కోహ్లీ కొట్లాడినా..

- మూడో టీ20లో భారత్ ఓటమి
- విరాట్ శ్రమ వృథా l 2-1తో సిరీస్ కైవసం
- అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలుపొందిన కోహ్లీ సేనకు మూడో టీ20లో ఆసీస్ షాకిచ్చింది.
భారత బౌలర్లు విజృంభించినా.. మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ దంచి కొట్టడంతో మంచి స్కోరు చేసిన ఆస్ట్రేలియా.. మిడిల్ ఓవర్లలో పకడ్బంది బౌలింగ్‌తో టీమ్ఇండియాను కట్టడి చేసింది. గత మ్యాచ్‌తో పోలిస్తే లక్ష్యం చిన్నదే అయినా.. విరాట్ కోహ్లీ మినహా మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఇక్కడితో బ్రేక్‌పడగా.. ఇరు జట్లు ఇక సుదీర్ఘ ఫార్మాట్‌కు సిద్ధమవుతున్నాయి.
సిడ్నీ: ఆసీస్ గడ్డపై కంగారూలను రెండోసారి క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని టీమ్ఇండియా జారవిడుచుకుంది. తొలి రెండు టీ20లు నెగ్గి ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న కోహ్లీసేన.. మూడో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన చివరి టీ20లో ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ చేజిక్కించుకోగా.. టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. దీంతో మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు గెలిచినైట్లెంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. వేడ్ (53 బంతుల్లో 80; 7 ఫోర్లు 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 85; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా.. నిర్ణీత ఓవర్లలో టీమ్ఇండియా 174/7కే పరిమితమైంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' స్వెప్సన్ (3/23) ధాటికి భారత్ మిడిలార్డర్ కుదేలైంది. పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్'అవార్డు దక్కింది.
ఒక్కడు మినహా..
గత మ్యాచ్‌లో ఇంతకన్నా భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలువడం ఖాయమే అనిపించింది. అయితే ఆసీస్ లెగ్‌స్పిన్నర్ స్వెప్సన్ విజృంభించి కోహ్లీసేన ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. మిడిల్ ఓవర్లలో 39 బంతుల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాబట్టలేకపోయిన టీమ్ఇండియా చివర్లో సాధించాల్సిన రన్‌రేట్ పెరగిపోవడంతో ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ రెండో బంతికే లోకేశ్ రాహుల్ (0) ఔట్ కావడంతో భారత్‌కు శుభారంభం దక్కలేదు. శిఖర్ ధవన్ (28)తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ సాధికారికంగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి కోహ్లీ సేన 55/1తో నిలిచింది. కుదురుకున్నట్ల కనిపించిన ధవన్‌ను బోల్తా కొట్టించిన స్వెప్సన్.. పదమూడో ఓవర్లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. సంజూ శాంసన్ (10), శ్రేయస్ అయ్యర్ (0)ను ఔట్ చేశాడు. మరో ఎండ్‌లో స్మిత్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి 30 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉన్నా.. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 20; ఒక ఫోర్, 2 సిక్సర్లు) క్రీజులో ఉండటంతో టీమ్ఇండియా వైపే మొగ్గు కనిపించింది. సామ్స్ వేసిన పదహారో ఓవర్లో విరాట్ రెండు సిక్సర్లు, పాండ్యా ఓ సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లో పాండ్యా 4,6 అరుసుకోవడంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 43కు చేరింది. ఈ దశలో పాండ్యాను జంపా బోల్తా కొట్టించగా.. సామ్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్ కావడంతో భారత ఓటమి ఖాయమైంది.
దుమ్మురేపిన వేడ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. గత మ్యాచ్‌లో ఆడని ఆరోన్ ఫించ్ (0) డకౌటైన.. వేడ్ మాత్రం బౌండ్రీలతో రెచ్చిపోయాడు. మరో ఎండ్ నుంచి స్మిత్ (24) అతడికి చక్కటి సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించాక స్మిత్ ఔటైనా.. మ్యాక్స్‌వెల్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. ఈ జోడీ క్రమం తప్పకుండా భారీ షాట్లు ఆడటంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో వేడ్ 34 బంతుల్లో వరుసగా రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సిక్సర్లతో విజృంభించిన మ్యాక్స్‌వెల్ 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరాడు. ఈ జంట మూడో వికెట్‌కు 8.4 ఓవర్లలో 90 పరుగులు జోడించింది.
మిడిల్ ఓవర్లలో మరీ నెమ్మదిగా ఆడటం దెబ్బకొట్టింది. మరో 30 పరుగులైనా జోడించాల్సింది. అప్పుడు హార్దిక్ పాండ్యా పని సులువయ్యేది. ప్రేక్షకులతో నిండిన మైదానంలో ఆడితే వచ్చే ఆనందమే వేరు. టెస్టుల్లోనూ ఇదే పోరాట పటిమ కనబరుస్తాం. గత పర్యటనలోని ఆసీస్ జట్టుకంటే.. ప్రస్తుత జట్టు బలంగా ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడేదీ లేనిది ఫిజియోతో చర్చించాక వెల్లడిస్తా. ఒత్తిడిలోనూ నటరాజన్ చక్కగా రాణించాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇలాంటి ఆటగాడు లభించడం జట్టుకు సానుకూలాంశం
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్
హౌస్‌ఫుల్
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ అనంతరం తొలిసారి ఈ మ్యాచ్‌కే పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత స్టేడియం హౌస్ఫుల్కాగా.. అశేష అభిమానుల కోలాహలం మధ్య మ్యాచ్ జరుగడం ఆనందాన్నిచ్చింది.
30 పరుగులు అదనంగా..
ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో నటరాజన్ వేసిన బంతి నేరుగా వేడ్ ప్యాడ్‌ను తాకింది. ఎల్బీడబ్ల్యూ ఇచ్చేందుకు అంపైర్ నిరాకరించగా.. కాస్త తర్జన భర్జన తర్వాత కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే విరాట్ డీఆర్ఎస్కు వెళ్లడానికి ముందే స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై రిప్లే వేశారని వేడ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లడంతో రివ్యూను రద్దు చేశారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ దీనిపై మాట్లాడుతూ.. ‘అత్యున్నత స్థాయిలో ఇలాంటి తప్పిదాలు అమోదయోగ్యం కావు. చిన్న చిన్న పొరబాట్లే భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి’ అని అన్నాడు. ఆ సమయంలో 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేడ్ ఆ తర్వాత మరో 30 పరుగులు జోడించడం గమనార్హం.
నట్టూ ఇది నీదే: పాండ్యా
తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే అదరగొట్టిన పేసర్ నటరాజన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుకు అర్హుడని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ‘నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చావు. భిన్న పరిస్థితుల్లో నీ దమ్మేంటో లోకానికి చాటావు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు నువ్వు అర్హుడివి’ అని పాండ్యా ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియా: వేడ్ (ఎల్బీ) శార్దుల్ 80, ఫించ్ (సి) హార్దిక్ (బి) సుందర్ 0, స్మిత్ (బి) సుందర్ 24, మ్యాక్స్‌వెల్ (బి) నటరాజన్ 54, హెన్రిక్స్ (నాటౌట్) 5, షార్ట్ (రనౌట్) 7, సామ్స్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 186/5. వికెట్ల పతనం: 1-14, 2-79, 3-169, 4-175, 5-182, బౌలింగ్: దీపక్ 4-0-34-0, సుందర్ 4-0-34-2, నటరాజన్ 4-0-33-1, చాహల్ 4-0-41-0, శార్దుల్ 4-0-43-1.
భారత్: రాహుల్ (సి) స్మిత్ (బి) మ్యాక్స్‌వెల్ 0, ధవన్ (సి) సామ్స్ (బి) స్వెప్సన్ 28, కోహ్లీ (సి) సామ్స్ (బి) టై 85, శాంసన్ (సి) స్మిత్ (బి) స్వెప్సన్ 10, అయ్యర్ (ఎల్బీ) స్వెప్సన్ 0, హార్దిక్ (సి) ఫించ్ (బి) జంపా 20, సుందర్ (సి) టై (బి) అబాట్ 7, శార్దుల్ (నాటౌట్) 17, దీపక్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 174/7. వికెట్ల పతనం: 1-0, 2-74, 3-97, 4-100, 5-144, 6-151, 7-164, బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 3-0-20-1, అబాట్ 4-0-49-1, సామ్స్ 2-0-29-0, టై 4-0-31-1, స్వెప్సన్ 4-0-23-3, జంపా 3-0-21-1.
తాజావార్తలు
- బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవాలు దానం
- నడ్డా ఎవరు? ఆయనకెందుకు సమాధానమివ్వాలి: రాహుల్ సైటైర్లు
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?