టోక్యో: ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో దూసుకెళ్తోంది ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి. శుక్రవారం ఉదయం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది. ఐదు సెట్లు ముగిసే సరికి ఇద్దరు ఆర్చర్లు 5-5 స్కోరుతో సమంగా నిలవడంతో షూట్ ఆఫ్‌లో ఫలితం తేల్చాల్సి వచ్చింది. 28 స్కోరుతో తొలి, మూడో సెట్లను దీపికా గెలిచింది. నాలుగో సెట్లో ఇద్దరు స్కోర్లు సమం కాగా.. రెండు, ఐదో సెట్లను రష్యా ఆర్చర్ సొంతం చేసుకుంది.
దీంతో ఇద్దరూ ఐదేసి పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే కీలకమైన షూట్ ఆఫ్‌లో దీపికా పర్ఫెక్ట్ 10 స్కోరు చేయగా.. ప్రత్యర్థి 7 మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో దీపికా క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. ఉదయం 11.30 గంటలకు కొరియాకు చెందిన సాన్ ఆన్‌తో దీపికా క్వార్టర్స్‌లో తలపడనుంది. ఆమె కనీసం మరో రెండు గెలిస్తే.. ఇండియాకు ఒక పతకం ఖాయమవుతుంది.