Team India : బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఓటమి భారంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు మరో షాకింగ్ న్యూస్. మొదటి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడనుంది. జట్టు మొత్తానికి కలిపి రూ.52.8లక్షల జరిమానా పడింది. నిర్ణీత సమయానికి భారత జట్టు 4 ఓవర్లు వెనకబడిందని మ్యాచ్ రెఫరీ రంజన్ మదుగల్లే వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు. దాంతో, ఒక్కో ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత పడనుంది. ‘భారత జట్టు నిర్ణీత సమయానికి 4 ఓవర్లు వెనకబడడంతో రెఫరీ మ్యాచ్ ఫీజులో కోత విధించారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఐసీసీ ఆర్టికల్ 2.22 కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆటగాళ్లు, సహాయక సిబ్బందిపై ఓవర్ రేటు జరిమానా విధిస్తారు. నిర్ణీత సమయంలోపు ఎన్ని ఓవర్లు తక్కువ ఉంటే ప్రతి ఓవర్‌కు 20 శాతం జరిమానా పడుతుంది’ అని ఐసీసీ వెల్లడించింది.
మొదటి వన్డేలో టీమిండియా ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. వెంటవెంటనే వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించిన భారత్‌కు మెహిదీ మిరాజ్ షాక్ ఇచ్చాడు. 39 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో బంగ్లాను గెలిపించాడు. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉంది.