గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 11, 2020 , 16:06:36

ఐసీసీ ప్యానెల్ అంపైర్ గా అనంత్ పద్మనాభన్

ఐసీసీ ప్యానెల్ అంపైర్ గా అనంత్ పద్మనాభన్

ముంబై : భారత్ కు చెందిన దేశీయ అంపైర్ కే ఎన్ అనంత్ పద్మనాభన్ (50) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంతర్జాతీయ ప్యానెల్ అంపైర్లలో చేరారు. ఇటీవల యువ అంపైర్ నితిన్ మీనన్ అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లో స్థానం పొందిన విషయం తెలిసిందే. ఎన్నో ఐపీఎల్, రంజీ ట్రోఫీ మ్యాచుల్లో అనంత్ పద్మనాభన్ అంపైరింగ్ చేశారు. గత రంజీ ఫైనల్లో అతను అంపైర్‌గా ఉన్నాడు.

ఐసీసీ అంపైర్ల ప్యానెల్‌లో ఇప్పటికే భారత్ నుంచి షంషుద్దీన్, అనిల్ చౌదరి, వీరేందర్ శర్మలు చేరారు. అనంత్ పద్మనాభన్ నాలుగో భారతీయుడు. అంతర్జాతీయ ప్యానెల్ యొక్క అంపైర్లు వన్డే, టీ 20 తో పాటు జూనియర్ ప్రపంచ కప్‌లోనూ వ్యవహరించాల్సి ఉంటుంది. కేరళ మాజీ కెప్టెన్, లెగ్ స్పిన్నర్ అయిన అనంత్ పద్మనాభన్.. 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 344 వికెట్లు పడగొట్టారు. "నేను చాలా కాలంగా దీని కోసం ఎదురు చూస్తున్నాను" అని చెప్పారు. దేశం కోసం ఆడలేకపోయాననేది నాకు బాధించే విషయమని అన్నారు. 

ఎలైట్ ప్యానెల్‌లో మూడో భారతీయుడిగా నితిన్

అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లో శ్రీనివాస్ వెంకటరాఘవన్, సుందరం రవి ఎంపికవగా.. నితిన్ ఇటీవల ఎంపికయ్యాడు. 3 టెస్టులు, 24 వన్డేలు, 16 టీ 20 లు కాకుండా 57 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసిన అనుభవం నితిన్‌కు ఉన్నది. ఈ గౌరవం పొందిన మూడవ భారత అంపైర్ నితిన్ కావడం విశేషం. గత ఏడాది సుందరం రవిని ప్యానెల్ నుంచి తప్పించారు.


logo