బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 29, 2020 , 12:59:19

సెమీస్‌ సన్నాహం

సెమీస్‌ సన్నాహం

విశ్వసమరంలో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత మహిళల జట్టు.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, బౌలింగ్‌లో పూనమ్‌ యాదవ్‌ వీర విజృంభణతో అజేయంగా సాగుతున్న హర్మన్‌ గ్యాంగ్‌కు ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు. అయితే నాకౌట్‌కు ముందు మిడిలార్డర్‌ లోపాలు సరిదిద్దుకునేందుకు మనవాళ్లకు ఇది చక్కటి అవకాశం. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బ్యాట్‌తో మెరిస్తే.. టీమ్‌ఇండియా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెడుతుంది!

  • నేడు శ్రీలంకతో తలపడనున్న భారత్‌.. మహిళల టీ20 ప్రపంచకప్‌

మెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న భారత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు సెమీస్‌లో అడుగుపెట్టినా.. ఒక్కసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించలేకపోయిన భారత అమ్మాయిలు ఈసారి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. గ్రూప్‌-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హర్మన్‌ బృందం నాకౌట్‌కు ముందు ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక మహిళలతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడి జంక్షన్‌ ఓవెల్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగనుంది. సెమీఫైనల్‌కు ముందు జట్టులోని లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు భారత జట్టుకు ఇది చక్కటి అవకాశం కాగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన లంక.. టోర్నీలో బోణీ కొట్టాలని తహతహలాడుతున్నది.


షఫాలీపై అందరి దృష్టి

మెగాటోర్నీలో ఆజేయంగా సెమీస్‌ చేరిన భారత్‌ను మిడిలార్డర్‌ వైఫల్యం కలవరపెడుతున్నది. భీకర ఫామ్‌లో ఉన్న ‘లేడీ సెహ్వాగ్‌' షఫాలీ వర్మ జట్టుకు మెరుగైన ఆరంభాలను ఇస్తున్నా తక్కినవారి నుంచి ఆమెకు సహకారంకరువైంది. ముంబైకర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఫర్వాలేదనిపిస్తుండగా.. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నది. ఇక మిడిలార్డర్‌ భారం మోయాల్సిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. వైఫల్యాల బాట వీడటం లేదు. ఫలితంగా ఈ విశ్వసమరంలో భారత్‌ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. సెమీస్‌కు ముందు హర్మన్‌ లయ దొరకబుచ్చుకుంటే.. మనవాళ్లకు తిరుగుండదు. బౌలర్లు సమిష్టిగా కదంతొక్కుతుండటంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లను ఓడించిన టీమ్‌ఇండియా.


లంకతో మ్యాచ్‌లో భారీ స్కోరుపై కన్నేసింది. చేసిన తప్పులనే తిరిగి పునరావృతం చేస్తున్నామని ఒప్పుకున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌.. ఈ సారి ఎలాంటి పొరపాట్లకు అవకాశమివ్వబోమని నమ్మకంగా చెబుతున్నది. బౌలింగ్‌ విషయానికొస్తే.. అంతుచిక్కని బంతులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్న లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ ఇదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటున్నది. టోర్నీలో ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు పడగొట్టిన పూనమ్‌కు మిగిలిన బౌలర్లు సహకరిస్తే.. భారత్‌ అజేయంగా సెమీస్‌ చేరడం పెద్ద కష్టమేం కాదు. అయితే నాకౌట్‌కు ముందు ఈ మ్యాచ్‌ను రిహార్సల్స్‌గా భావిస్తున్న టీమ్‌ఇండియా.. లోపాలను సరిచేసుకుంటుందా లేక పాత పాటే పాడుతుందా చూడాలి. మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతున్న లంక ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నది.


నేటి మ్యాచ్‌లు

న్యూజిలాండ్‌ X బంగ్లాదేశ్‌

వేదిక: మెల్‌బోర్న్‌ఉ. 5.30

భారత్‌ X శ్రీలంక

వేదిక: మెల్‌బోర్న్‌మ. 1.30


శనివారం గ్రూప్‌-బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌పై విజయం సాధించగా.. ఇంగ్లండ్‌ 42 రన్స్‌ తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లిజెల్లీ లీ (60 బంతుల్లో 101; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో మెరిసింది.


సెమీస్‌కు అర్హత సాధించినా.. లంకతో మ్యాచ్‌లో తీవ్రత  తగ్గించం. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం లేదు. మా ప్రణాళికలను అమలు చేయడంపైనే దృష్టిపెడతాం. సెమీఫైనల్‌ గురించి ఇప్పుడే చర్చించడం తొందరపాటవుతుంది. లంక కెప్టెన్‌ వికెట్‌ పడగొట్టడం ముఖ్యమే కానీ, ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయాలనేదే మా ఆలోచన. 

- హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, భారత్‌ కెప్టెన్‌


తుది జట్లు (అంచనా)

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌) షఫాలీ వర్మ, స్మృతి, తానియా, జెమీమా, దీప్తి, వేద, శిఖ, రాధ, పూనమ్‌, రాజేశ్వరి.

శ్రీలంక: జయంగని (కెప్టెన్‌), హాసిని, తిమాషిని, సంజీవనీ, నీలాక్షి, కాంచన, శశికళ, మాధవి, దిల్హారి, కుమారి, ప్రబోధిని.


logo