బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 27, 2020 , 01:12:04

హ్యాట్రిక్‌పె గురి

హ్యాట్రిక్‌పె గురి

పొట్టి ప్రపంచకప్‌లో అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్న భారత అమ్మాయిలు.. న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. పటిష్ఠ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిన హర్మన్‌ గ్యాంగ్‌.. బంగ్లాపై అలవోక విజయంతో మంచి దూకుడు మీదుంది. ఇదే జోరులో బ్లాక్‌క్యాప్స్‌ను పడగొట్టి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమ్‌ఇండియా యోచిస్తుంటే.. ఈ ఫార్మాట్‌లో తమ ప్రతాపమేంటో చాటిచెప్పి గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరాలని కివీస్‌ కృతనిశ్చయంతో ఉంది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది.

  • నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ
  • జోరుమీదున్న హర్మన్‌సేన.. మహిళల టీ20 ప్రపంచకప్‌

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అమ్మాయిలు మరో పోరుకు సిద్ధమయ్యారు. తొలి మ్యాచ్‌ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. మలి పోరులో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ముచ్చటగా మూడో మ్యాచ్‌లో పటిష్ఠ న్యూజిలాండ్‌తో పోటీకి రెడీ అయింది. గ్రూప్‌-ఏలో భాగంగా గురువారం ఇక్కడి జంక్షన్‌ ఓవెల్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే భారత్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన అమ్మాయిలు అదే జోరు కొనసాగించి హ్యాట్రిక్‌ విజయంతో నాకౌట్‌లో అడుగుపెట్టాలని తహతహలాడుతుంటే.. భారత్‌ను అడ్డుకొని పట్టికలో అగ్రస్థానానికి చేరాలని న్యూజిలాండ్‌ ఉవ్విళ్లూరుతున్నది.


టాపార్డర్‌పైనే భారం

తొలి రెండు మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించిన పదహారేండ్ల యంగ్‌గన్‌ షఫాలీ వర్మపై భారత యాజమాన్యం గంపెడాశలు పెట్టుకుంది. పవర్‌ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న షఫాలీ.. ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో పడేస్తున్నది. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించేలా వీర విజృంభణ చేస్తున్న షఫాలీ మరోసారి మెరుగైన ఆరంభాన్నిస్తే.. టీమ్‌ఇండియాకు తిరుగుండదు. అనారోగ్యం కారణంగా బంగ్లాతో మ్యాచ్‌కు దూరమైన స్మృతి మంధాన కీలక పోరుకు అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. వీరిద్దరు ఇచ్చే ఆరంభాలపైనే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వన్‌డౌన్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ కూడా మంచి టచ్‌లో ఉంది. దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఒక్కో మ్యాచ్‌లో రాణించారు. ఎటొచ్చి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైఫల్యమే టీమ్‌ఇండియాను కలవర పెడుతున్నది. హార్డ్‌ హిట్టర్‌గా మంచి గుర్తింపు ఉన్న హర్మన్‌ ఈ టోర్నీలో ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 


పూనమ్‌ మరోసారి తిప్పేస్తే..

టోర్నీ ఆరంభం నుంచి తన అద్భుత బౌలింగ్‌తో కట్టిపడేస్తున్న పూనమ్‌ యాదవ్‌ మరోసారి విజృంభిస్తే.. టీమ్‌ఇండియా విజయం నల్లేరుపై నడకే. తనకే సొంతమైన ఫ్లైటెడ్‌ బంతులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్న పూనమ్‌.. కివీస్‌పై కూడా చెలరేగాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. పేస్‌ విభాగంలో శిఖ జట్టుకు చక్కటి ఆరంభాలను ఇస్తున్నది. గత మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్‌ అరుంధతి రెడ్డి కూడా రాణించడం సానుకూలాంశం.


కివీస్‌దే పైచేయి

గతేడాది టీమ్‌ఇండియాతో జరిగిన పొట్టి సిరీస్‌ను న్యూజిలాండ్‌ 3-0తో సొంతం చేసుకున్నది. అయితే 2018 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ అమ్మాయిలను ఓడించడం భారత్‌కు సానుకూలాంశం. డివైన్‌, సూజీ బేట్స్‌, అమెలియా కెర్‌,్ర తహూహు రూపంలో కివీస్‌ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లు ఉన్నారు. 


అచ్చం  నాలాగే


గత రెండు మూడేండ్లుగా జట్టు కోసం నేను ఏం చేశానో.. ఇప్పుడు షఫాలీ అదే చేస్తున్నది. పవర్‌ప్లేలో భారీగా పరుగులు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. ధాటిగా ఆడుతూ బౌలర్ల లయ దెబ్బతీస్తున్నది. దీంతో జట్టుకు మరింత సమతూకం చేరినైట్లెంది. ఆమెతో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా. న్యూజిలాండ్‌తో పోరు గురించి ఎలాంటి ఆందోళన లేదు. గత రెండు మ్యాచ్‌ల్లోలానే ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. 

 -స్మృతి మంధాన


హీతెర్‌ నైట్‌ అజేయ సెంచరీ

కాన్‌బెర్రా: కెప్టెన్‌ హీతెర్‌ నైట్‌ (66 బంతుల్లో 108 నాటౌట్‌; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌  98 పరుగుల తేడాతో విజయపతాక ఎగురవేసింది. గ్రూప్‌-బిలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. స్కీవర్‌ (59; 8 ఫోర్లు)తో కలిసి నైట్‌ చెలరేగిపోయింది. వీరిద్దరూ అభేద్యమైన మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అనతరం లక్ష్యఛేదనలో థా య్‌లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 


logo