గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 00:16:23

భారత్‌కు పరీక్ష!

భారత్‌కు పరీక్ష!

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)లో టీమ్‌ఇండియాకు తొలి విదేశీ పరీక్ష. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో సత్తాచాటి అజేయంగా ఉన్న కోహ్లీసేనకు మొదటి కఠిన సవాల్‌ ఎదురైంది. చాంపియన్‌షిప్‌లో భాగంగా విదేశీ గడ్డపై సత్తాచాటి అజేయ రికార్డును నిలుపుకోవాలని భారత్‌ పట్టుదలగా కనిపిస్తున్నది. పేస్‌, స్వింగ్‌తో భారత్‌ను పడగొట్టాలని న్యూజిలాండ్‌ కసిమీద ఉంది. స్వదేశీ అనుకూలతను బలంగా చేసుకొని విజృంభించాలనుకుంటున్నది. మొత్తానికి నేడు కోడికూయక ముందే ప్రారంభం కానున్న భారత్‌ - కివీస్‌ టెస్టు సిరీస్‌ రసవత్తరంగా సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఈ వార్త చదివే సమయానికే సగం ఇన్నింగ్స్‌ ముగిసే అవకాశాలున్నాయి.

  • నేటి నుంచి కివీస్‌తో తొలి టెస్టు..
  • ఓపెనర్‌గా పృథ్వీషాకే చోటు..
  • పేస్‌ బౌలింగ్‌ ప్రధాన బలంగా కివీస్‌
  • తెల్లవారుజామున 4.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

వెల్లింగ్టన్‌: సంప్రదాయ ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ పేస్‌, స్వింగ్‌ను ఢీ కొట్టేందుకు టీమ్‌ఇండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన తొలి కఠిన సవాల్‌ను ఎదుర్కోనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌లో కివీస్‌ను వైట్‌వాష్‌ చేసి జోరు కనబరిచిన టీమ్‌ఇండియా వన్డేల్లో 0-3తో ఓడి చతికిలపడింది. ఈ తరుణంలో టెస్టు సిరీస్‌లో గెలిచి ఆఖరి పంచ్‌ తమదే కావాలని కోహ్లీసేన కసి మీద ఉంది. మరోవైపు 50ఓవర్ల ఫార్మాట్‌ ఇచ్చిన ఊపుతో పేస్‌ ఆస్ర్తాన్ని ఉపయోగించి భారత్‌పై పైచేయి సాధించాలని న్యూజిలాండ్‌ భావిస్తున్నది. 


పృథ్వీకే ఛాన్స్‌..! 

టీమ్‌ఇండియా ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి పృథ్వీషానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కివీస్‌ పేసర్లు బౌల్ట్‌, సౌథీ, జెమీసన్‌ రూపంలో మయాంక్‌ - షా ద్వయానికి చాలెంజ్‌ ఎదురుకాబోతున్నది. కాగా, వామప్‌ మ్యాచ్‌లో విఫలమైన భారత యువ ఆటగాడు శుభమన్‌ గిల్‌ టెస్టు అరంగేట్రం కోసం మరిన్ని రోజులు నిరీక్షించక తప్పేలా లేదు. వన్డే సిరీస్‌లో శతకం చేయలేకపోయిన కోహ్లీ టెస్టుల్లో సత్తాచాటలని చూస్తుండగా... ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌గా పంత్‌ ఉంటాడా.. సాహా చోటు దక్కించుకుంటాడా చూడాలి. నయావాల్‌ పుజారా, వైస్‌ కెప్టెన్‌ రహానేతో పాటు ఆరో స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారి రెచ్చిపోతే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. 


బుమ్రా, షమీ కీలకం 

పేస్‌కు అనుకూలించే పిచ్‌పై భారత స్టార్‌ పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. టెస్టుల్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ రెచ్చిపోతే కివీస్‌కు కష్టాలు తప్పవు. మూడో పేసర్‌గా ఉమేశ్‌ నుంచి పోటీ ఉన్నా గాయం నుంచి కోలుకొని వచ్చిన ఇషాంత్‌కే తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు మెండు. స్పిన్నర్‌గా జడేజా కంటే అశ్విన్‌ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.


నలుగురు పేసర్లతో..

భారత్‌తో టెస్టు పోరులో న్యూజిలాండ్‌ పేస్‌ బౌలర్లపైనే ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌తో ఆరు అడుగుల ఎనిమిదంగుళాల పేసర్‌ జెమీసన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయనుండగా.. సీనియర్లు బౌల్ట్‌, సౌథీ సత్తాచాటితే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఎదురవుతాయి. నలుగురు ఫాస్ట్‌ బౌలర్లతో కివీస్‌ బరిలోకి దిగాలని యోచిస్తుండగా.. ఐదో పేసర్‌ పాత్రను ఆల్‌రౌండర్‌ డీ గ్రాండ్‌హోమ్‌ నిర్వర్తించనున్నాడు. పటిష్ఠమైన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు కివీస్‌ పేసర్లకు మధ్య సమరం రసవత్తరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్‌ విలియమ్సన్‌, సీనియర్‌ రాస్‌ టేలర్‌తో కూడిన కివీస్‌ బ్యాటింగ్‌ సైతం పటిష్ఠంగా ఉంది. 


పిచ్‌, వాతావరణం 

పిచ్‌పై పచ్చిక ఉండడంతో పేస్‌ బౌలర్లకు అనుకూలించనుంది. గాలులు సైతం బౌలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. వర్షం పడే సూచనలు లేవు. 


ప్రత్యర్థి జట్టు ఎంత సహనంతో ఆడుతుందన్నది ముఖ్యం కాదు. మేం వారికన్నా ఎక్కువ సహనం కనబరచాలి. గాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వాయుదిశకు వ్యతిరేకంగా బంతిని గాల్లోకి కొట్టకుండా బ్యాట్స్‌మన్‌ జాగ్రత్త పడాలి. అందుకే వికెట్ల మధ్య ఎక్కువగా పరుగెత్తాలి. 

- విరాట్‌ కోహ్లీ 


జట్లు(అంచనా)  

భారత్‌ : మయాంక్‌, పృథ్వీ షా, పుజారా,  కోహ్లీ(కెప్టెన్‌),  రహానే,  విహారి,  పంత్‌/ సాహా(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, ఇషాంత్‌, షమీ,  బుమ్రా 

న్యూజిలాండ్‌:  లాథమ్‌,  బ్లండెల్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌),  టేలర్‌, హెన్రీ నికోల్స్‌, వాట్లింగ్‌(వికెట్‌ కీపర్‌),  గ్రాండ్‌హోమ్‌, డారిల్‌ మిచెల్‌ /ఎజాజ్‌ పటేల్‌,  సౌథీ, కైల్‌ జెమీసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ 


logo
>>>>>>