శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 01:14:51

శతక్కొట్టారు..

శతక్కొట్టారు..

  • సెంచరీలతో చెలరేగిన విహారి, పంత్‌ 
  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 386/4 
  • ఆస్ట్రేలియా ‘ఏ’తో వామప్‌ మ్యాచ్‌ 

సిడ్నీ: ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (73 బంతుల్లో 103 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్‌ సెంచరీకి.. హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సమాయోచిత శతకం తోడవడంతో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ భారీ ఆధిక్యం సాధించింది. వీరిద్దరితో పాటు మయాంక్‌  (61), శుభ్‌మన్‌ గిల్‌ (65) అర్ధశతకాలతో చెలరేగడంతో టాపార్డర్‌కు ఫుల్‌ ప్రాక్టీస్‌ లభించినైట్లెంది. కంగారూ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్‌ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 386 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 86 రన్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్‌గా టీమ్‌ఇండియా 472 పరుగుల ముందుంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సాధికారికంగా ఆడుతూ.. గులాబీ బంతి పరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపింది. 

చక్కటి భాగస్వామ్యాలు..

సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే పృథ్వీ షా (3) వికెట్‌ పడగొట్టడం మినహా ఆసీస్‌ బౌలర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. శుభారంభం దక్కకున్నా.. మయాంక్‌, గిల్‌ సంయమనంతో ముందుకు సాగారు. రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించాక గిల్‌ ఔట్‌ కాగా.. హనుమ విహారి యాంకర్‌ రోల్‌ పోషించాడు. అర్ధశతకం అనంతరం మయాంక్‌ అగర్వాల్‌ కూడా పెవిలియన్‌ చేరగా.. అజింక్యా రహానే (38)తో కలిసి నాలుగో వికెట్‌కు విహారి 78 పరుగులు జతచేశాడు. క్రీజుకు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన రహానే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా.. ఆ సమయంలో వాతావరణం మేఘావృతం కావడంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. 

పంత్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌..

తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌.. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఒక్కసారి కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఒక ఎండ్‌లో విహారి నింపాదిగా ఇన్నింగ్స్‌ను నడిపిస్తుంటే.. పంత్‌ మాత్రం తనదైన శైలిలో కంగారూలపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పంత్‌ 43 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 188 బంతుల్లో విహారి సెంచరీ మార్క్‌ చేరాడు. ఈ దశలో పంత్‌ శతకం సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. మరో ఐదు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బౌండ్రీలతో రెచ్చిపోయిన రిషబ్‌ అజేయ సెంచరీతో రోజును ముగించాడు. ఈ జోడీ అభేద్యమైన ఐదో వికెట్‌కు 147 పరుగులు జతచేసింది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 194, ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్‌: 108, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 386/4 (విహారి 104 బ్యాటింగ్‌, పంత్‌ 103 బ్యాటింగ్‌, గిల్‌ 65, మయాంక్‌ 61; మార్క్‌ స్టెకెటీ 2/54).logo