బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 00:20:27

హంపిదే కెయిన్స్‌ కిరీటం

 హంపిదే  కెయిన్స్‌ కిరీటం
  • చివరి రౌండ్‌లో హారికతో గేమ్‌ డ్రా.. రెండు నెలల వ్యవధిలో రెండో టైటిల్‌

సెయింట్‌ లూయిస్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌, తెలుగు చెస్‌ ప్లేయర్‌ కోనేరు హంపి మరోసారి అంతర్జాతీయ టోర్నీలో టైటిల్‌తో మెరిసింది. గతేడాది డిసెంబర్‌లో ర్యాపిడ్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించిన ఆమె.. ప్రస్తుతం కెయిన్స్‌ కప్‌ను సొంతం చేసుకొని రెండు నెలల వ్యవధిలో రెండో టైటిల్‌ను చేజిక్కించుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన కెయిన్స్‌ టోర్నీ తొమ్మిదో రౌండ్‌లో మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికతో మ్యాచ్‌ను కోనేరు హంపి సమం చేసుకుంది. దీంతో టోర్నీని ఆరు పాయింట్లతో ముగించి అగ్రస్థానాన నిలిచింది. 


టోర్నీలో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన హంపి.. హారికతో మ్యాచ్‌ను సమం చేసుకుంటే చాలు విజేతగా నిలిచే స్థితికి చేరుకుంది. దీంతో తొమ్మిదో రౌండ్‌లో ఎలాంటి కష్టం లేకుండా డ్రా చేసుకొని.. కెయిన్స్‌ కప్‌ను, 45వేల డాలర్ల ప్రైజ్‌మనీని హంపి సొంతం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌ వెన్‌జున్‌ జు(చైనా) 5.5పాయింట్లతో రెండు, రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కొస్టెనుక్‌(5పాయింట్లు) మూడో  స్థానంలో నిలిచారు. టోర్నీలో వరుస డ్రాలు నమోదు చేసిన ద్రోణవల్లి హారిక 4.5పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో ఎలో రేటింగ్‌ పాయింట్స్‌ మెరుగవడంతో హంపి ప్రపంచ జాబితాలో రెండో స్థానానికి చేరింది. 


పెద్ద టోర్నీలో గెలువడం చాలా సంతోషంగా ఉంది. రాపిడ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజయం మెరుపు ఫామ్‌ వల్ల వచ్చింది కాదని ఈ కప్‌ నాకు గుర్తు చేసింది. మేలో ఇటలీలో జరిగే మేజర్‌ టోర్నీ గ్రాండ్‌ప్రిక్స్‌లో పోటీకి దిగుతా. ఆ తర్వాత భారత్‌లో జరిగే పీఎస్‌పీబీ టోర్నీలో ఆడతా.

 - కోనేరు హంపి 


logo
>>>>>>