ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 03, 2020 , 00:14:54

ఖేల్‌రత్నకు మహిళా స్టార్లు

ఖేల్‌రత్నకు మహిళా స్టార్లు

  • జ్యోతి సురేఖ, రాణి, మనిక, వినేశ్‌ పేర్లు సిఫారసు 
  • అర్జునకు సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 

క్రీడా పురస్కారాల సిఫారసుల్లో హాకీ, టేబుల్‌ టెన్నిస్‌, రెజ్లింగ్‌ జాతీయ సమాఖ్యలు మహిళా ప్లేయర్లకు ప్రాధాన్యమిచ్చాయి. ప్రతిష్టాత్మక ఖేల్త్న్ర పురస్కారానికి హాకీ నుంచి మహిళల జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, టీటీ నుంచి మనికా బాత్రా, రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫోగట్‌ నామినేట్‌ అయ్యారు. స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను ఖేల్త్న్రకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. 

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’కు తెలుగమ్మాయి, స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ నామినేట్‌ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమె పేరును క్రీడామంత్రిత్వ శాఖకు మంగళవారం సిఫారసు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పదేండ్లుగా అదరగొడుతున్న సురేఖ.. ప్రపంచకప్‌, చాంపియన్‌షిప్‌లతో  పాటు చాలా టోర్నీ ల్లో  అద్భుత ప్రదర్శన చేసిం ది. తొమ్మిది స్వ ర్ణాలు సహా మొత్తంగా 33 అంతర్జాతీయ పతకాలు కైవసం చేసుకుంది. భారత ఆర్చరీ జట్టు ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన సురేఖకు.. 2017లోనే అర్జున అవార్డు దక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత ఆర్చర్‌గానూ సురేఖ గతేడాది రికార్డు సృష్టించింది.  

హాకీలో రాణి రాంపాల్‌ 

టీమ్‌ఇండియా మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ పేరును ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డుకు హాకీ ఇండియా(హెచ్‌ఐ) సిఫారసు చేసింది. అర్జున అవార్డు కోసం మహిళా ప్లేయర్లు వందన కటారియా, మౌనిక, పురుషుల జట్టు ప్లేయర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ను నామినేట్‌  చేసింది. రాణి రాంపాల్‌ సారథ్యంలో భారత మహిళల హాకీ జట్టు 2017  ఆసియాకప్‌లో విజేతగా నిలిచింది. 2019 ఎఫ్‌ఐహెచ్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో నిర్ణయాత్మక గోల్‌ చేసి.. టీమ్‌ఇండియా టోక్యో విశ్వక్రీడలకు అర్హత సాధించడంలో రాణి కీలకపాత్ర పోషించింది. ప్రపంచ గేమ్స్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును గెలుచుకున్న తొలి భారత ప్లేయర్‌గా రాణి రాంపాల్‌ చరిత్ర సృష్టించింది. కాగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ పేరును భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఖేల్‌రత్నకు సిఫారసు చేసింది. అర్జున అవార్డు కోసం దీపక్‌ పునియా, రాహుల్‌ అవారే,  సాక్షిమాలిక్‌, సందీప్‌ తోమర్‌, నవీన్‌ పేర్లను పంపింది. 

అర్జునకు సాత్విక్‌-చిరాగ్‌ 

భారత బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ ప్లేయర్స్‌ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి పేర్లను అర్జున అవార్డు కోసం బాయ్‌ సిఫారసు చేసింది. గతేడాది థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో విజేతగా నిలువడం ద్వారా సూపర్‌ 500 టైటిల్‌ సాధించిన తొలి భారత జోడీగా సాత్విక్‌  ద్వయం ఘనత సాధించింది. అర్జున  కోసం సమీర్‌ వర్మ పేరును  కూడా బాయ్‌ పంపింది.

మనిక పేరు నామినేట్‌ 

స్టార్‌ క్రీడాకారిణి మనికా బాత్రాను రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య(టీటీఎఫ్‌ఐ) నామినేట్‌ చేసింది. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి.. సింగిల్స్‌లో ఈ ఘనత దక్కించుకున్న భారత తొలి మహిళా ప్యాడ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అర్జున అవార్డుకు మహిళా సీనియర్‌ ప్లేయర్లు మధురిక పాట్కర్‌, సుతీర్థ ముఖర్జీ, యువ ఆటగాడు మానవ్‌ తక్కర్‌ పేర్లను సిఫారసు చేసింది. 


logo