బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 25, 2020 , T01:30

తొలి దెబ్బ

తొలి దెబ్బ
  • ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మొదటి ఓటమి
  • 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం
  • రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 191 ఆలౌట్‌.. సిరీస్‌లో 0-1తో వెనుకంజ

అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే మన బ్యాట్స్‌మెన్‌ మరోసారి చెత్త ప్రదర్శన చేయడంతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ జయభేరి మోగించింది. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ పరుగులు చేసేందుకు ప్రయాస పడుతున్న వేళ.. నిలకడకు మారుపేరైన పుజారా, రహానే బ్యాట్‌ నుంచి రన్స్‌ రావడమే గగనమైన సమయాన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 0-1తో వెనుకంజలో నిలిచింది. 

వెల్లింగ్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో అజేయంగా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా జోరుకు న్యూజిలాండ్‌ బ్రేకులు వేసింది. బ్యాటింగ్‌లో విఫలమై.. బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయిన భారత్‌.. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఈ ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌ల అనంతరం భారత్‌కు పరాజయం ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన భారత బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తడబాటు కొనసాగించారు. ఎప్పుడెప్పుడు పెవిలియన్‌కు చేరుదామా అనే తొందర్లో ఒకరి వెంట మరొకరు డగౌట్‌కు క్యూ కట్టడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌ ముందు 9 పరుగుల స్వల్ప లక్ష్యం నిలువగా ఆ జట్టు 1.4 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ఇది వందో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీలో 60 పాయింట్లు ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్‌ మొత్తం 120 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరగా.. భారత్‌ (360 పాయింట్లు) టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్నది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన సౌథీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.


16 ఓవర్లలోనే..

ఓవర్‌నైట్‌ స్కోరు 144/4తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. క్రితం రోజు స్కోరుకు మరో 47 పరుగులు జతచేసి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/39) టాపార్డర్‌ పనిపడితే.. సౌథీ (5/61) మిడిలార్డర్‌ను కుదురుకోనివ్వలేదు. ఆదుకుంటారనుకున్న అజింక్యా రహానే (29), హనుమ విహారి (15) ఉసూరుమనిపించారు. రహానే ఓ ఫోర్‌ కొట్టి ఔటైతే.. విహారి అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. రిషబ్‌ పంత్‌ (25) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. అశ్విన్‌ (4), ఇషాంత్‌ (12), బుమ్రా (0) వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా సోమవారం 16 ఓవర్లలోనే భారత్‌ ఆట ముగిసింది.

  •  ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఇంతకుముందు ఆడిన ఏడు టెస్టుల్లో టీమ్‌ఇండియా విజయాలు సాధించింది.
  •  కోహ్లీ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌ ఓడటం ఇది కేవలం రెండోసారే. ఇంతకుముందు (2018లో) ఇంగ్లండ్‌ చేతిలో ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో ఓడింది.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 348, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 14, మయాంక్‌ (సి) వాట్లింగ్‌ (బి) సౌథీ 58, పుజారా (బి) బౌల్ట్‌ 11, కోహ్లీ (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌19, రహానే (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 29, విహారి (బి) సౌథీ 15, పంత్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌథీ 25, అశ్విన్‌ (ఎల్బీ) సౌథీ 4, ఇషాంత్‌ (ఎల్బీ) గ్రాండ్‌హోమ్‌ 12, షమీ (నాటౌట్‌) 2, బుమ్రా (సి) (సబ్‌) డారిల్‌ (బి) సౌథీ 0, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-27, 2-78, 3-96, 4-113, 5-148, 6-148, 7-162, 8-189, 9-191, 10-191, బౌలింగ్‌: సౌథీ 21-6-61-5, బౌల్ట్‌ 22-8-39-4, గ్రాండ్‌హోమ్‌ 16-5-28-1, జెమీసన్‌ 19-7-45-0, ఎజాజ్‌ 3-0-18-0. 

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (నాటౌట్‌) 7, బ్లండెల్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 1.4 ఓవర్లలో 9/0. బౌలింగ్‌: ఇషాంత్‌ 1-0-8-0, బుమ్రా 0.4-0-1-0.


logo
>>>>>>