బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 15:07:57

ఒక్క డ్రా.. ఎన్నో రికార్డులు

ఒక్క డ్రా.. ఎన్నో రికార్డులు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జ‌రిగిన మూడ‌వ టెస్టులో భార‌త్ అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. ఓట‌మి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అనూహ్య రీతిలో రాణించారు.  టాప్ ఆర్డ‌ర్‌, మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు ఆస్ట్రేలియాను క‌ల‌వ‌ర‌ప‌రిచింది. డ్రాగా ముగిసిన ఆ టెస్టులో ఎన్నో అద్భుత రికార్డులు న‌మోదు అయ్యాయి.  క్రికెట్ ప్రేమికుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆ మ్యాచ్‌లో చోటుచేసుకున్న కొన్ని రికార్డుల‌ను ప‌రిశీలిద్దాం.  

131 ఓవ‌ర్లు.. 

రెండ‌వ ఇన్నింగ్స్‌లో భార‌త్ 131 ఓవ‌ర్లు ఆడి మ్యాచ్‌ను డ్రా చేయ‌డం ఇదే మొద‌టిసారి. గ‌తంలో 2015లో సిడ్నీలోనే ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో భార‌త్ త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో 89.2 ఓవ‌ర్లు ఆడి ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న‌ది.  ఆస్ట్రేలియాలో ఈ శ‌తాబ్ధంలో జ‌రిగిన ఉత్త‌మ డ్రా మ్యాచ్ సౌతాఫ్రికాతో జ‌రిగింది. 2012లో జ‌రిగిన ఆ మ్యాచ్‌లో డూప్లెసిస్ అద్భుత పోరాటం క‌న‌బ‌రిచాడు. 

విహారీ స్పెష‌ల్‌..

రెండ‌వ ఇన్నింగ్స్‌లో హ‌నుమా విహారీ 161 బంతులు ఆడి 23 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.  టెస్టు చ‌రిత్ర‌లో ఇంత నిదానంగా ఆడిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది.  ఇటీవ‌ల అత్యంత నెమ్మ‌దిగా బ్యాటింగ్ చేసిన ప్లేయ‌ర్ల‌లో హ‌సీమ్ ఆమ్లా ఉన్నాడు. 2015లో ఢిల్లీలో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో 244 బంతుల్లో అత‌ను 25 ర‌న్స్ చేశాడు. 

హేజ‌ల్‌వుడ్ బౌలింగ్‌‌..

జోస్ హేజ‌ల్‌వుడ్ 26 ఓవ‌ర్లు బౌలింగ్ వేసి 39 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.  ఈ శ‌తాబ్ధంలో ఇంత క‌ట్ట‌డిగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా స్పీడ్‌స్ట‌ర్ ఇత‌నే.  గ‌తంలో గ్లెన్ మెక్‌గ్రాత్‌, ప్యాట్ క‌మ్మిన్ ఇంత క‌న్నా త‌క్కువ ర‌న్స్ స‌గ‌టుతో బౌలింగ్ వేశారు.  

అశ్విన్ స్ట్ర‌యిక్ రేట్‌..

ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కు 103 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.  ఎక్కువ బంతులు ఆడ‌డం ఇది ఎనిమిదో సారి. 43 సార్లు అత‌ను 20 ర‌న్స్ చేశాడు.  దాంట్లో స్ట్ర‌యిక్ రేట్‌తో పోలిస్తే ప్ర‌స్తుత ఇన్నింగ్స్ అత్యంత నెమ్మ‌దిగా సాగింది. 

పుజారా ఇన్నింగ్స్‌..

చ‌తేశ్వ‌ర్ పుజారా పోరాటం అమోఘం. అత‌ను చేసింది 77 ప‌రుగులే కానీ ఆ ఇన్నింగ్స్ కోసం సుమారు 200 బంతుల‌కు పైగా ఆడాడు. ఆస్ట్రేలియాపై ఇలాంటి రికార్డు క‌లిగి ఉన్న భార‌త ఆట‌గాళ్ల‌లో సునిల్ గ‌వాస్క‌ర్ ఉన్నాడు.  

62 ర‌న్స్ భాగ‌స్వామ్యం..

అశ్విన్‌, విహారీ మ‌ధ్య ఆరో వికెట్‌కు 62 ర‌న్స్ భాగ‌స్వామ్యం ఏర్ప‌డింది.  భార‌త జోడి బంతుల్ని  ఎదుర్కొన్న కోణంలో చూస్తే ఇది చాలా ప్ర‌త్యేకం. ఈ మ్యాచ్‌లో ఆ భాగ‌స్వామ్యం కోసం ఎక్కువ బంతుల్ని ఆడాల్సి వ‌చ్చింది. ఈ ఏడాది బాక్సింగ్ డే టెస్టులో జ‌డేజా, ర‌హానేలు 244 ర‌న్స్ జోడించారు. 

 వికెట్ లేని స్టార్క్ ..

మిచ‌ల్ స్టార్క్ ఈ మ్యాచ్‌ల 22  ఓవ‌ర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు.  2013లో కూడా చెన్నైలో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో స్టార్క్ 20 ఓవ‌ర్లు వేసి కూడా వికెట్ తీయ‌లేదు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడింది. 

పంత్ బెస్ట్‌..

ఆస్ట్రేలియాలో ఆడిన వికెట్ కీప‌ర్ల‌లో రిష‌బ్ పంత్ బ్యాటింగ్ స‌గ‌టే బెస్ట్‌.  అత‌నికి 56.88 స‌గ‌టు ఉన్న‌ది.  గ‌త 60 ఏళ్ల‌లో ఆస్ట్రేలియాలో ఇంత స‌గ‌టు క‌లిగిన వికెట్ కీప‌ర్ ఎవ‌రూ లేరు.  రెండేళ్ల క్రితం సిడ్నీ టెస్టులో 159 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిడ్నీలో ఆడిన‌ మూడు ఇన్నింగ్స్‌లో  రిష‌బ్ యావ‌రేజ్ 146గా ఉంది.  

ల‌యాన్ బౌలింగ్‌.. 

నాథ‌న్ ల‌యాన్ నాలుగ‌వ ఇన్నింగ్స్‌లో 46 ఓవ‌ర్లు వేశాడు. 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ల‌యాన్‌.. ఓ ఇన్నింగ్స్‌లో ఇన్ని ఓవ‌ర్లు వేయ‌డం ఇది 11వ సారి. రెండేళ్ల క్రితం భార‌త్‌లో జ‌రిగిన మ్యాచ్‌లోనే అత‌ను 57 ఓవ‌ర్లు బౌలింగ్ చేశాడు.  

56 ఏళ్ల త‌ర్వాత‌

సిడ్నీ టెస్టులో 786 బంతులు ఆడ‌డం.. 56 ఏళ్ల త‌ర్వాత ఇలా జ‌రిగింది. 1964లో సౌతాఫ్రికా కూడా ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు 117 ఓవ‌ర్లు ఆడింది.  


logo