బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 25, 2020 , T01:25

అమ్మాయిలు అదరహో

అమ్మాయిలు అదరహో
  • బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. బ్యాట్‌తో మెరిసిన షఫాలీ..
  • బంతితో పూనమ్‌ మాయ.. మహిళల టీ20 ప్రపంచకప్‌

షఫాలీ వర్మ వీరబాదుడుతో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తే.. జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడైన ఆటతో చక్కటి స్కోరు చేసింది. ఈ ఇద్దరి మెరుపుల మధ్య మిడిలార్డర్‌ విఫలమైనా.. ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించిన  టీమ్‌ఇండియా.. ఆనక బౌలింగ్‌లో విజృంభించి విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్‌ ప్లేయర్లతో ఆటాడుకున్న స్పిన్‌ సంచలనం  పూనమ్‌ యాదవ్‌.. బంగ్లా బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేస్తే..  పేసర్లు శిఖ, అరుంధతి చెరో రెండు వికెట్లతో తమవంతు సాయం చేశారు. ఫలితంగా సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకున్న హర్మన్‌ గ్యాంగ్‌  సెమీస్‌కు మరింత చేరువైంది.

పెర్త్‌: పొట్టి ప్రపంచకప్‌లో మంచి జోరుమీదున్న భారత అమ్మాయిల ఖాతాలో మరో విజయం చేరింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ను మట్టికరిపించిన మన అమ్మాయిలు.. మలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తుచేశారు. గ్రూప్‌-ఏలో భాగంగా సోమవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ బృందం 18 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఫలితంగా 4 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది. యంగ్‌ గన్‌ షఫాలీ వర్మ (17 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (34; 2 ఫోర్లు, ఒక సిక్స్‌), వేద కృష్ణమూర్తి (20 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించారు. లక్ష్యఛేదనలో స్టార్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/18),  తెలంగాణ స్పీడ్‌స్టర్‌ అరుంధతి రెడ్డి (2/33), శిఖా పాండే (2/14) ధాటికి బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నిగార్‌ సుల్తానా (35; 5 ఫోర్లు), ముర్షిద (30; 4 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.  షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. మరో మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 


అనూహ్య రనౌట్లు..

పవర్‌ ప్లే ముగిసేసరికి 54/2తో నిలిచిన టీమ్‌ఇండియా ఆ తర్వాత కాస్త తడబడింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (8) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరగగా.. వరుసగా నాలుగు ఓవర్ల పాటు భారత్‌ ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయింది. క్రీజులో కుదురుకున్న జెమీమా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటై నిరాశగా పెవిలియన్‌ బాటపట్టింది. రెండు ఫోర్లతో ఆశలు రేపిన మరో యువ ప్లేయర్‌ రిచా ఘోష్‌ (14) బౌండ్రీ వద్ద నహీద పట్టిన సూపర్‌ క్యాచ్‌కు వెనుదిరగగా.. దీప్తి శర్మ (11) రనౌటైంది. చివర్లో వేద కృష్ణమూర్తి ఆకట్టుకుంది.


మళ్లీ మెరిసిన పూనమ్‌

లక్ష్యఛేదనలో బరిలోదిగిన బంగ్లాదేశ్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఇంతకన్నా తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించి.. మ్యాచ్‌ను కాపాడుకున్న టీమ్‌ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేసింది. రెండో ఓవర్‌లోనే షమీమా (3)ను ఔట్‌ చేసిన శిఖ భారత్‌కు శుభారంభాన్నివ్వగా.. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ముర్షిదను అరుంధతి వెనక్కి పంపింది. సంజిద (10)ను పూనమ్‌ బుట్టలో వేసుకుంటే.. ఫర్జాన (0)ను అరుంధతి పెవిలియన్‌ బాటపట్టించింది. ఈ దశలో నిగార్‌, ఫహీమా ఖాతూన్‌ (17) ధాటిగా ఆడటంతో విజయ సమీకరణం 30 బంతుల్లో 49కి చేరింది. అయితే పూనమ్‌ వరుస ఓవర్లలో ఫహీమ, జహనార (10)ను ఔట్‌ చేయగా.. నిగార్‌ కథను రాజేశ్వరి ముగించింది. దీంతో భారత్‌ గెలుపు ఖాయమైంది.


షఫాలీ షో.. 

ఆహా..! ఏమా బ్యాటింగ్‌, ఏమా షాట్లు డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్రుడు పూనినట్లు.. మాస్టర్‌ బ్లాస్టర్‌ మళ్లీ క్రీజులోకి వచ్చినట్లు.. పదహారేండ్ల షఫాలీ వర్మ క్రీజులో ఉన్నంతసేపు భారత అభిమానులు పరవశించిపోయారు. అడ్డదిడ్డమైన బాదుడు కాకుండా.. అచ్చమైన క్రికెటింగ్‌ షాట్లతో అబ్బురపరిచిన ఈ యువ సంచలనం అరగంటలోనే మ్యాచ్‌పై మనవాళ్లు పట్టు సాధించేలా చేసింది. కవర్స్‌లో సిక్సర్‌తో తన ప్రతాపం మొదలెట్టిన షఫాలీ.. డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ అరుసుకుంది. జహనార వేసిన మూడో ఓవర్‌లో అయితే 6,4,4తో విశ్వరూపం కనబర్చింది. గత మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌ను ఉతికారేసిన షఫాలీ.. ఈసారి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపెట్టింది. అనారోగ్యం కారణంగా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. టాపార్డర్‌ భారాన్ని భుజానవేసుకున్న షఫాలీ ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన తానియా (2) రెండో ఓవర్‌లోనే ఔట్‌ కాగా.. జెమీమాతో కలిసి షఫాలీ పరుగుల పండుగ చేసుకుంది. నహీదా అక్తర్‌, పన్నా ఘోష్‌ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టిన షఫాలీ మరో భారీ షాట్‌కు యత్నించి ఔటైంది. చుక్కలనంటేలా కొట్టిన బంతిని పట్టే ప్రయత్నంలో షమీమా సుల్తానా ఒకటికి రెండు సార్లు తడబడ్డా చివరకు చక్కటి క్యాచ్‌తో షఫాలీ ఇన్నింగ్స్‌కు తెరదించింది. అప్పటి వరకు తారాజువ్వలా దూసుకెళ్లిన స్కోరు అక్కడి నుంచి మందగించింది.


స్కోరు బోర్డు

భారత్‌: తానియా (సి) నిగార్‌ (బి) సల్మ 2, షఫాలీ (సి) షమీమా (బి) పన్నా 39, జెమీమా (రనౌట్‌) 34, హర్మన్‌ప్రీత్‌ (సి) రుమాన (బి) పన్నా 8, దీప్తి (రనౌట్‌) 11, రిచా ఘోష్‌ (సి) నహిద (బి) సల్మ 14, వేద కృష్ణమూర్తి (నాటౌట్‌) 20, శిఖ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 142/6. వికెట్ల పతనం: 1-16, 2-53, 3-78, 4-92, 5-111, 6-113, బౌలింగ్‌: జహనార 4-0-33-0, సల్మ 4-0-25-2, నహిద 4-0-34-0, పన్నా 4-0-25-2, రుమాన 2-0-8-0, ఫహీమ 2-0-16-0.

బంగ్లాదేశ్‌: షమీమా (సి) దీప్తి (బి) శిఖ 3, ముర్షిద (సి) రిచా ఘోష్‌ (బి) అరుంధతి 30, సంజిద (సి) తానియా (బి) పూనమ్‌ 10, నిగార్‌ (సి) అరుంధతి (బి) రాజేశ్వరి 35, ఫర్జానా (సి) తానియా (బి) అరుంధతి 0, ఫహీమ (సి) షఫాలి (బి) పూనమ్‌ 17, జహనార (స్టంప్డ్‌) తానియా (బి) పూనమ్‌ 10, రుమాన (బి) శిఖ 13, సల్మ (నాటౌట్‌) 2, నహీద (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 20 ఓవర్లలో 124/8. వికెట్ల పతనం: 1-5, 2-44, 3-61, 4-66, 5-94, 6-106, 7-108, 8-121, బౌలింగ్‌: దీప్తి 4-0-32-0, శిఖ 4-0-14-2, రాజేశ్వరి 4-0-25-1, అరుంధతి 4-0-33-2, పూనమ్‌ 4-0-18-3.


logo