శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 26, 2020 , 15:42:36

న్యూజిలాండ్‌పై భారత్‌ గెలుపు

న్యూజిలాండ్‌పై భారత్‌ గెలుపు

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై 2-0 ఆధిక్యంలో నిలిచింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ కీలక సమయాల్లో ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కివీస్‌ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మార్టిన్‌ గప్తిల్‌ (20 బంతుల్లో 33 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సెయిఫర్ట్‌ (26 బంతుల్లో 33 పరుగులు, 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేటా 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, శివం దూబేలు తలా 1 వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 135 పరుగులు చేసి కివీస్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.  భారత బ్యాట్స్‌మెన్లలో లోకేష్‌ రాహుల్‌ (50 బంతుల్లో 57 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, శ్రేయాస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 44 పరుగులు, 1 ఫోర్‌, 3 సిక్సర్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.  ఇక‌ న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ 2 వికెట్లు పడగొట్టగా, ఇష్‌ సోధి 1 వికెట్‌ తీశాడు. కాగా సిరీస్‌లో 3వ టీ20 మ్యాచ్‌ ఈ నెల 29వ తేదీన హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌ వేదికగా జరగనుంది. 


logo