శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 17, 2020 , 00:08:33

రాజ్‌కోట్‌ రాజెవరో..

రాజ్‌కోట్‌ రాజెవరో..

ఆహో, ఓహోల మధ్య ఆస్ట్రేలియా సిరీస్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా.. ఒక్క మ్యాచ్‌ పూర్తయ్యేసరికి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.

  • -నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే..
  • -ఒత్తిడిలో భారత్‌.. ఆత్మవిశ్వాసంలో ఆసీస్‌
  • -మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

రాజ్‌కోట్‌: ఆహో, ఓహోల మధ్య ఆస్ట్రేలియా సిరీస్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా.. ఒక్క మ్యాచ్‌ పూర్తయ్యేసరికి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. మెరుగైన జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమనుకుంటే.. కంగారూల జోరు ముందు మనవాళ్లు కుదేలయ్యారు. బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, శ్రీలంకపై సిరీస్‌లు నెగ్గి తమకు తిరుగులేదనుకుంటున్న టీమ్‌ఇండియాను.. ఫించ్‌ సేన నేలకు దించింది. ముంబైలో ఘోర పరాజయంతో 0-1తో వెనుకబడిన భారత్‌.. సిరీస్‌ను సమం చేసేందుకు సిద్ధమవుతున్నది. శుక్రవారం ఇక్కడి ఎస్‌సీఏ స్టేడియంలో జరుగనున్న రెండో మ్యాచ్‌లో పటిష్ఠ ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రయోగం బెడిసికొట్టడంతో.. ఈసారి తనకు అచ్చొచ్చిన వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాంఖడేలో కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన మన బౌలర్లు.. రాజ్‌ కోట్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.


విరాట్‌ వన్‌డౌన్‌లోనే..

‘ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్‌ దళం భారత్‌దే’, ‘ప్రస్తుత టీమ్‌ఇండియా పేస్‌ దళం.. 90ల్లో విండీస్‌ను తలపిస్తున్నది’  ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత బౌలింగ్‌ గురించి జరిగిన చర్చ ఇది. అసలు ప్రత్యర్థి ఎదురైతే కానీ మన డొల్లతనం బయటపడలేదు. వాంఖడేలో వార్నర్‌, ఫించ్‌ దంచికొడుతుంటే.. చూస్తూ నిల్చోవడం తప్ప మనవాళ్లు చేసిందేమీ లేదు. బుమ్రా, షమీ, శార్దూల్‌ కనీసం ప్రత్యర్థిని ఇబ్బంది కూడా పెట్టలేకపోయారు. మరి పెద్దగా అచ్చిరాని రాజ్‌కోట్‌పై మనవాళ్లు ఏం చేస్తారో చూడాలి. బ్యాటింగ్‌లో ప్రయోగాలకు పోయిన టీమ్‌ఇండియా అసలుకే ఎసరు తెచ్చుకుంది. గత కొన్నేండ్లుగా మూడో స్థానంలో నిలకడగా రాణిస్తున్న కెప్టెన్‌ కోహ్లీ.. ఓపెనర్ల కోసం తన స్థానాన్ని త్యాగం చేసి నాలుగులో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే ఫలితం బెడిసికొట్టడంతో ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని అన్నాడు. అదే జరిగితే ఎప్పటిలాగే రోహిత్‌, ధవన్‌ ఓపెనింగ్‌ చేస్తారు. వన్‌డౌన్‌లో కోహ్లీ ఆ తర్వాత రాహుల్‌, అయ్యర్‌, జడేజా బ్యాటింగ్‌కు వస్తారు. రిషబ్‌ పంత్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు మోయనున్నాడు. జాదవ్‌, దూబేల్లో ఒకరికి చాన్స్‌ దక్కొచ్చు. బౌలింగ్‌ దళంలో మార్పులు ఉండకపోవచ్చు. మరోవైపు తొలి విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ఆసీస్‌ రాజ్‌కోట్‌లోనూ రాణించి ఇక్కడే సిరీస్‌ ఒడిసి పట్టాలని పట్టుదలగా ఉంది. 


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌, అయ్యర్‌, జాదవ్‌/దూబే, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, షమీ, బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, కారీ, టర్నర్‌, ఆగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, జంపా.ఇప్పటి వరకు రాజ్‌కోట్‌లో జరిగిన రెండు  వన్డేల్లోనూ భారత్‌ ఓటమి పాలైంది. 


logo