సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 11:57:18

36 ఆలౌట్‌.. ఇంత దారుణ‌మా ?

36 ఆలౌట్‌.. ఇంత దారుణ‌మా ?

హైద‌రాబాద్‌: టీమిండియా చ‌రిత్ర‌లో ఇదే అత్యంత దారుణ‌మైన రోజు.  టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టు అత్య‌ల్ప స్కోర్‌ను న‌మోదు చేసింది ఇవాళే.  విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో ఇది ఊహించ‌లేనిది.  దూకుడు ఆట‌తో అంద‌ర్నీ హ‌డ‌లెత్తించే కోహ్లీ టీమ్ ఇలా కుప్ప‌కూల‌డం బాధాక‌రం. గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య రీతిలో ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకుంటున్న‌ది.  టెస్టు చ‌రిత్ర‌లో ఇదో పీడ‌క‌ల కానున్న‌ది.  అడిలైడ్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్ కేవ‌లం 36 ప‌రుగుల‌కే త‌న రెండ‌వ ఇన్సింగ్‌లో ఆలౌటైంది.  భార‌త్ కోల్పోయింది 9 వికెట్లే అయినా.. చివ‌రి బ్యాట్స్‌మెన్ ష‌మీ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు.  దీంతో ఆస్ట్రేలియాకు టార్గెట్ సుల‌వైంది.  కేవ‌లం 90 ప‌రుగుల ల‌క్ష్యంతోనే ఆ జ‌ట్టు బ‌రిలోకి దిగింది.  

టెస్టు క్రికెట్‌లో భార‌త్ అత్య‌ల్ప స్కోర్క్‌కు నిష్క్ర‌మించ‌డం ఇదే తొలిసారి. చివ‌రిసారి 1974లో టీమిండియా జ‌ట్టు 42 ప‌రుగులు చేసింది.  కానీ ఆ అత్య‌ల్ప రికార్డును కోహ్లీ సేన చెరిపేసింది.  ఆస్ట్రేలియా బౌల‌ర్లు వేసిన ప‌దునైన బంతుల‌కు టీమిండియా చేతులెత్తేసింది. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో వంద క‌న్నా త‌క్కువ స్కోర్‌కే భార‌త్ అయిదు సార్లు ఆలౌట్ అయ్యింది. 1947లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా చేతిలో 58 చేసి ఆలౌటైంది. 1952లో మాంచెస్ట‌ర్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా భార‌త్ 58 ర‌న్స్ చేసింది. 1996లో డ‌ర్బ‌న్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత్య‌ల్పంగా 66 ర‌న్స్ చేసి ఆలౌటైంది.  2020 సంవ‌త్స‌రం టీమిండియాకు మ‌రింత‌ చేదు అనుభ‌వాన్ని మిగ్చిలింది.  

ఇవాళ్టి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేస‌ర్ జోష్ హేజ‌ల్‌వుడ్ .. అయిదు వికెట్లు తీసి త‌న స‌త్తా చాటాడు.  అయిదు ఓవ‌ర్లు వేసిన హేజ‌ల్‌వుడ్ 8 ప‌రుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు.  టెస్టుల్లో అత‌ని వికెట్ల సంఖ్య 200 దాటింది.  హేజ‌ల్‌వుడ్ కెరీర్‌లో ఇదో మైలురాయి.   వృద్ధిమాన్ సాహా, అశ్విన్‌ల‌ను వ‌రుస బంతుల్లో ఔట్ చేసిన హేజ‌ల్‌వుడ్ ఆ ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నించాడు. తొలి సెష‌న్‌లో 30 ర‌న్స్ చేసి భార‌త్ 8 వికెట్లు కోల్పోవ‌డం కోహ్లీసేన లోపాల్ని ఎత్తిచూపింది.  ఈ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ ష‌మీ.. సిరీస్‌లో ఆడుతాడో లేడో తెలియ‌దు. ఇక కోహ్లీ కూడా ఈ టెస్ట్ త‌ర్వాత‌.. స్వ‌దేశానికి తిరిగి వెళ్తున్నాడు.  దీంతో ఈ టెస్టు సిరీస్‌లో భార‌త్ త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం క‌ష్టమే అవుతుంది.  వ‌న్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన ఇండియా.. ఆ త‌ర్వాత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో చేజిక్కించుకున్న‌ది. 

అడిలైడ్ మ్యాచ్‌లో ఒక్క భార‌త ప్లేయ‌ర్ కూడా రెండు అంకెల స్కోర్ చేయ‌లేదు.  పృథ్వీ షా (4), మ‌యాంక్ అగ‌ర్వాల్ (9),  బుమ్రా (2), పుజారా (0), కోహ్లీ (4), ర‌హానే(0), విహారీ(8),  వృద్ధిమాన్ (4), అశ్విన్‌(0), యాద‌వ్‌(4), ష‌మీ(1) ఔటైన తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భార‌త టాప్ ఆర్డ‌ర్ ఎలా రాణిస్తుందో ఇప్పుడో స‌మ‌స్య‌గా మారింది.  తొలి టెస్ట్‌ను వ‌దులుకున్నా.. మిగితా మూడు టెస్టుల్లో టీమిండియా ఎలా పున‌రుత్తేజాన్ని ప్ర‌ద‌ర్శిస్తుందో వేచి చూడాల్సిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌల‌ర్ల‌ను నిలువ‌రించిన పుజారా.. రెండ‌వ ఇన్నింగ్స్‌లో నిరాశ‌ప‌రిచాడు. కానీ సిరీస్‌లో భాగంగా జ‌ర‌గ‌బోయే మిగితా టెస్టుల్లో.. భార‌త్‌ టాప్ ఆర్డ‌ర్ ఎలా రాణిస్తుందో సందేహాస్ప‌దంగా క‌నిపిస్తున్న‌ది. బాక్సింగ్ డే టెస్టులో పైచేయి సాధించాలంటే టీమిండియా త‌న ఆట‌తీరును మార్చుకోవాల్సిందే. 


logo