శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 11, 2020 , 00:08:24

పరువు దక్కేనా!

పరువు దక్కేనా!

టీ20 సిరీస్‌లో భాగంగా పది రోజుల క్రితం మౌంట్‌ మాంగనీలో జరిగిన చివరి మ్యాచ్‌కు ఇప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.పొట్టి సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గి ఇక్కడి బే ఓవల్‌ పిచ్‌పై అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.వన్డే సిరీస్‌కు వచ్చేసరికీ.. ఆ అవకాశం కివీస్‌ ముందు నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన కోహ్లీ సేన.. వైట్‌వాష్‌ పరాభావం తప్పించుకోవాలంటే తప్పక రాణించాల్సిన స్థితిలో మూడో మ్యాచ్‌కు రెడీ అవుతున్నది.

టీ20 సిరీస్‌లో భాగంగా పది రోజుల క్రితం మౌంట్‌ మాంగనీలో జరిగిన చివరి మ్యాచ్‌కు ఇప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.పొట్టి సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గి ఇక్కడి బే ఓవల్‌ పిచ్‌పై అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.వన్డే సిరీస్‌కు వచ్చేసరికీ.. ఆ అవకాశం కివీస్‌ ముందు నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన కోహ్లీ సేన.. వైట్‌వాష్‌ పరాభావం తప్పించుకోవాలంటే తప్పక రాణించాల్సిన స్థితిలో మూడో మ్యాచ్‌కు రెడీ అవుతున్నది.రోహిత్‌, ధవన్‌ గైర్హాజరీలో రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ.. టాపార్డర్‌ను ముందుండి నడిపించాల్సిన అవసరముంది.గత మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయిన బుమ్రా తిరిగి గాడిన పడితే.. ప్రత్యర్థికి కష్టాలు తప్పకపోవచ్చు. రెగ్యులర్‌ కెప్టెన్‌ లేకుండానే సిరీస్‌ పట్టేసిన న్యూజిలాండ్‌.. కేన్‌ రాకతో మరింత పటిష్ఠంగా మారింది. మరి ఇరు జట్లలో సత్తాచాటేవారెవరో చూసేందుకు రెడీనా.. ఇంకెందుకు ఆలస్యం మ్యాచ్‌ ఉదయం ఏడున్నరకే ప్రారంభం..


మౌంట్‌ మాంగనీ: కివీస్‌ గడ్డపై పొట్టి సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌లో అదే జోరు కొనసాగించలేక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ కోల్పోయింది. ఇక మిగిలిన ఆఖరి వన్డేలో మంగళవారం న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 1989లో వెస్టిండీస్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్‌ అన్ని మ్యాచ్‌లు ఓడలేదు. మరి ఈ రికార్డును నిలుపుకుంటూ.. టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే చివరి వన్డేలో విరాట్‌ సేన విజృంభించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టాపార్డర్‌ వైఫల్యంతో భారత్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. కొత్త ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా మంచి ఆరంభాలను భారీ స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నారు. ఈ సారైనా బ్యాట్స్‌మెన్‌ సమిష్ఠిగా కదం తొక్కుతారా.. లేక న్యూజిలాండ్‌కు తలవంచుతారా చూడాలి. మరోవైపు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో లేకున్నా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ చెలరేగడంతో విజయాలు సాధించిన న్యూజిలాండ్‌.. చివరి వన్డేలోనూ నెగ్గి టీ20 సిరీస్‌ ఫలితానికి బదులు తీర్చుకోవాలనుకుంటున్నది. 


విరాట్‌ విజృంభిస్తేనే..

ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన బాధలో ఉన్న టీమ్‌ఇండియా.. చివరి మ్యాచ్‌లో ప్రయోగాలకు తెరతీస్తుందా చూడాలి. కివీస్‌ పర్యటనలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని రిషబ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కాలంటే.. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌కు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. కెప్టెన్‌ నమ్మకాన్ని సంపాదించిన రాహుల్‌ను కాదని పంత్‌కు అవకాశం దక్కడం కష్టమే. అయితే సోమవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా రాహుల్‌ గ్రౌండ్‌లోకి రాకపోగా.. పంత్‌ సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేస్తూ కనిపించాడు. మిడిలార్డర్‌లో కేదార్‌ జదావ్‌ స్థానంలో మనీశ్‌ పాండే, శివం దూబేల్లో ఒకరిని ఎంపిక చేయొచ్చు. ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా చక్కటి ప్రదర్శన కనబరుస్తుండటంతో అతడిని తప్పించే అవకాశాలు లేనట్లే. 


నయా ఓపెనర్లు మయాంక్‌, పృథ్వీ షా కాస్త సంయమనం చూపాలి. రెండో వన్డేలో చేసిన పరుగులన్నింటినీ బౌండ్రీల ద్వారానే రాబట్టిన పృథ్వీ.. స్ట్రయిక్‌ రొటేషన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఈ ఏడాది ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడినా.. కోహ్లీ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. మరి కీలక టెస్టు సిరీస్‌ ముందు కెప్టెన్‌ బ్యాట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నట్లే. నాలుగో స్థానంలో స్థిరపడుతున్న శ్రేయాస్‌ అయ్యర్‌.. మరోమారు చెలరేగాల్సిన అవసరముంది. బౌలింగ్‌ విషయానికొస్తే.. స్వింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై గత మ్యాచ్‌లో మనవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో టేలర్‌, జెమీసన్‌ జోడీని విడదీయలేకపోవడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రా గత మూడు మ్యాచ్‌ల్లో వికెట్‌ తీయలేకపోవడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెంచుతున్నది. 


కేన్‌ రాకతో కివీస్‌ మరింత బలంగా..

విలియమ్సన్‌ రాకతో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ బలం పెరిగినా.. ఆ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గత మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచిన సౌథీ అనారోగ్యంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. రెండో వన్డేలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ చేసేందుకు కూడా ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ల్యూక్‌ రోంచీ మైదానంలో దిగాల్సి వచ్చింది. ఇది కాస్త విమర్శలకు దారితీయడంతో.. సోధీ, టిక్నర్‌లకు మేనేజ్‌మెంట్‌ పిలుపొచ్చింది. ఓపెనర్లు గప్టిల్‌, నికోల్స్‌ జోరు మీదుండగా.. మిడిలార్డర్‌లో టేలర్‌, లాథమ్‌ అదరగొడుతున్నారు. తొలి వన్డేలో భారీ లక్ష్యం ముం దున్నా.. టేలర్‌ తన అనుభవాన్నంతా రంగరించి సూపర్‌ సెంచరీతో మ్యాచ్‌ గెలిపించిన విషయం తెలిసిందే. ఈ లైనప్‌కు విలియమ్సన్‌ కూడా జత కలిస్తే.. అగ్నికి వాయువు తోడైనట్లే.  


కోహ్లీని ఔట్‌ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే  

మౌంట్‌ మాంగనీ: పిచ్‌ నుంచి సహకారం లభించడం వల్లే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఎక్కువసార్లు ఔట్‌ చేయగలిగానని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ పేర్కొన్నాడు. అయితే ఈ ఘనత సాధించిన విషయం కూడా తనకు తెలియదని అతడు చెప్పాడు. ‘కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతడిలో ఎక్కువ బలహీనతలు ఉండవు. కొత్త బంతితో బౌలింగ్‌ చేస్తున్న సమయంలో పిచ్‌ నుంచి సహకారం లభించింది. సరైన ప్రాంతాల్లో బంతులు సంధిస్తే.. కచ్చితంగా ఫలితాలు వస్తాయి. విరాట్‌ గొప్ప క్రికెటర్‌, మంచి ఫామ్‌లో ఉన్నాడు. లక్ష్య ఛేదనల్లో అతడు ఏ రేంజ్‌లో చెలరేగుతాడో అందరికి తెలిసిందే. అందుకే అతడిని ఔట్‌ చేయడం బాగుంటుంది. ఎక్కువసార్లు నేనే పెవిలియన్‌ పంపిచాననే విషయం తెలియదు.’ అని సౌథీ అన్నాడు. 


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), పృథ్వీ షా, మయాంక్‌, అయ్యర్‌, రాహుల్‌/పంత్‌, జాదవ్‌/పాండే, శార్దూల్‌, చాహల్‌, కుల్దీప్‌, సైనీ, షమీ/బుమ్రా.

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్‌, నికోల్స్‌, టేలర్‌, లాథమ్‌, నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, సౌథీ, జెమీసన్‌, సోధి/శాంట్నర్‌, బెనెట్‌/కుగ్‌లిన్‌.


పిచ్‌, వాతావరణం

బే ఓవల్‌ పిచ్‌ మందకొడిగా ఉండనుంది. ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో బౌలర్లకు సహకారం లభించింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు. 


ఉదయం 7.30  నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


logo