శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 20, 2020 , 21:58:47

టీమ్‌ఇండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తండ్రి కన్నుమూత

టీమ్‌ఇండియా బౌలర్‌ మహ్మద్‌  సిరాజ్‌ తండ్రి కన్నుమూత

హైదరాబాద్: టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌(53) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.  భారత  టెస్టు క్రికెట్‌ జట్టుతో కలిసి సిరాజ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు సిడ్నీలో  తప్పనిసరి క్వారంటైన్‌లో ఉన్నాడు.  ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో గొప్పగా రాణించిన సిరాజ్‌ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

కొవిడ్‌  నిబంధనల కారణంగా సిరాజ్‌ తన తండ్రి అంత్యక్రియల కోసం భారత్‌కు రాలేకపోతున్నాడు.   ఆటోరిక్షా డ్రైవర్‌ అయిన గౌస్‌..క్రికెట్లో తన కొడుకు మంచి బౌలర్‌గా రాణించేందుకు ఎంతో కష్టపడ్డారు.  2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో సిరాజ్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో అతడు 41 వికెట్లు పడగొట్టాడు.

అదేఏడాది ఐపీఎల్‌ వేలంలో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.2.6కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి  విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడని ఇటీవల ఆర్‌సీబీ టీమ్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలో  సిరాజ్‌  పేర్కొన్నాడు.