మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 00:12:05

భారత్‌ xఇంగ్లండ్‌

భారత్‌ xఇంగ్లండ్‌
  • మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ బెర్త్‌లు ఖరారు
  • మరో పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ

సిడ్నీ: పది జట్లతో ప్రారంభమైన మహిళల పొట్టి ప్రపంచకప్‌ నాకౌట్‌ దశకు చేరింది.  గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టగా.. గ్రూప్‌-బి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ చోటు దక్కించుకున్నాయి. 8 పాయింట్లతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా.. 6 పాయింట్లతో గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లిష్‌ జట్టుతో గురువారం సెమీస్‌లో తలపడనుంది. గత ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌ చేతిలోనే ఓడిన విషయం తెలిసిందే. రెండో సెమీస్‌ కూడా గురువారమే జరుగనుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య జరుగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా.. పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌  వర్షం కారణంగా నిలిచిపోయింది. 


ఫుల్‌ఫామ్‌లో భారత్‌..

లీగ్‌దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమ్‌ఇండియా అజేయంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 2018 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలోనే ఓటమి పాలై.. ఇంటిదారిపట్టిన భారత్‌ మరోసారి సెమీస్‌లో ఆ జట్టునే ఢీకొట్టనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే చిత్తుచేసిన హర్మన్‌ బృందం ఫుల్‌ఫామ్‌లో ఉంది.

ఆసీస్‌.. ఏడోసారి

మహిళల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాతో మెగాటోర్నీలో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చేతిలో ఓడినా.. వెంటనే పుంజుకొని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. ఇప్పటి వరకు ఆరు సార్లు ప్రపంచకప్‌ ఆడిన ఆస్ట్రేలియా అందులో అన్నింటా సెమీస్‌ చేరింది.

సఫారీల రాతమారేనా.. 

మెగాటోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఒక్కసారే సెమీఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా జట్టు.. ఈసారి చాంపియన్‌గా నిలువాలని కృతనిశ్చయంతో ఉంది. గ్రూప్‌లో భాగంగా ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. చివరి మ్యాచ్‌ రైద్దెంది.సెమీస్‌లో బలమైన ఆసీస్‌ను ఎదుర్కోవాల్సి రావడం ప్రొటీస్‌కు పరీక్ష పెట్టే అంశమే!

జోరుమీదున్న  ఇంగ్లండ్‌..

మహిళల ప్రపంచకప్‌లో ఆసీస్‌ తర్వాత బలమైన జట్టుగా గుర్తింపు ఉన్న ఇంగ్లండ్‌ ఇప్పటి వరకు జరిగిన ఆరు మెగాటోర్నీల్లో ఓ సారి విజేతగా నిలిచి మరో మూడుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు.. ఆ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలతో నాకౌట్‌కు దూసుకొచ్చింది.  భారత్‌ను ఢీకొననుంది.


logo