ఆహా ఏమని వర్ణించగలం. టెస్టు క్రికెట్ మజా మరోమారు అభిమానులను కనువిందు చేసింది. వరుణుడి కారణంగా తొలి టెస్టులో విజయాన్ని చేజార్చుకున్న టీమ్ఇండియా లార్డ్స్ టెస్టులో అద్భుతమే చేసింది. ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన రెండో టెస్టులో భారత్ విజయ పతాక ఎగురవేసింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. షమీ అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కిన వేళ..పోరాడే స్కోరు అందుకున్న కోహ్లీసేన..రూట్‌సేనకు కల్లెం వేసింది. హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్, బుమ్రా, షమీ, ఇషాంత్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ 120 పరుగులకే కుప్పకూలింది. చురకత్తుల్లాంటి బంతులకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ గజగజ వణికిపోయారు. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసిన కోహ్లీసేన మీసం మెలేసింది.
లండన్: వారెవ్వా మ్యాచ్ అంటే ఇది. అవును భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు చూసిన ప్రతి అభిమాని మదిలో మెలిగేది ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెడుతూ సాగినమ్యాచ్‌లో టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు 120 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ రూట్(33)మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మహహ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో విజృంభించగా, బుమ్రా(3/33), ఇషాంత్‌శర్మ(2/13) రాణించారు. సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 25 నుంచి మూడో టెస్టు జరుగుతుంది.
సిరాజ్ కమాల్
తన బౌలింగ్ పదునేంటో మరోమారు ప్రత్యర్థికి రుచి చూపించాడు సిరాజ్. బుల్లెట్ లాంటి బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఓ ఆటాడుకున్నాడు. బర్న్స్(0)ను ఔట్ చేసి బుమ్రా వికెట్ల పతనానికి నాందిపలికితే..సిరాజ్ ఒకే ఓవర్లో బట్లర్(25), అండర్సన్(0)ను ఔట్ చేసి భారత్‌ను ఆనందంలో ముంచెత్తాడు. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘బాల్ బాల్ బచ్‌గయా’ అన్నట్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్..భారత్ పేస్ దళాన్ని ఎదుర్కొలేక ఘోరంగా చతికిలపడ్డారు. వచ్చి బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో సహనాన్ని కోల్పోయి భారత ఆటగాళ్లతో కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేశారు.
షమీ షాన్‌దార్
ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన లార్డ్స్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ చూపించిన తెగువకు ఫిధా కావాల్సిందే. ఇంగ్లండ్ బౌలింగ్ దాడికి అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరిన వేళ..టెయిలెండర్లు సత్తాచాటిన తీరు అద్భుతం. ఓవర్‌నైట్ స్కోరు 181/6తో ఆఖరి రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(22)..అండర్సన్‌ను లక్ష్యంగా చూడచక్కని బౌండరీతో ఆకట్టుకున్నాడు. ఇక టచ్‌లోకి వచ్చాడనుకుంటున్న తరుణంలోనే రాబిన్సన్ అద్భుత బంతికి పంత్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఇషాంత్‌శర్మ(16) కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో..రాబిన్సన్ విసిరిన నకుల్ బంతికి ఔటయ్యాడు. దీంతో 209 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఇక్కడే వాళ్ల అంచనాలు తలక్రిందులయ్యాయి. ఇంగ్లండ్ ఆశలపై షమీ(56 నాటౌట్), బుమ్రా(34 నాటౌట్ నీళ్లు గుమ్మరించారు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయారు. అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా షమీ..బ్యాట్స్‌మన్‌ను తలపిస్తూ కొట్టిన షాట్లకు లార్డ్స్ స్టేడియం ఊగిపోయింది.అలీని లక్ష్యంగా చేసుకున్న షమీ..వరుసగా ఫోర్, సిక్స్‌తో టెస్టు కెరీర్లో రెండో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 286/8 పరుగులతో లంచ్‌కు వెళ్లిన భారత్..తర్వాత రెండు ఓవర్ల తేడాతో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ గడ్డపై తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం(89 పరుగులు) నెలకొల్పిన భారత్..272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అద్భుతమైన టెస్టు విజయం. భారత పేస్ బౌలింగ్ దాడి సూపర్. మన హైదరాబాదీ సిరాజ్ అదరగొట్టాడు. షమీ, బుమ్రా బంతి, బ్యాట్‌తో రాణించారు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్‌కు అభినందనలు
–రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్(సి)బట్లర్(బి)వుడ్ 5, రోహిత్(సి)అలీ(బి)వుడ్ 21, పుజార(సి)రూట్(బి)వుడ్ 45, కోహ్లీ(సి)బట్లర్(బి)కరాన్ 20, రహానే(సి)బట్లర్(బి)అలీ 61, పంత్(సి)బట్లర్(బి)రాబిన్సన్ 22, జడేజా(బి)అలీ 3, ఇషాంత్(ఎల్బీ)రాబిన్సన్ 16, షమీ 56 నాటౌట్, బుమ్రా 34 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 298/8 డిక్లేర్డ్; వికెట్ల పతనం: 1-18, 2-27, 3-55, 4-155, 5-167, 6-175, 7-194, 8-209; బౌలింగ్: అండర్సన్ 25.3-6-53-0, రాబిన్సన్ 17-6-45-2, వుడ్ 18-4-51-3, కరాన్ 18-3-42-1, అలీ 26-1-84-2, రూట్ 5-0-9-0.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్(సి)సిరాజ్(బి)బుమ్రా 0, సిబ్లే(సి)పంత్(బి)షమీ 0, హమీద్(ఎల్బీ)ఇషాంత్ 9, రూట్(సి)కోహ్లీ(బి)బుమ్రా 33, బెయిర్‌స్టో(ఎల్బీ)ఇషాంత్ 2, బట్లర్(సి)పంత్(బి)సిరాజ్ 25, అలీ(సి)కోహ్లీ(బి)సిరాజ్ 13, కరాన్(సి)పంత్(బి)సిరాజ్ 0, రాబిన్సన్ (ఎల్బీ)బుమ్రా 9, వుడ్ 0 నాటౌట్, అండర్సన్(బి)సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు: 29; మొత్తం: 120 ఆలౌట్; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-44, 4-67, 5-67, 6-90, 7-90, 8-120, 9-120, 10-120; బౌలింగ్: బుమ్రా 15-3-33-3, షమీ 10-5-13-1, జడేజా 6-3-5-0, సిరాజ్ 10.5-3-30-4, ఇషాంత్ 10-3-13-2.