e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home Top Slides రేసుగుర్రాలు

రేసుగుర్రాలు

రేసుగుర్రాలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హాకీ, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌ ఇలా ప్రధాన క్రీడల్లో భారత్‌కు ఒలింపిక్‌ పతకాలు దక్కినా.. అథ్లెటిక్స్‌లో మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలింది. శతాబ్దకాలం క్రితం ఆంగ్లో ఇండియన్‌ నార్మన్‌ ప్రిచార్డ్‌ అథ్లెటిక్స్‌లో రెండు రజతాలు సాధించగా.. ఇక అప్పటి నుంచి మనవాళ్ల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సుదీర్ఘ ఎదురుచూపులకు ఈ సారి తెరదించాలనే ఉద్దేశంతో అథ్లెటిక్స్‌లో భారత్‌ నుంచి 26 మంది సభ్యుల జంబో బృందం టోక్యో బరిలో దిగనుంది. మరి విశ్వవేదికపై మన పతక ఆశలు, అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిస్తే..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

- Advertisement -

విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక్కటంటే ఒక్కసారి కూడా పతకం దక్కలేదు. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో పరుగుల రాణి పీటీ ఉషా సెకన్‌లో వందో వంతు తేడాతో కాంస్యం చేజార్చుకోగా.. ఆ తర్వాత మనవాళ్లు ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయితే కాలంతో పాటు ప్రమాణాలు పెంచుకుంటూ ఉన్నత స్థాయి శిక్షణ తీసుకుంటున్న కొందరు అథ్లెట్లు ఈ సారి పతకాలపై ఆశలు రేపుతున్నారు. అందులో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, షాట్‌పుటర్‌ తజిందర్‌పాల్‌సింగ్‌ తూర్‌, స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా జావెలిన్‌ త్రోలో ఇద్దరు, రేస్‌వాక్‌లో ఆరుగురు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, స్టీపుల్‌చేజ్‌లో ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. మహిళల డిస్కస్‌ త్రోలో సీమా పునియాకు.. జావెలిన్‌ త్రోలో అన్ను రాణికి కూడా పతక అవకాశాలు లేకపోలేదు. పురుషుల రేస్‌వాక్‌లో సీనియర్‌ వాకర్‌ కేటీ ఇర్ఫాన్‌, 400 మీటర్ల హార్డిల్స్‌లో ఎంపీ జాబిర్‌ ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నారు.

ద్యుతీకి చాన్స్‌

రేసుగుర్రాలు

100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌కు టోక్యోలో పతకం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో స్వర్ణం సాధించడం ద్వారా అంచనాలు పెంచిన ద్యుతీ.. ర్యాంకింగ్స్‌ ఆధారంగా టోక్యోకు క్వాలిఫై అయింది. జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోనే శిక్షణ పొందిన ద్యుతీచంద్‌.. టోక్యోలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని తహతహలాడుతున్నది.

నీరజ్‌పైనే ఆశలు..

రేసుగుర్రాలు

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పోటీల్లో అదరగొడుతున్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్థాయికి తగ్గ ప్రదర్శన కొనసాగిస్తే.. వందల ఏండ్ల భారత పతక తండ్లాట ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఈటెను 86.47 మీటర్లు విసిరి స్వర్ణం చేజిక్కించుకున్న నీరజ్‌.. ఆ తర్వాతి కాలంలో 88.07 మీటర్ల దూరంతో కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేసుకున్నాడు. రియో ఒలింపిక్స్‌ (2016)లో కాంస్యం నెగ్గిన ట్రినిడాడ్‌ టొబాగోకు చెందిన త్రోయర్‌ కే షర్న్‌ వాల్కట్‌ (85.38 మీటర్లు) కంటే చాలా ముందున్న నీరజ్‌.. ఇదే జోరు కొనసాగిస్తే జావెలిన్‌ త్రోలో భారత్‌ ఖాతా తెరవడం ఖాయమే. ప్రస్తుతం స్వీడన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న నీరజ్‌.. అటు నుంచి అటే టోక్యోలో అడుగు పెట్టనున్నాడు.

రేసుగుర్రాలు

ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడలు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ప్రధాని మోదీ భేటీతో అథ్లెట్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పతకంపై దృష్టి పెట్టి ఒత్తిడికి గురికాకుండా అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే తపన కనబరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. కరోనా కారణంగా కఠిన నిబంధనల మధ్య సాగుతున్న క్రీడల్లో ఏమాత్రం ఏమరపాటు కనబర్చినా.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.
నాగపురి రమేశ్‌, జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేసుగుర్రాలు
రేసుగుర్రాలు
రేసుగుర్రాలు

ట్రెండింగ్‌

Advertisement