మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 24, 2020 , 00:43:27

ఇక కష్టమే..!

ఇక కష్టమే..!

ప్రత్యర్థి టెయిలెండర్లు యథేచ్చగా బౌండ్రీలు బాదిన చోట..మనవాళ్లు సింగిల్స్‌ తీసేందుకు ప్రయాసపడ్డారు. కివీస్‌ బౌలర్లు నిప్పులు చెరిగిన చోట..తోక తెంచేందుకు మన పేసర్లు నానా తంటాలు పడ్డారు.ఫలితంగా న్యూజిలాండ్‌తోజరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా.. అతి జాగ్రత్తకుపోయి అటు పరుగులు చేయలేక ఇటు వికెట్లు కాపాడుకోలేక మూడో రోజు ఉసూరుమనిపించింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ గట్టెక్కాలంటే టెస్టు స్పెషలిస్ట్‌లు రహానే, విహారి అద్భుతం చేయాల్సిందే..!

  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 144/4
  • న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 348 ఆలౌట్‌
  • ప్రస్తుతం 39 పరుగులు వెనుకబడి ఉన్న కోహ్లీ సేన
  • రహానే, విహారిపైనే ఆశలు

వెల్లింగ్టన్‌: కివీస్‌ గడ్డపై భారత్‌ తడబాటు కొనసాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైన టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లోనైనా మెరుపులు మెరిపిస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా అతిజాగ్రత్తకుపోయి మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా (14) విఫలం కాగా.. సీనియర్లు చతేశ్వర్‌ పుజారా (81 బంతుల్లో 11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (19) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చక్కటి షాట్లతో అలరించిన మయాంక్‌ అగర్వాల్‌ (58; 7 ఫోర్లు, ఒక సిక్స్‌).. అంపైర్‌ సందేహాస్పద నిర్ణయానికి వెనుదిరిగాడు. 


న్యూజిలాండ్‌ బౌలర్లలో బౌల్ట్‌ (3/27) రాణించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 216/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ క్రితం రోజు స్కోరుకు మరో 132 పరుగులు జతచేసి 348 వద్ద ఆలౌటైంది. ఆఖర్లో గ్రాండ్‌హోమ్‌ (43; 5 ఫోర్లు), జెమీసన్‌ (44; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు), బౌల్ట్‌ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, ఒక సిక్స్‌) ధాటిగా ఆడి ఆ జట్టుకు 183 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. భారత బౌలర్లలో ఇషాంత్‌కు 5, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్‌.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 39 పరుగులు వెనుకబడి ఉంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (25 బ్యాటింగ్‌), తెలుగు ఆటగాడు విహారి (70 బంతుల్లో 15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.


టాప్‌ మరోసారి విఫలం

భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన టీమ్‌ఇండియాకు ఈ సారి కూడా మంచి ఆరంభం లభించలేదు. బౌల్ట్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో పృథ్వీ షా క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ భారత బ్యాట్స్‌మెన్‌ మరీ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. బౌల్ట్‌తో పాటు, జెమీసన్‌, గ్రాండ్‌హోమ్‌ స్వింగ్‌ బంతులతో చెలరేగుతుంటే మనవాళ్లు పరుగులు చేయడం పక్కన పెట్టి వికెట్‌ కాపాడుకోవడంపై దృష్టి సారించారు. ఫలితంగా మూడో రోజు 65 ఓవర్లు ఆడిన టీమ్‌ఇండియా 2.21 రన్‌రేట్‌తో 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీ విరామానికి ముందు చివరి బంతికి పుజారా ఔటయ్యాడు. 


ఈ పర్యటనలో ఇప్పటి వరకు తనదైన మార్క్‌ చూపెట్టలేకపోయిన కోహ్లీ.. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపిస్తే.. అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న మయాంక్‌ అగర్వాల్‌ అంపైర్‌ అనుమానాస్పద నిర్ణయానికి పెవిలియన్‌ బాటపట్టాడు. సౌథీ వేసిన లెగ్‌సైడ్‌ బంతిని మయాంక్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. అది అతడి బ్యాట్‌ పక్క నుంచి వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. వెంటనే అంపైర్‌ వేలెత్తగా.. కెప్టెన్‌ సలహాతో మయాంక్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. హాక్‌ ఐలో బంతి బ్యాట్‌కు తాగల్లేదని స్పష్టమైనా.. స్నికోలో కాస్త శబ్ధం రావడంతో అంపైర్‌ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. దీంతో మయాంక్‌ భారంగా డగౌట్‌ చేరాడు. కాసేపటికి షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడేందుకు యత్నించిన కోహ్లీ.. కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో ఓపిగ్గా ఆడిన రహానే, విహారి జోడీ మరో వికెట్‌ పడకుండా రోజును ముగించింది.


తోక తెంచలేక..

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 216/5 తో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ వాట్లింగ్‌ (14).. బుమ్రా వేసిన తొలి బంతికే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెండు ఓవర్ల తర్వాత సౌథీ (6)ని ఇషాంత్‌ పెవిలియన్‌ బాట పట్టించాడు. దీంతో కివీస్‌ 226/7తో నిలిచింది. ఇక ఇన్నింగ్స్‌ ఎక్కవసేపు సాగదని భావిస్తే.. గ్రాండ్‌హోమ్‌ అండగా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బౌండ్రీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. గ్రాండ్‌హోమ్‌ కాస్త ఆచితూచి ఆడినా.. అరంగేట్ర ఆటగాడు జెమీసన్‌ సిక్సర్లే లక్ష్యంగా దూసుకెళ్లాడు. షమీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన అతడు.. అశ్విన్‌ వేసిన ఓకే ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు అరుసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 71 పరుగులు జోడించాక అశ్విన్‌ ఈ జోడీని విడగొట్టాడు. కాసేపటికే గ్రాండ్‌హోమ్‌ను కూడా అశ్విన్‌ బుట్టలో వేసుకున్నా.. ఆఖర్లో బౌల్ట్‌ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ విలువైన పరుగులు జోడించాడు. భారత జట్టు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరుకు 43 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోతే.. న్యూజిలాండ్‌ మూడో రోజు ఐదు వికెట్లే కోల్పోయి 132 పరుగులు చేయడం గమనార్హం.


అతడిపైనే ఆశలు..

టెక్నిక్‌లో తిరుగులేని ఆటగాడైన అజింక్యా రహానేపైనే ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆశలు పెట్టుకుంది. సోమవారం అతడు ఎలా ఆడుతాడన్నదానిపైనే ఈ మ్యాచ్‌లో భారత్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. విహారి, పంత్‌, అశ్విన్‌ కూడా తలో చేయి వేస్తే టీమ్‌ఇండియా పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలుగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ టెయిలెండర్లు చూపెట్టిన పట్టుదలను మనవాళ్లు కూడా కనబరిస్తే.. మ్యాచ్‌లో మన అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే టెస్టు చేజారడం ఖాయమే. నాలుగో రోజు తొలి సెషన్‌ టీమ్‌ఇండియాకు కీలకం కానున్నది.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 11, బ్లండెల్‌ (బి) ఇషాంత్‌ 30, విలియమ్సన్‌ (సి) (సబ్‌) జడేజా (బి) షమీ 89, టేలర్‌ (సి) పుజారా (బి) ఇషాంత్‌ 44, నికోల్స్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 17, వాట్లింగ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 14, గ్రాండ్‌హోమ్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 43, సౌథీ (సి) షమీ (బి) ఇషాంత్‌ 6, జెమీసన్‌ (సి) విహారి (బి) అశ్విన్‌ 44, ఎజాజ్‌ పటేల్‌ (నాటౌట్‌) 4, బౌల్ట్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 38, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 100.2 ఓవర్లలో 348 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-26, 2-73, 3-166, 4-185, 5-207, 6-216, 7-225, 8-296, 9-310, 10-348, బౌలింగ్‌: బుమ్రా 26-5-88-1, ఇషాంత్‌ 22.2-6-68-5, షమీ 23-2-91-1, అశ్విన్‌ 29-1-99-3.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 14, మయాంక్‌ (సి) వాట్లింగ్‌ (బి) సౌథీ 58, పుజారా (బి) బౌల్ట్‌ 11, కోహ్లీ (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 19, రహానే (నాటౌట్‌) 25, విహారి (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 65 ఓవర్లలో 144/4. వికెట్ల పతనం: 1-27, 2-78, 3-96, 4-113, బౌలింగ్‌: సౌథీ 15-5-41-1, బౌల్ట్‌ 16-6-27-3, గ్రాండ్‌హోమ్‌ 14-5-25-0, జెమీసన్‌ 17-7-33-0, ఎజాజ్‌ పటేల్‌ 3-0-18-0.logo
>>>>>>