభతర లక్ష్యాన్ని ఆసీస్‌ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. 

సైకిల్‌ స్టాండ్‌ను తలపిస్తూ.. 

ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్‌లో బుమ్రా (0) ఔట్‌ కాగా.. అదే స్కోరు వద్ద పుజారా (0), మయాంక్‌ (9), రహానే (0) ఔటయ్యారు. దీంతో టీమ్‌ఇండియా 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కంగారూ పేసర్లు నిప్పులు చెరగడంతో ఆ తర్వాత కూడా భారత ఇన్నింగ్స్‌ కోలుకోలేకపోయింది. కోహ్లీ (4), విహారి (8), సాహా (4) కూడా విఫలమవడంతో టీమ్‌ఇండియా 36 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 53 పరుగులతో కలుపుకొని.. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ముందుంచింది. రెండో ఇన్నింగ్స్‌లో బర్న్స్‌ (51 నాటౌట్‌), వేడ్‌ (33) రాణించడంతో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి టార్గేట్‌ ఛేదించింది.

అత్యధిక స్కోరు 

డిసెంబర్‌ 19, 2016 ఇంగ్లండ్‌పై 759/7 డిక్లేర్డ్‌

అత్యల్ప స్కోరు

డిసెంబర్‌ 19, 2020 ఆస్ట్రేలియాపై 36 ఆలౌట్‌


టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఇదే (36) అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 1974లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 42 పరుగులకు ఆలౌటైంది.సారథిగా టాస్‌ నెగ్గాక టెస్టు మ్యాచ్‌ ఓడటం కోహ్లీకి ఇదే తొలిసారి.షమీ ఔట్‌!


రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తూ గాయపడ్డ భారత పేసర్‌ మహమ్మద్‌ షమీ మిగిలిన సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిన్స్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతితో షమీ మణికట్టు ఎముక విరిగినట్లు సమాచారం. షమీ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు. ఒకవేళ అదే జరిగితే హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ అతడి స్థానాన్ని భర్తీచేస్తాడు.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 244, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 191, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) కమిన్స్‌ 4, మయాంక్‌ (సి) పైన్‌ (బి) హజిల్‌వుడ్‌ 9, బుమ్రా (సి అండ్‌ బి) కమిన్స్‌ 2, పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 0, కోహ్లీ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 4, రహానే (సి) పైన్‌ (బి) హజిల్‌వుడ్‌ 0, హనుమ విహారి (సి) పైన్‌ (బి) హజిల్‌వుడ్‌ 8, సాహా (సి) లబుషేన్‌ (బి) హజిల్‌వుడ్‌ 4, అశ్విన్‌ (సి) పైన్‌ (బి) హజిల్‌వుడ్‌ 0, ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 4, షమీ (రిటైర్డ్‌ ఔట్‌) 1, మొత్తం: 21.2 ఓవర్లలో 36;  వికెట్ల పతనం: 1-7, 2-15, 3-15, 4-15, 5-15, 6-19, 7-26, 8-26, 9-31, 9-36*; బౌలింగ్‌: స్టార్క్‌ 6-3-7-0, కమిన్స్‌ 10.2-4-21-4, హజిల్‌వుడ్‌ 5-3-8-5.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ (రనౌట్‌) 33, బర్న్స్‌ (నాటౌట్‌) 51, లబుషేన్‌ (సి) మయాంగ్‌ (బి) అశ్విన్‌ 6, స్మిత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 21 ఓవర్లలో 93/2;  వికెట్ల పతనం: 1-70, 2-82, బౌలింగ్‌: ఉమేశ్‌ 8-1-49-0, బుమ్రా 7-1-27-0, అశ్విన్‌ 6-1-16-1.

అచ్చం అలాగే.. 

నాలుగు దశాబ్దాల క్రితం కూడా భారత్‌ అచ్చం ఇదే రీతిలో చతికిలబడింది. 1974లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు.. శనివారం ఆస్ట్రేలియాతో ముగిసిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయి. లార్డ్స్‌లో 42 పరుగులకే పరిమితమైన టీమ్‌ఇండియా.. తాజా పోరులో 36కే కుప్పకూలింది. అప్పుడు కూడా 9 వికెట్లే కోల్పోయిన భారత్‌ బీఎస్‌ చంద్రశేఖర్‌ ఆబ్సెంట్‌హర్ట్‌ రూపంలో ఆలౌటైతే.. శనివారం 9 వికెట్లు పడ్డాక షమీ రిటైర్డ్‌ఔట్‌గా వెనుదిరగడంతో కోహ్లీసేన ఆలౌటైంది. ఆ రోజూ ప్రత్యర్థి జట్టులో ఇద్దరు బౌలర్ల్లు 9 వికెట్లు పడగొడితే.. ఈ రోజు కూడా హజిల్‌వుడ్‌, కమిన్స్‌ ఇద్దరే 9 వికెట్లు కూల్చడం కొసమెరుపు.

భావాలు వ్యక్త పరిచేందుకు మాటలు రావడం లేదు. 60 పరుగుల ఆధిక్యంతో మైదానంలో అడుగు పెట్టిన మేము.. పేకమేడలా కుప్పకూలాం. రెండు రోజులు తీవ్రంగా శ్రమించి జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఓ గంట పేలవమైన ఆటతో దారుణమైన స్థితికి వెళ్లాం. మేం మరింత తీవ్రతతో ఆడాల్సింది. మునుపెన్నడూ లేనంత చెత్త బ్యాటింగ్‌ చేశాం. ఆసీస్‌ బౌలర్లు మంచి ప్రదేశాల్లో బంతులు వేయడంతో పరుగులు సాధించడం అసాధ్యంగా మారింది. తప్పుల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. ఈ పరాజయాన్ని అధిగమించి ముందుకుసాగాలి. తొలి ఇన్నింగ్స్‌లో టిమ్‌ పైన్‌ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటే వందకు పైగా ఆధిక్యం దక్కేది. బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా మెరుగైన ప్రదర్శన చేస్తుంది.


-కోహ్లీ, భారత కెప్టెన్‌

అత్యల్ప స్కోరుకే ఓ జట్టు ఆలౌట్‌ కావడం అనేది స్వాగతించదగ్గ విషయం కాదు. కానీ అలాంటి పేస్‌ ధాటికి ఏ జైట్టెనా తలవంచక తప్పదు. అయితే అన్ని జట్లు ఇలా 36కే ఆలౌట్‌ అవుతాయని కాదు. 70-80 పరుగుల కన్నా ఎక్కువ చేయలేకపోయేవేమో. భారత బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువ నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంగారూలు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 


-గవాస్కర్‌