మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 00:47:51

ఐపీఎల్‌కు పచ్చజెండా

ఐపీఎల్‌కు పచ్చజెండా

  • బీసీసీఐకి కేంద్రం పూర్తి అనుమతులు 
  • ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ వెల్లడి.. ఈ ఏడాది టైటిల్‌ స్పాన్సర్‌ కోసం బిడ్లకు ఆహ్వానం 

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ పచ్చజెండా ఊపింది. లీగ్‌ నిర్వహణకు కావాల్సిన పూర్తి అనుమతులను బీసీసీఐకి ఇచ్చింది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ పాలక మండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ సోమవారం అధికారికంగా వెల్లడించారు. గత వారమే ప్రాథమికంగా అంగీకరించిన  ప్రభుత్వం.. ఇప్పుడు రాతపూర్వకంగా పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేసింది. ‘అవును. మేం రాతపూర్వక అనుమతులను అందుకున్నాం’ అని బ్రిజేశ్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ కారణంగా స్వదేశంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహించడం కష్టతరం కావడంతో.. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరుపాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి బీసీసీఐకి అనుమతినిచ్చింది. దీంతో ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఫ్రాంచైజీలకు చెబుతామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ నెల 20వ తేదీ తర్వాత యూఏఈకి ఆటగాళ్లు, సిబ్బందిని తీసుకెళ్లాలని ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నాయి. అంతకుముందు 24గంటల వ్యవధిలో తమ బృందానికి రెండు ఆర్‌టీ-పీసీఆర్‌(కరోనా పరీక్షలు) చేయించనున్నాయి. ఈ నెల 22న యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. కెప్టెన్‌ ధోనీ సూచన మేరకు చెన్నైలో ఆటగాళ్లకు శిక్షణ శిబిరం నిర్వహించనుంది.

బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. ఈ ఏడాది స్పాన్సర్‌షిప్‌ కోసం బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ నెల 14వ తేదీని తుదిగడువుగా విధించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన విడుదల చేశారు.  బిడ్‌ దక్కించుకున్న సంస్థ ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి డిసెంబర్‌ 31వరకు మాత్రమే హక్కులను కలిగి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. రూ.300కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న కంపెనీలకే టెండర్‌ దాఖలు చేసేందుకు అవకాశమిచ్చింది. ఎక్కువ మొత్తానికి టెండర్‌ వేసినా.. సంస్థ ప్రయోజనాలు సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, చర్చించిన తర్వాతే   స్పాన్సర్‌షిప్‌ హక్కులను అప్పగించాలని నిర్ణయించింది. బిడ్ల దాఖలుకు 13 నిబంధలను విధించింది. ప్రక్రియ ముగిశాక ఈ నెల 18న టైటిల్‌ స్పాన్సర్‌ను బీసీసీఐ ప్రకటి ంచనుంది. గల్వాన్‌ ఘటన తర్వాత దేశ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఉద్యమం ఉద్ధృతమైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న వివో ఈ ఏడాదికి తప్పుకుంది. టైటిల్‌ స్పాన్సర్‌గా 2018 నుంచి ఐదేండ్ల పాటు ఉండేందుకు ప్రతి ఏడాది రూ.440కోట్లను బీసీసీఐకి చెల్లించేందుకు వివో ఒప్పందం చేసుకుంది.  కాగా వివో ఈ ఏడాదికి నుంచి తప్పుకున్నా.. కాంట్రాక్టు కొనసాగనుంది. ఈ ఏడాది స్పాన్సర్‌షిప్‌  హక్కుల కోసం అమెజాన్‌, బైజూస్‌, డ్రీమ్‌ ఎలెవెన్‌  సంస్థలు పోటీలో ఉంటాయని అంచనాలు వెలువడగా..  పతంజలి కూడా ఆ జాబితాలో చేరింది.    

స్పాన్సర్‌షిప్‌ రేసులో పతంజలి!

ఈ ఏడాది యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బాబా రామ్‌దేవ్‌ స్థాపించిన ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ పతంజలి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు స్పాన్సర్‌షిప్‌ కోసం బిడ్‌ వేయాలని ఆ సంస్థ యోచిస్తున్నది. ఈ విషయాన్ని పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారవాలా వెల్లడించారు. ‘భారతీయ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఐపీఎల్‌ సరైన వేదిక అనుకుంటున్నాం. ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నాం. ఈ విషయం(ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ బిడ్‌)పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని తిజారవాలా అన్నారు. 


logo