గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 00:12:12

వన్డే వార్‌..

వన్డే వార్‌..

ప్రత్యర్థిని వారి సొంతగడ్డపైనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టీమ్‌ఇండియా వన్డే పోరుకు సై అంటున్నది. టీ20 సిరీస్‌లో ఒకటికి ఐదుసార్లు న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన కోహ్లీ సేన.. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో తొలిసారి బ్లాక్‌క్యాప్స్‌తో తలపడనుంది. ఇరుజట్లు గాయాలతో సతమతమవుతున్నా.. రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని కోహ్లీ అంటుంటే.. విలియమ్సన్‌ గైర్హాజరీలో లాథమ్‌ కివీస్‌ను నడిపించనున్నాడు. పొట్టి సిరీస్‌ మాదిరిగా కాకుండా.. వన్డేలు ఉదయాన్నే ప్రారంభం కానున్నాయి. మీరు ఈ వార్త చదివే లోపే మ్యాచ్‌ ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు! మరి ఆలస్యమెందుకు టీవీలు ట్యూన్‌ చేసేయండి.

  • నేడు భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే
  • గాయాలతో ఇరుజట్లు సతమతం
  • కొత్త కుర్రాళ్లపైనే ఆశలు
  • కివీస్‌ కాస్కో
  • ఉదయం 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

హామిల్టన్‌: పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థిని చితక్కొట్టి మంచి జోరుమీదున్న టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడి సెడాన్‌ పార్క్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ అనంతరం ఇరు జట్ల మధ్య ఇదే తొలి వన్డే కావడం గమనార్హం. మెగాటోర్నీ తర్వాత కోహ్లీసేన వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయాలు సాధిస్తే.. న్యూజిలాండ్‌ మాత్రం అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌ బరిలోనే దిగలేదు. 


ప్రపంచకప్‌ తుది సమరంలో ఇంగ్లండ్‌ చేతిలో సూపర్‌ ఓవర్‌లో ఓడిన కివీస్‌ అప్పటి నుంచి వన్డేలు ఆడకపోగా.. మిగిలిన ఫార్మాట్లలోనూ తడబాటు కొనసాగుతున్నది. గత తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ బ్లాక్‌ క్యాప్స్‌ ఓటమి పాలయ్యారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయపడటం ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ కాగా.. యువ ఆటగాళ్లు తమ జట్టు రాత మారుస్తారని తాత్కాలిక సారథి లాథమ్‌ అంటున్నాడు. మరోవైపు భారత్‌ కూడా రోహిత్‌ శర్మ సేవలు కోల్పోయింది. ధవన్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్‌లో మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా ఓపెనింగ్‌ చేయనున్నారు. మరి వరుస విజయాలతో ఊపుమీదున్న కోహ్లీ గ్యాంగ్‌ను.. లాథమ్‌ సేన నిలువరిస్తుందా చూడాలి.


పృథ్వీపైనే దృష్టి

రెండేండ్ల క్రితం ఇదే సమయంలో న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత సారథి పృథ్వీ షా.. బుధవారం టీమ్‌ఇండియా తరఫున తొలి వన్డే ఆడనున్నాడు. ఈ సిరీస్‌ను టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహంగా భావించడం లేదన్న కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌లో కొత్త కుర్రాళ్లను పరీక్షించాలనుకుంటున్నాడు. పిక్క కండరాలు పట్టేయడంతో సిరీస్‌కు దూరమైన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో.. మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌నకు చివరి నిమిషంలో మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికైనా.. మ్యాచ్‌ ఆడే అవకాశం మాత్రం రాలేదు.


మరోవైపు ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌ బరిలో దిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షాకు ఇదే తొలి వన్డే పిలుపు. వన్‌డౌన్‌లో కోహ్లీ పక్కా కాగా.. నాలుగో స్థానంలో అయ్యర్‌ బ్యాటింగ్‌కు రానున్నాడు. లోకేశ్‌ రాహుల్‌ను ఫినిషర్‌గానే పరిగణిస్తామని మ్యాచ్‌కు ముందు విరాట్‌ పేర్కొన్న నేపథ్యంలో అతడు ఐదో స్థానంలోనే కొనసాగుతాడు. ప్రస్తుతానికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాహుల్‌తోనే వికెట్‌ కీపింగ్‌ చేయించాలని జట్టు యాజమాన్యం భావిస్తుండటంతో పంత్‌ ఎదురుచూడక తప్పదు. ఆరో ప్లేస్‌లో మనీశ్‌ పాండేను ఆడిస్తారా లేక అదనపు ఆల్‌రౌ ండర్‌ వైపు మొగ్గు చూపుతారా అనేది తేలాల్సి ఉంది. పేస్‌ బౌలింగ్‌లో బుమ్రా, షమీతో పాటు శార్దూల్‌, సైనీల్లో ఒకరు తుది జట్టులో ఉండనున్నారు. జడేజాతో పాటు కుల్దీప్‌, చాహల్‌లో ఒకరు స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు.


పోటీనిచ్చేనా..

మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు కూడా గాయలతో సతమతమవుతున్నది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవడంతో అతడి స్థానంలో మార్క్‌ చాప్‌మన్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. తాత్కాలిక సారథి టామ్‌ లాథమ్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. ఏదేమైనా ఈ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు పోటీనివ్వాలంటే సీనియర్లు టేలర్‌, గప్టిల్‌ సత్తాచాటక తప్పదు. లాథమ్‌, నికోల్స్‌, చాప్‌మన్‌ కూడా తలో చేయి వేస్తే భారీ స్కోరు ఖాయమే. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆల్‌రౌండర్లు నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌ రెండు విభాగాల్లో విజృంభిస్తే కివీస్‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో కుగ్‌లిన్‌, బెనెట్‌, సౌథీ కీలకం కానున్నారు. న్యూజిలాండ్‌ చరిత్రలో అత్యంత పొడగరి పేసర్‌ జెమీసన్‌ (6 అడుగుల 8 అంగులాలు)కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి.


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, అయ్యర్‌, రాహుల్‌, మనీశ్‌ పాండే, జడేజా, శార్దూల్‌/సైనీ, చాహల్‌/కుల్దీప్‌, షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్‌), గప్టిల్‌, నికోల్స్‌, చాప్‌మన్‌, టేలర్‌, గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌, శాంట్నర్‌/సోధి, సౌథీ/జెమీసన్‌, బెనెట్‌, కుగ్‌లిన్‌.


పిచ్‌, వాతావరణం

ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరిగిన పిచ్‌పైనే తొలి వన్డే నిర్వహించనున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ మందకొడిగా ఉండనుంది. మ్యాచ్‌ రోజు వర్ష సూచనలేదు. 


టీ20 ప్రపంచకప్‌ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదు. దానికి ఐపీఎల్‌ సరైన వేదిక అని భావిస్తు న్నాం. పృథ్వీ, మయాంక్‌ ఓపెనింగ్‌ చేస్తా రు. రాహుల్‌ మిడిలార్డర్‌లో ఆడుతాడు. 

- విరాట్‌ కోహ్లీ, భారత కెప్టెన్‌


4 ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయనుండటం భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగోసారి. గతంలో రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ (2016లో జింబాబ్వేపై), సునీల్‌ గవాస్కర్‌, సుధీర్‌ నాయక్‌ (1974లో ఇంగ్లండ్‌పై), పార్థసారథి శర్మ, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌  (1976లో న్యూజిలాండ్‌పై) అరంగేట్రం మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ చేశారు.


7 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది ఏడోసారి. గతంలో 2000, 2008, 2012, 2018లో ట్రోఫీ నెగ్గిన యువ భారత్‌.. 2006, 2016లో రన్నరప్‌గా నిలిచింది.


logo