e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home స్పోర్ట్స్ ఫైనల్‌ ఫైట్‌

ఫైనల్‌ ఫైట్‌

ఫైనల్‌ ఫైట్‌

నేడు భారత్‌, ఇంగ్లండ్‌ ఆఖరి వన్డే
మధ్యాహ్నం 1.30 నుంచి..

ఇంగ్లిష్‌ జట్టును ఇప్పటికే రెండు ఫార్మాట్లలో ఓడించిన టీమ్‌ఇండియా.. వన్డేల్లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తుంటే.. కనీసం ఈ ఒక్క ట్రోఫీ అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నది. పరుగుల వరద పారుతున్న ఎమ్‌సీఏ మైదానంలో మనవాళ్లు జోరు కనబరిచి హోలీ పర్వదినాన్ని మరింత స్పెషల్‌గా మారుస్తారా.. లేక ఇంగ్లండ్‌ హిట్టర్లు మరోసారి దంచి కొడతారా చూడాలి!
పుణె: సుదీర్ఘ ఫార్మాట్‌లో సత్తాచాటి.. పొట్టి క్రికెట్‌లో దుమ్మురేపి రెండు సిరీస్‌ విజయాలు సాధించిన టీమ్‌ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌ నెగ్గగా.. ఆదివారం జరుగనున్న ఆఖరి పోరులో భారత్‌, ఇంగ్లండ్‌ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. హ్యాట్రిక్‌ సిరీస్‌ చేజిక్కించుకొని ఇంగ్లిష్‌ జట్టును రిక్తహస్తాలతో వెనక్కి పంపాలని కోహ్లీ సేన భావిస్తుంటే.. ఈ ఒక్క ట్రోఫీ అయినా చేజిక్కించుకొని విజయంతో సుదీర్ఘ పర్యటనకు ముగింపు పలకాలని ఇంగ్లండ్‌ ఆశిస్తున్నది. మరోమారు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌ సిద్ధంగా ఉండటంతో రికార్డులు తిరుగరాసేందుకు రెండు జట్ల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
టాస్‌ కలిసొచ్చేనా..
ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మంచి స్కోర్లే చేసినా.. ఫ్లాట్‌ పిచ్‌ కావడంతో మరింత భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేలో దుమ్మురేపిన ధావన్‌ అదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటుంటే.. రోహిత్‌ భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి అభిమానులు సెంచరీ ఆశిస్తున్నారు. మిడిలార్డర్‌లో లోకేశ్‌ రాహుల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం కాగా.. రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాతో బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే భువనేశ్వర్‌ కుమార్‌ తన అనుభవంతో సత్తాచాటుతున్నా.. కీలక సమయాల్లో బ్రేక్‌ త్రూ ఇవ్వలేకపోతున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ పేస్‌, బౌన్స్‌తో ఆకట్టుకుంటున్నా.. భారీగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బంది పెడుతున్నది. కీలక మ్యాచ్‌ కావడంతో శార్దూల్‌ ఠాకూర్‌ను పక్కనపెట్టి నటరాజన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక స్పిన్‌ విభాగంలో పూర్తిగా విఫలమవుతున్న కుల్దీప్‌ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ జట్టులోకి రావడం దాదాపు ఖాయమే కాగా.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోతుండటంతో అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను పరీక్షిస్తారా చూడాలి! పనిభారం కారణంగా హార్దిక్‌ పాండ్యాకు బౌలింగ్‌ ఇవ్వడం లేదంటున్న కోహ్లీ.. కీలక పోరులో అతడి సేవలు వినియోగించుకునే అవకాశాలున్నాయి.
ఈ ఒక్కటైనా..
గత మ్యాచ్‌లో రికార్డు స్కోరును ఛేదించిన ఇంగ్లండ్‌ జట్టు అదే ఊపులో సిరీస్‌ పట్టేయాలని చూస్తున్నది. రెగ్యులర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ గాయం కారణంగా సిరీస్‌కు దూరమైనా.. ఎలాంటి తడబాటుకు లోనవని ఇంగ్లిష్‌ టీమ్‌ శుక్రవారం పోరులో అదరగొట్టింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్లపై విరుచుకుపడటంతో సునాయాసంగా గెలిచి సిరీస్‌ సమం చేసింది. ముఖ్యంగా బెయిర్‌స్టో, స్టోక్స్‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని సిక్సర్ల వర్షం కురిపించారు. రెండు నెలల సుదీర్ఘ పర్యటన ఆదివారంతో ముగియనుండటంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ఆత్మవిశ్వాసంతో స్వదేశానికి బయలుదేరాలని బట్లర్‌ బ్యాచ్‌ భావిస్తున్నది. జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, మలన్‌, బట్లర్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌ ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ హిట్టర్లు ఉండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం కాగా.. మరోసారి టాప్లే, టామ్‌ కరన్‌, సామ్‌ కరన్‌, ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌ భారాన్ని మోయనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫైనల్‌ ఫైట్‌

ట్రెండింగ్‌

Advertisement