ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 19, 2020 , 01:34:54

గెలుపెవరిదో..

గెలుపెవరిదో..
  • -నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే
  • -సిరీస్‌పై కన్నేసిన ఇరు జట్లు
  • -రోహిత్‌, ధవన్‌పై స్పష్టత కరువు

వన్డే క్రికెట్‌లో అత్యంత పటిష్ఠమైన జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌ అంతే ఆసక్తికరంగా సాగుతున్నది. తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా.. పది వికెట్ల తేడాతో
టీమ్‌ఇండియాను మట్టికరిపిస్తే.. రాజ్‌కోట్‌లో సమిష్ఠిగా కదంతొక్కి మనవాళ్లు బదులు తీర్చుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేకు పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియం రారమ్మని ఆహ్వానిస్తున్నది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన బెంగళూరులో భళా అనిపించి సిరీస్‌ చేజిక్కించుకునేది ఎవరో నేడు తేలనుంది.

బెంగళూరు: తొలి మ్యాచ్‌ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న టీమ్‌ఇండియా.. రాజ్‌కోట్‌లో రాణించి సిరీస్‌ సమం చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ సేన ఒక్క రోజు విరామంతోనే మరో కీలక పోరుకు రెడీ అయింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనున్నాయి. ఇరుజట్లు సిరీస్‌పై కన్నేసిన నేపథ్యంలో బెంగళూరులో పరుగుల వరద ఖాయంగానే కనిపిస్తున్నది. ముంబైలో తడబడ్డ భారత బ్యాటింగ్‌ లైనప్‌ రెండో వన్డేలో సమిష్ఠిగా రాణిస్తే.. ఆసీస్‌ తరఫున స్టీవ్‌ స్మిత్‌ ఒంటరి పోరాటం చేశాడు. ప్రయోగాల జోలికి పోకుండా గత మ్యాచ్‌ బ్యాటింగ్‌ లైనప్‌నే కొనసాగించాలని భారత్‌ భావిస్తుంటే.. కంగారూలు మాత్రం యువ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానంలో హాజిల్‌వుడ్‌కు చోటు కల్పించే అవకాశాలున్నాయి. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో ఆఖరి వన్డేలో హోరాహోరీ తప్పదనిపిస్తున్నది.

రాహుల్‌ మిడిల్‌లోనే..

ఫుల్‌ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ మరోసారి మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇటీవలి కాలంలో ఫార్మాట్‌, బ్యాటింగ్‌ ఆర్డర్‌తో సంబంధం లేకుండా రెచ్చిపోతున్న అతడు.. అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది. పంత్‌ గైర్హాజరీలో వికెట్ల వెనుక కూడా తనదైన మార్క్‌ చూపెట్టిన రాహుల్‌.. పరిస్థితికి తగ్గట్లు గేర్లు మార్చుతుండడం శుభపరిణామం. రాజ్‌కోట్‌లో కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు కుదురుగా ఆడిన రాహుల్‌.. కెప్టెన్‌ నిష్క్రమించాక దంచడం మొదలెట్టి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌, కేన్‌ విలియమ్స్‌ బ్యాటింగ్‌ వీడియోలు చూస్తూ.. మిడిలార్డర్‌లో ఎలా ఆడాలో నేర్చుకున్నానంటున్న రాహుల్‌ అదే దూకుడు కనబరిస్తే.. ఆసీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. రెండో మ్యాచ్‌లో తిరిగి వన్‌డౌన్‌లో దిగిన కోహ్లీ ఆకట్టుకున్నాడు. శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే రాణించాల్సిన అవసరమున్నది.

రెండో వన్డేలో బ్యాటింగ్‌ చేస్తూ ధవన్‌.. ఫీల్డింగ్‌ చేస్తూ రోహిత్‌ గాయపడగా.. వారి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని కెప్టెన్‌ అంటున్నాడు. మ్యాచ్‌కు ముందు వారి పరిస్థితి పరిశీలిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే రోహిత్‌ గాయం పెద్దగా ఇబ్బంది పెట్టకున్నా.. ధవన్‌కు మరోసారి బౌన్సర్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు బాదిన గబ్బర్‌.. కీలక మ్యాచ్‌కు దూరం కాకూడదని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది. మరోవైపు బెంగళూరు పిచ్‌పై మెరుగైన రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ తన పవర్‌ హిట్టింగ్‌ సత్తాచాటితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు.

రాటుదేలాలి

ముంబై పిచ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు రెండో వన్డేలో చక్కటి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కట్టుదిట్టమైన బంతులతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. వికెట్లు పడగొట్టకపోయినా.. అతడు బౌలింగ్‌ చేసిన తీరు ప్రత్యర్థిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మరో పేసర్‌ షమీ వికెట్లు పడగొడుతున్నా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. బెంగళూరులో మంచి రికార్డు ఉన్న చాహల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. ఒకవేళ అతడిని ఎంపిక చేస్తే.. కుల్దీప్‌ బెంచ్‌కే పరిమితవ్వాల్సి ఉంటుంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా ఖాయమే.

కసితో కంగారూలు..

రెండో వన్డే పరాజయంతో.. కసిమీదున్న కంగారూలు జూలు విదిల్చేందుకు సిద్ధమవుతున్నారు. వార్నర్‌, ఫించ్‌, స్మిత్‌, లబుషేన్‌, కారీ జోరుమీదుండగా.. బౌలింగ్‌లో జంపా ఇరగదీస్తున్నాడు. గత పర్యటనలో హీరోగా నిలిచిన టర్నర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో చక్కటి అనుభవం ఉన్న భారత బ్యాట్స్‌మెన్‌ను జంపా తన బంతులతో బోల్తా కొట్టిస్తున్నాడు. అగర్‌ కూడా ఓ చేయి వేస్తే.. స్పిన్‌ విభాగానికి మరింత బలం చేకూరనుంది. స్టార్క్‌, కమిన్స్‌తో పాటు కేన్‌ రిచర్డ్‌సన్‌కు బదులు హజిల్‌వుడ్‌ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, అయ్యర్‌, రాహుల్‌, పాండే, జడేజా, బుమ్రా, కుల్దీప్‌/చాహల్‌, సైనీ, షమీ.
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, కారీ, టర్నర్‌, అగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌/హజిల్‌వుడ్‌, జంపా.

పిచ్‌, వాతావరణం

చిన్నస్వామి పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. చిన్న బౌండ్రీ కావడంతో పరుగుల వరద ఖాయమే. రాత్రిపూట మంచు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.

ఆ మ్యాచ్‌ గుర్తుందా..

రెండున్నరేళ్ల క్రితం (2017, సెప్టెంబర్‌) చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి వన్డేలోనూ భారత్‌, ఆస్ట్రేలియా తలపడ్డాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. వార్నర్‌ (124), ఫించ్‌ (94), హ్యాండ్స్‌కోంబ్‌ (43) దంచి కొట్టడంతో కంగారూలు భారీ స్కోరు చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (4/71) మినహా మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరం లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మ (65), రహానే (53), జాదవ్‌ (67), పాండ్యా (41) రాణించినా.. చివరకు టీమ్‌ఇండియా 313/8కే పరిమితమైంది. 2013లో ఇదే పిచ్‌పై ఆసీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్‌ శర్మ (209) డబుల్‌ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.


logo