గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 12, 2020 , 00:21:56

పుంజుకునేనా..

పుంజుకునేనా..

సొంతగడ్డపై సఫారీలతో సమరానికి భారత్‌ సిద్ధమైంది. న్యూజిలాండ్‌ పర్యటనలో ఎదురైన పరాభవాల నుంచి తేరుకొని పుంజుకోవాలన్న పట్టుదలతో కోహ్లీసేన కనిపిస్తున్నది. గాయాల నుంచి కోలుకున్న ధవన్‌, హార్దిక్‌, భువీ రావడంతో టీమ్‌ఇండియా పటిష్ఠంగా మారింది. ఆస్ట్రేలియాను చిత్తుచేసిన ఊపులో దక్షిణాఫ్రికా ఉంది. ఈ నేపథ్యంలో హిమాలయ పర్వత సానువుల్లోని ధర్మశాలలో జరిగే తొలి వన్డే పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తున్నది. మ్యాచ్‌కు వరుణుడి గండం ఉండగా, కరోనా వైరస్‌ వల్ల ప్రేక్షకుల సంఖ్య తగ్గే చాన్స్‌ కనిపిస్తున్నది.

  • ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి వన్డే నేడు..
  • సత్తాచాటేందుకు కోహ్లీసేన ఆరాటం ..
  • మ్యాచ్‌కు వరుణుడి గండం
  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

ధర్మశాల: న్యూజిలాండ్‌ పర్యటనలో వరుసగా  రెండు సిరీస్‌ల్లో(వన్డే, టెస్టులు) క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమ్‌ఇండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఢీకొనేందుకు సిద్ధమైంది. కివీస్‌ చేతిలో ఎదురైన పరాభవాలను మరిచిపోయేలా సత్తాచాటాలని ఆశిస్తున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి హెచ్‌పీసీఏ మైదానంలో భారత్‌ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరుగనుంది. మంచు కొండల మధ్య, ఆహ్లాదకరమైన ధర్మశాల వాతావరణంలో జరిగే మ్యాచ్‌ను కైవసం చేసుకొని ఉల్లాసంగా మళ్లీ విజయాల బాట పట్టాలని కోహ్లీసేన భావిస్తున్నది. గాయాల నుంచి కోలుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ పునరాగమనంతో టీమ్‌ఇండియా పటిష్ఠంగా మారింది.  మరోవైపు ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 3-0తో గెలిచిన  దక్షిణాఫ్రికా నూతనోత్తేజంతో తొణికిసలాడుతున్నది. ఈ మ్యాచ్‌పై వర్షం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారీ వర్షసూచన ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా వైరస్‌ ఆందోళనతో ప్రేక్షకుల హాజరు కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. 


పెరిగిన జట్టుసమతూకం

వన్డేల్లో దాదాపు ఎనిమిది నెలల తర్వాత పాండ్య అడుగుపెట్టనున్నాడు. గతేడాది జులైలో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్‌లో పాండ్య తన చివరి వన్డే ఆడాడు. సెప్టెంబర్‌లో సఫారీలతో ఆడిన టీ20యే అతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. ఇటీవల డీవై పాటిల్‌ టీ20కప్‌లో మెరుపులు మెరిపించిన హార్దిక్‌ మంచిఫామ్‌లో ఉన్నాడు. రోహిత్‌ శర్మ విశ్రాంతిలో ఉండడంతో ధవన్‌తో పాటు యువ ఆటగాడు పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. కాగా, న్యూజిలాండ్‌ పర్యటనలో  ఘోరం గా విఫలమైన కెప్టెన్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాతో వన్డేల్లో దుమ్మరేపి ఫామ్‌ను పుణికిపుచ్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. కేఎల్‌  రాహులే కీపింగ్‌ బాధ్యతలను నిర్వర్తించనుండగా.. కేదార్‌ జాదవ్‌ ఉద్వాసనకు గురవ్వడంతో మనీశ్‌ పాండే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌ దళాన్ని భువనేశ్వర్‌, బుమ్రా ముందుకు నడిపించనున్నారు. ధర్మశాల పిచ్‌ పేస్‌కు అనూలించనుండడంతో తుదిజట్టులో స్పిన్నర్‌గా జడేజా ఒక్కడికే చోటు దక్కే అవకాశం ఉంది. 


133 వన్డేల్లో 12వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 133 పరుగుల దూరంలో ఉన్నాడు. 


ఆత్మవిశ్వాసంతో సఫారీలు

సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. భారత్‌ అంటేనే రెచ్చిపోయి ఆడే సఫారీ కెప్టెన్‌ డీకాక్‌ మరోసారి సత్తాచాటాలని చూస్తున్నాడు. కెప్టెన్సీ వదిలేశాక సరిగా రాణించలేకపోతున్న డుప్లెసిస్‌ గాడిలో పడాలని ఆశిస్తున్నాడు. యువకులతో కూడిన సఫారీ బౌలింగ్‌ భారత పరిస్థితుల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. 


వాతావరణం, పిచ్‌ 

మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు అధికం. గతేడాది సెప్టెంబర్‌లో ధర్మశాలలో భారత్‌ - దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 వాన కారణంగానే రద్దయిన విషయం తెలిసిందే. ధర్మశాల పిచ్‌ పేస్‌కు అనుకూలించనుంది.


వర్షం వద్దని పూజలు 

ఈ వన్డేకు వర్షం ఆటంకం కలిగించకుండా చూడాలని అక్కడి ఇంద్రునాగ్‌ ఆలయంలో హెచ్‌పీసీఏ అధికారులు గత వారం పూజలు నిర్వహించారట. ఈ విషయాన్ని హెచ్‌పీసీఏ కార్యదర్శి ధృవీకరించారు. కొండమీద ఉన్న ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అక్కడి స్థానికుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వరుణుడిని శాంతిం పజేయాలని హెచ్‌పీసీఏ అధికారులు నాగదేవుడిని కోరుకున్నారు. మరి వారి పూజలు ఫలిస్తాయేమో చూడాలి. 


టికెట్లపై కరోనా ఎఫెక్ట్‌ 


తొలి వన్డేపై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. ధర్మశాల వన్డే కోసం 22వేల టికెట్లను హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌పీసీఏ) అమ్మకానికి ఉంచగా మంగళవారం వరకు 16వేలు మాత్రమే అమ్ముడుపోయాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనలు ఉండడమే ఇందుకు కారణంగా భావిస్తున్నామని సంఘం ప్రతినిధులు చెప్పారు. అయితే అభిమానులు ఆసక్తి చూపకపోవడానికి వర్ష సూచన మరో కారణం. మొత్తానికి తొలి వన్డేలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. 


logo
>>>>>>