గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 00:37:08

కొత్తకొత్తగా..

కొత్తకొత్తగా..

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 19న మొదలయ్యే లీగ్‌ కోసం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే రాజస్థాన్‌, పంజాబ్‌, కోల్‌కతా జట్లు యూఏఈలో అడుగుపెట్టగా, శుక్రవారం చెన్నై, బెంగళూరు, ముంబై.. బయల్దేరి వెళ్లాయి. కొవిడ్‌-19 దృష్ట్యా ముంబై ఆటగాళ్లు పీపీఈ కిట్లు ధరించి పయనమయ్యారు. మరోవైపు చెన్నైలో గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ధోనీసేన..ఐపీఎల్‌ టైటిల్‌ వేట కోసం పక్కా ప్రణాళికతో సమాయత్తమైంది. రైనా, రాయుడు, జడేజా లాంటి స్టార్‌ క్రికెటర్లు తమ సహచరులతో కలిసి విమానమెక్కారు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కూడా యూఏఈ బాట పట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఆదివారం బయల్దేరి వెళ్లే అవకాశముంది. 

     బాల్కనీ నుంచి ముచ్చట్లు: 

  రాజస్థాన్‌, పంజాబ్‌...గురువారం దుబాయ్‌కి చేరుకోగా, కోల్‌కతా..అబుదాబిలో దిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ విడుదల చేసిన ఎస్‌వోపీ మార్గదర్శకాలను జట్లు పాటించాయి. ఎయిర్‌పోర్టులో దిగగానే రాజస్థాన్‌ ఆటగాళ్లు కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా, శుక్రవారం పంజాబ్‌ ప్లేయర్లు మరోమారు టెస్టులకు హాజరయ్యారు. ఎస్‌వోపీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టు యూఏఈలో దిగిన ఆరు రోజుల్లో మూడు సార్లు(1,3, 6వ రోజు) పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరు రోజుల క్వారంటైన్‌ నిబంధనలకు అనుగుణంగా రాజస్థాన్‌, కోల్‌కతా ఆటగాళ్లు తొలి రోజు తమ హోటల్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు. పక్కపక్క రూమ్‌ల్లో ఉన్న తమ సహచర క్రికెటర్లతో బాల్కనీ నుంచే మాట్లాడుకున్నారు. తమ జట్ల ఫిజియోల సూచనలు పాటిస్తూ తేలికపాటి వ్యాయామాలు చేశారు. 


logo