బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 02:31:00

భారత్‌లోనే 2021

భారత్‌లోనే 2021

  • టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యంపై స్పష్టత..  2022లో ఆస్ట్రేలియా వేదికగా 
  •  మహిళల వన్డే ప్రపంచకప్‌ ఏడాది వాయిదా

అనుకున్నదే జరిగింది. సందిగ్ధానికి తెరపడింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను  భారత్‌ నిలబెట్టుకుంది. కరోనా వైరస్‌ దెబ్బతో ఈ ఏడాది వాయిదా పడిన మెగాటోర్నీ ఆస్ట్రేలియా వేదికగానే 2022లో జరుగనుంది. కరోనా కారణంగా ఏర్పడిన విశ్వటోర్నీల సందిగ్ధానికి ఐసీసీ శుక్రవారం తెరదించింది. బోర్డు సమావేశం అనంతరం నిర్ణయాలను ప్రకటించింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య జరుగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను కూడా 2022కు వాయిదా వేసింది. 

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీలపై స్పష్టతవచ్చింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగాల్సిన పొట్టి మెగాటోర్నీ.. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడడంతో ఏర్పడిన సందిగ్ధం వీడింది. వాయిదా పడిన టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరుగనుండగా, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ నిలబెట్టుకుంది. దీంతో భారత్‌లో 2021 పొట్టి ప్రపంచకప్‌ అలరించనుంది. శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన బోర్డు సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఈ నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ జరుగనుండగా.. ఫైనల్‌ నవంబర్‌ 14న జరుగనుంది. అలాగే 2022లో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరిగే మెగాటోర్నీ తుదిపోరు నవంబర్‌ 13న జరుగాల్సి ఉంది. కాగా 2023 వన్డే ప్రపంచకప్‌నకు కూడా భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఆ విశ్వటోర్నీ కూడా అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరుగుతుంది. కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడడంతో.. ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహించుకునేందుకు బీసీసీఐకు మార్గం సుగమమైన సంగతి తెలిసిందే.  

మహిళల ప్రపంచకప్‌ ఏడాది వాయిదా 

కరోనా వైరస్‌ దెబ్బ మహిళల వన్డే విశ్వసమరంపైనా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7వ తేదీ వరకు న్యూజిలాండ్‌ వేదికగా జరుగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను 2022కు ఐసీసీ వాయిదా వేసింది. కరోనా ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు సమావేశం అనంతరం ఐసీసీ వెల్లడించింది. కాగా భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ అర్హతను నిలబెట్టుకోనుండగా.. మరో మూడు జట్లు విశ్వటోర్నీ ఆడేందుకు క్వాలిఫయర్స్‌లో తలపడనున్నాయి.


logo