మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Jan 30, 2020 , 00:49:11

భారత్‌ సూపర్‌ విక్టరీ

భారత్‌ సూపర్‌ విక్టరీ

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ కొత్త చరిత్ర లిఖించింది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న టీ20 సిరీస్‌ గెలుపును అద్భుత రీతిలో ఒడిసిపట్టుకుంది. ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన కివీస్‌ను వారి సొంత ఇలాఖాలోనే మట్టికరిపిస్తూ రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే కోహ్లీసేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. వేదిక మారినా.. ఫలితంలో మార్పుండదని చూపిస్తూ ‘సూపర్‌' విజయాన్నందుకుంది. రోహిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పోరాడే స్కోరందుకున్న టీమ్‌ఇండియా.. కివీస్‌ను కట్టడి చేసింది. సహచరులు విఫలమైన చోట నాయకుడిగా విలియమ్సన్‌ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో షమీ మాయాజాలంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ అద్భుతం చేశాడు. సౌథీ బౌలింగ్‌లో కండ్లు చెదిరే రీతిలో సిక్స్‌లు కొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.

  • అదరగొట్టిన రోహిత్‌శర్మ..
  • విలియమ్సన్‌ ఒంటరి పోరాటం వృథా
  • కివీస్‌ గడ్డపై కోహ్లీసేన కొత్త చరిత్ర..
  • టీ20 సిరీస్‌ కైవసం..
  • మూడో మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయంహామిల్టన్‌: ‘అతడి చేతులు అద్భుతం చేశాయి’. ఇది భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మకు అతికినట్లు సరిపోతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లకే వెనుదిరిగి ఒకింత ఒత్తిడిలో ఉన్న హిట్‌మ్యాన్‌ మూడో మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. తాను టచ్‌లోకి వస్తే ప్రత్యర్థికి పట్టపగలు చుక్కలే అన్న రీతిలో చెలరేగిన తీరు అభిమానులను కట్టిపడేసింది. బుధవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్‌(40 బంతుల్లో 65, 6ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు కోహ్లీ(38) రాణింపుతో టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. బెన్నెట్‌(3/54)కు మూడు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో కివీస్‌..విలియమ్సన్‌(48 బంతుల్లో 95, 8ఫోర్లు, 6సిక్స్‌లు) విజృంభణతో 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. శార్దుల్‌ ఠాకూర్‌(2/21), షమీ(2/32) రెండేసి వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో జట్టు గెలుపులో కీలకమైన రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం జరుగుతుంది. రోహిత్‌ ధనాధన్‌ 

రోహిత్‌శర్మ కివీస్‌పై జూలు విదిల్చాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీగా మలిచిన రోహిత్‌ క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకొన్నా.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ కూడా జతకలువడంతో పరుగుల రాక ఊపందుకుంది. బెన్నెట్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ముంబైకర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. దీంతో 23 బంతుల్లోనే రోహిత్‌ అర్ధసెంచరీ మార్క్‌ అందుకోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా భారత్‌ 69 పరుగులు చేసింది. ఈ క్రమంలో పవర్‌ప్లేలో అర్ధసెంచరీ కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డుల్లోకెక్కాడు. వీరిద్దరి జోరు చూస్తే పరుగుల వరద ఖాయమే అనుకుంటున్న తరుణంలో రాహుల్‌ను గ్రాండ్‌హోమ్‌ సాగనంపడంతో 89 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి  బ్రేక్‌ పడింది. ప్రమోషన్‌లో భాగంగా మూడో డౌన్‌లో వచ్చిన దూబే(3) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బెన్నెట్‌ ఒకే ఓవర్లో రోహిత్‌, దూబేను ఔట్‌ చేసి కివీస్‌ శిబిరంలో ఆనందం నింపాడు. ఇక్కణ్నుంచి ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. కెప్టెన్‌ కోహ్లీ సిక్స్‌, ఫోర్‌తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మంచి ఫామ్‌మీదున్న అయ్యర్‌ భారీ సిక్స్‌తో తన ఉద్దేశాన్ని చాటినా..సాంట్నర్‌ బౌలింగ్‌లో స్టంప్‌ఔట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరు మందగించింది. ఆఖర్లో పరుగులు సాధించే ప్రయత్నంలో కోహ్లీ..బెన్నెట్‌కు వికెట్‌ ఇచ్చుకున్నాడు. సౌథీ చివరి ఓవర్‌లో పాండే, జడేజా సిక్స్‌తో పోరాడే స్కోరు అందుకుంది. 


విలియమ్సన్‌ పోరాడినా 


భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కివీస్‌కు శుభారంభం దక్కింది. శార్దుల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతినే గప్టిల్‌ భారీ సిక్స్‌గా మలిచాడు. షమీ తన తొలి ఓవర్‌లో పొదుపు పాటించి ఆకట్టుకోగా, బుమ్రా మాత్రం గప్టిల్‌కు రెండు సిక్స్‌లు ఇచ్చుకున్నాడు. కచ్చితమైన పేస్‌తో మరుసటి ఓవర్‌కు దిగిన షమీ..మున్రోను ఇబ్బంది పెట్టాడు. ఈ బెంగాల్‌ పేసర్‌ విసిరిన బంతి తగిలి మున్రో విలవిల్లాడిపోయాడు. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన చాహల్‌ను కూడా అరుసుకోవడంతో స్కోరు వేగం అందుకుంది. ఈ తరుణంలో గప్టిల్‌ను శార్దుల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ పంపాడు. గప్టిల్‌ను అనుసరిస్తూ మున్రో కూడా వెనుదిరుగడంతో కివీస్‌ 52 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే క్రమంలో షాట్‌ ఆడబోయిన సాంట్నర్‌ ఎనిమిది పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను జడేజా నేలపాలు చేశాడు. ఓవైపు కెప్టెన్‌ విలియమ్సన్‌ బౌండరీలతో లక్ష్యాన్ని అంతకంతకు కరిగించే ప్రయత్నం చేశాడు. తానేం తక్కువ కాదన్నట్లు బ్యాటు ఝులిపించే క్రమంలో చాహల్‌ బంతిని అంచనా వేయని సాంట్నర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. గ్రాండ్‌హోమ్‌(5) తన పేలవ ఫామ్‌ను మరోమారు కొనసాగించగా, విలియమ్సన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ముందుకునడపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పోయాడు. ముఖ్య ంగా బుమ్రా బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో విరుచుకుపడ్డ కేన్‌కు టేలర్‌ చక్కని సహకారం అందించాడు. 


షమీ అదుర్స్‌ 


19 ఓవర్లో బుమ్రా 11 పరుగులిచ్చుకోవడంతో ఆఖరి ఓవర్లో కివీస్‌ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. షమీ తొలి బంతినే టేలర్‌సిక్స్‌ కొట్టి గుబులు రేపాడు. మరుసటి బంతికి ఒక పరుగు రావడంతో సమీకరణం కాస్త నాలుగు బంతుల్లో 2 పరుగులకు మారింది. మూడో బంతికి విలియమ్సన్‌ ఔట్‌ కాగా వరుసగా రెండు బంతుల్లో ఒక పరుగు వచ్చింది. ఆఖరి బంతికి టేలర్‌ బౌల్డ్‌ కావడంతో స్కోర్లు సమమై మ్యాచ్‌ టైగా ముగిసింది. 


ఒక దశలో మ్యాచ్‌ కోల్పోతామనుకున్నాం. కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ చూస్తే అలాగే అనిపించింది. కానీ షమీ మరోమారు అద్భుతం చేశాడు. అనుభవాన్నంతా ఉపయోగిస్తూ ఆఫ్‌స్టంప్‌ అవతల బంతులు వేయడం కలిసొచ్చింది. ఆఖరి బంతి స్టంప్స్‌కు తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే కచ్చితంగా వాళ్లు సింగిల్‌ తీస్తే మేము మ్యాచ్‌ను కోల్పోయేవాళ్లం. సూపర్‌ ఓవర్లో రోహిత్‌ సూపర్‌ సిక్స్‌లతో విజయాన్నందుకున్నాం.  

-కోహ్లీ 


స్కోరుబోర్డు 

రోహిత్‌(సి)సౌథీ(బి) బెన్నెట్‌ 65, రాహుల్‌(సి)మున్రో(బి)గ్రాండ్‌హోమ్‌ 27, దూబే(సి)సోధీ (బి)బెన్నెట్‌ 3, కోహ్లీ(సి)సౌథీ(బి)బెన్నెట్‌ 38, అయ్యర్‌(సి)సీఫెర్ట్‌(బి)సాంట్నర్‌ 17, మనీశ్‌ పాండే 14 నాటౌట్‌, జడేజా 10 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 179/5; వికెట్ల పతనం: 1-89, 2-94, 3-96, 4-142, 5-160; బౌలింగ్‌: సౌథీ 4-0-39-0, బెన్నెట్‌ 4-0-54-3, కుగెల్జిన్‌ 2-0-10-0, సాంట్నర్‌ 4-0-37-1, సోధీ 4-0-23-0, గ్రాం డ్‌హోమ్‌ 2-0-13-1. 


న్యూజిలాండ్‌: గప్టిల్‌(సి/సబ్‌) శాంసన్‌(బి)శార్దుల్‌ 31, మున్రో (స్టంప్‌/రాహుల్‌)(బి)జడేజా 14, విలియమ్సన్‌   (సి)రాహుల్‌(బి)షమీ 95, సాంట్నర్‌ (బి)చాహల్‌ 9, గ్రాండ్‌హోమ్‌ (సి)దూబే (బి)శార్దుల్‌ 5, టేలర్‌(బి)షమీ 17, సీఫెర్ట్‌ 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 179/6; వికెట్ల పతనం: 1-47, 2-52, 3-88, 4-137, 5-178, 6-179; బౌలింగ్‌: ఠాకూర్‌ 3-0-21-2, షమీ 4-0-32-2, బుమ్రా 4-0-45-0, చాహల్‌ 4-0-36-1, జడేజా 4-0-23-1, దూబే 1-0-14-0. 

logo