టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్న టీమ్ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. రెండు రోజుల క్రితమే ఉప్పల్‌లో ఆస్ట్రేలియాపై సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన ఇక దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి సిరీస్ కాగా జట్టు కూర్పును పరీక్షించుకోవడానికి యాజమాన్యానికిఇదే ఆఖరి అవకాశం కానుంది. బ్యాటింగ్విషయంలో టీమ్ఇండియాకు పెద్దగా ఇబ్బందులు లేకున్నా డెత్ ఓవర్స్ బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మెగాటోర్నీ జరుగనున్న నేపథ్యంలో భారత జట్టు లోపాలు సరిదిద్దుకోవాలని చూస్తుంటే సొంతగడ్డపై రోహిత్‌సేనకు షాక్ ఇవ్వాలని సఫారీలు తహతహలాడుతున్నారు.
తిరువనంతపురం: మరో 20 రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమ్ఇండియా దక్షిణాఫ్రికాతో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం తొలి టీ20 జరుగనుంది. మెగాటోర్నీకి ముందు జట్టు కూర్పుతో పాటు లోపాలను అధిగమించేందుకు ఈ సిరీస్‌ను వాడుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. డెత్ ఓవర్స్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్న మన బౌలర్లు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. మెగాటోర్నీకి ముందు పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఫలితంగా తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు ఇబ్బందికరంగా మారింది. గాయం కారణంగా దీపక్ హుడా కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే తుది జట్టులో దినేశ్ కార్తీక్‌తో పాటు రిషబ్ పంత్‌కు చోటు దక్కనుంది. మరోవైపు ఈ ఫార్మాట్లో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించి ప్రపంచకప్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తున్నది.
బ్యాటింగే బలంగా..
ఆసీస్‌తో సిరీస్‌లో బ్యాటర్లంతా రాణించడంతో మేనేజ్మెంట్కు ఈ అంశంలో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో.. టాప్-3 శత్రు దుర్భేద్యంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రూపంలో 360 డిగ్రీస్ ప్లేయర్ అందుబాటులో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20లో విరాట్, సూర్య మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో పంత్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నారు. దీపక్ చాహర్ కూడా బ్యాట్‌తో ఒక చేయి వేయగలవాడే కావడంతో భారత్ లైనప్ బలంగా కనిపిస్తున్నది. షాబాజ్‌ను ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు కష్టమే! కరోనా బారిన పడిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సిరీస్‌కు దూరం కాగా.. అర్శ్‌దీప్ సింగ్, దీపక్ చాహర్‌తో కలిసి జస్ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు చూసుకోనున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా డెత్ ఓవర్స్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న టీమ్ఇండియా.. ఈ సిరీస్‌తో ఆ లోపాన్ని అధిగమించాలని అనుకుంటున్నది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడటంతో జట్టులో చోటు దక్కి ంచుకున్న అక్షర్ పటేల్ ఆసీస్‌తో సిరీస్‌లో దుమ్మురేపాడు. మూడు మ్యాచ్ ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. అతడి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుండగా.. చాహల్ మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
మిల్లర్‌పైనే భారం..
ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిన డేవిడ్ మిల్లర్‌పై దక్షిణాఫ్రికా గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇక్కడి పిచ్‌లపై విశేష అనుభవం ఉన్న అతడు రాణిస్తే టీమ్ఇండియాకు కష్టాలు తప్పకపోవచ్చు. క్వింటన్ డికాక్, టెంబ బవుమా, రాసో, అయిడెన్ మార్క్మ్,్ర స్టబ్స్, ఫెలుక్వాయోతో కూడిన బ్యాటింగ్ లైనప్ సఫారీల సొంతం. కాగా.. బౌలింగ్‌లో కగిసో రబడ, అన్రిచ్ నోర్జే కీలకం కానున్నారు. ఆరున్నర అడుగుల పేస్ ఆల్‌రౌండర్ మార్కో జెన్సెన్ను ఎదుర్కోవాలంటే భారత ఆటగాళ్లు శక్తికి మించి కష్టపడాల్సిందే. భారత పిచ్‌లపై చక్కటి రికార్డు ఉన్న తబ్రేజ్ షంసీ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
ఇక్కడి పిచ్‌లపై కొత్త బంతిని ఎదుర్కోవడం కాస్త సవాలుతో కూడుకున్న విషయం. దక్షిణాఫ్రికాతో పోల్చుకుంటే బంతి ఇక్కడ భిన్నంగా స్పందిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అడ్డుకోవడం ముఖ్యం. ప్రపంచకప్‌నకు ముందు లోపాలను సవరించుకుంటాం.
– బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్
పిచ్, వాతావరణం
ఇక్కడ గతంలో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా 8 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది. వికెట్‌పై అంచనాకు రావడం కష్టం. బౌండ్రీలు దూరంగా ఉండనున్నాయి. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, పంత్, కార్తీక్, అక్షర్, దీపక్, అర్శ్‌దీప్, బుమ్రా, చాహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రాసో, మార్క్మ్,్ర మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జెన్సెన్, రబడ, నోర్జే, తబ్రేజ్ షంసీ.