e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home స్పోర్ట్స్ కల కలగానే!

కల కలగానే!

సెమీస్‌లో ఓడిన పీవీ సింధు.. నేడు కాంస్య పతక పోరు ఐదేండ్లుగా కంటి మీద కునుకు పడనివ్వని స్వప్నం..శతకోటి మంది భారతీయుల అంచనాల భారం.. స్వర్ణమే లక్ష్యంగా సాగిన సుదీర్ఘ ప్రయాణం..విశ్వక్రీడల్లో ఒక్క గేమ్‌ కూడా కోల్పోని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు సెమీస్‌లో నిరాశ ఎదురైంది. తనపై పడ్డ ‘సిల్వర్‌ సింధు’ ముద్రను తుడిచేస్తూ.. స్వర్ణ సౌరభాలు విరజిమ్మాలనుకున్న తెలుగు అమ్మాయికి ప్రపంచ నంబర్‌వన్‌ షట్లర్‌ తైజూ యింగ్‌ షాకిచ్చింది.

  • డిస్కస్‌త్రో ఫైనల్‌లో కమల్‌ప్రీత్‌
  • 41 ఏండ్ల తర్వాత క్వార్టర్స్‌లో

మహిళల హాకీ జట్టు

- Advertisement -

టోక్యో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు శనివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శతకోటి భారతీయుల ఆశలు మోస్తూ బ్యాడ్మింటన్‌ సెమీఫైనల్‌ బరిలో దిగిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమి పాలవగా.. ప్రపంచ నంబర్‌వన్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ తొలి బౌట్‌లోనే ఓడి నిరాశగా వెనుదిరిగాడు. ప్రపంచ చాంపియన్‌ సింధు ఇక కాంస్య పతక పోరుకోసం పోటీ పడనుండగా.. డిస్కస్‌ త్రోలో కమల్‌ప్రీత్‌ కౌర్‌ సంచలనం నమోదు చేసింది. అద్భుత ప్రదర్శనతో డిస్కస్‌ త్రో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయంతో మహిళల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఆర్చరీలో భారత్‌ పోరాటం ముగిసింది.

అయ్యయ్యో..

భారీ అంచనాల మధ్య విశ్వక్రీడల్లో అడుగుపెట్టిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సెమీఫైనల్‌లో పరాజయం పాలైంది. రియో (2016) ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సింధు.. ఈసారి పసిడి పట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగినా.. ఆమెను దురదృష్టం వెంటాడింది. శనివారం మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 18-21, 12-21తో ప్రపంచ నంబర్‌వన్‌ తైజూ యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడింది. 40 నిమిషాల్లో ముగిసిన పోరులో 26 ఏండ్ల సింధు వరుస గేమ్‌లలో ఓడి నిరాశ పరిచింది. తొలి గేమ్‌లో ఒక దశలో 4-2, 7-3, 11-8తో ముందంజలో నిలిచిన సింధు.. అదే జోరులో గేమ్‌ చేజిక్కించుకోవడం ఖాయం అనుకుంటున్న తరుణంలో తైజూ విజృంభించింది. సింధు స్మాష్‌లపై దృష్టి పెడితే.. తైజూ ప్లేసింగ్‌ గేమ్‌తో తికమక పెట్టింది. 18-18 వరకు ఆధిక్యంలో సాగిన సింధు ఆ తర్వాత ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోగా.. తైజూ వరుస పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనైనా సింధు పుంజుకుంటుందనుకుంటే అదీ సాధ్యపడలేదు. 11-7తో బ్రేక్‌కు వెళ్లిన తైజూ అదే ఊపులో గేమ్‌ను చేజక్కించుకొని ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం కాంస్య పతక పోరులో హే బింగ్‌ జియావో (చైనా)తో సింధు తలపడనుంది.

అనిర్బన్‌పై ఆశలు

అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి.. విశ్వక్రీడల్లోనూ అదే జోరు కొనసాగించలేకపోయాడు. తొలి రెండు రౌండ్‌లలో చక్కటి ప్రదర్శన చేసిన అనిర్బన్‌ మూడో రౌండ్‌ ముగిసేసరికి 28వ స్థానంలో నిలిచాడు. ఉదయన్‌ 55వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక నాలుగో రౌండ్‌లో అద్భుతం జరిగితే తప్ప అనిర్బన్‌ పతకం రేసులో నిలువడం కష్టమే. సెయిలింగ్‌లో మనవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పురుషుల స్కిఫ్‌ ఈవెంట్‌లో గణపతి-వరుణ్‌ జంట ఓవరాల్‌గా 17వ స్థానంలో నిలిచింది.

వందనా.. నీకు వందనం

వందన కటారియా హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగడంతో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం దక్షిణాఫ్రికాపై విజయంతో మహిళల జట్టు 41 ఏండ్ల తర్వాత నాకౌట్‌కు అర్హత సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరి.. చివరికి నాలుగో స్థానంలో నిలిచింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో చక్కటి ఆట కనబర్చిన మన అమ్మాయిలు 4-3తో విజయం సాధించారు. భారత్‌ తరఫున వందన (4వ, 17వ, 49వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో విజృంభించగా.. నేహా గోయల్‌ (32వ ని) ఓ గోల్‌ కొట్టింది. ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు తరఫున తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసిన ప్లేయర్‌గా వందన చరిత్రకెక్కింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన రాణి రాంపాల్‌ బృందం.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పూల్‌-ఏలో 4 పాయింట్లతో నాలుగో స్థానంతో నాకౌట్‌కు చేరింది. సోమవారం జరుగనున్న క్వార్టర్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

షూటింగ్‌లో నిరాశ

భారత షూటర్ల విఫలయాత్ర శనివారం కూడా కొనసాగింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌ ఈవెంట్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌ 15వ, తేజస్విని సావంత్‌ 33వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. సంజీవ్‌ రాజ్‌పుత్‌, ఐశ్వర్య ప్రతాప్‌ ఇంకా బరిలోకి దిగాల్సి ఉంది.

చివరకు పరాజయం వైపు నిలువాల్సి వచ్చింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో ఓటమి మరింత బాధిస్తున్నది. ఈ రోజు నాది కాదు. రెండో గేమ్‌లో వెనుకబడ్డా.. ఆఖరి వరకు పోరాటం కొనసాగించా. తైజూపై ఆధిక్యం సాధించేందుకు ఎంతో ప్రాక్టీస్‌ చేసినా.. లాభం లేకుండా పోయింది. ఈ పరాజయాన్ని మరిచి కాంస్య పతక పోరుకు సిద్ధమవుతా.

పీవీ సింధు


విశ్వక్రీడల్లో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న ఏకైక ఆర్చర్‌ అతాను దాస్‌ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో ఓటమి పాలై ఇంటిబాట పట్టాడు. శనివారం జరిగిన పోరులో అతాను దాస్‌ 4-6తో తకారు ఫరుకవా (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. ‘ఒలింపిక్స్‌లో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. వంద శాతం కష్టపడ్డా ఫలితం మాత్రం కలిసి రాలేదు’అని దాస్‌ పేర్కొన్నాడు.

కమల్‌ప్రీత్‌ కమాల్‌..

పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన డిస్కస్‌ త్రోయర్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరిన కమల్‌ప్రీత్‌.. నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. 25 ఏండ్ల కమల్‌ప్రీత్‌ మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగా.. అమెరికాకు చెందిన వలరియే అల్మాన్‌ (66.42 మీటర్లు) క్వాలిఫయింగ్‌-బి రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం జరుగనున్న ఫైనల్‌లో కమల్‌ప్రీత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత అథ్లెట్‌ సీమ పునియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. ‘తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగడంతో ముందు ఒత్తిడికి లోనయ్యా. తొలిసారి డిస్క్‌ను విసిరాక కాస్త కుదుటపడ్డా.. ఇక మూడోసారికి ఎలాగైన ఫైనల్‌ చేరాలనే కసితో డిస్క్‌ను త్రో చేశా. తుదిపోరులో నా అత్యుత్తమ ప్రదర్శన (66.59 మీటర్లు)ను మించి డిస్క్‌ను విసిరి దేశానికి పతకం అందించాలనుకుంటున్నా’అని అన్న కమల్‌ప్రీత్‌ ఖాళీ దొరికితే క్రికెట్‌ ఆడటం తనకు ఇష్టం అని పేర్కొంది. పురుషుల లాంగ్‌జంప్‌లో భారత్‌ తరఫున శ్రీశంకర్‌ 7.69 మీటర్ల దూరం గెంతి.. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana