సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 08, 2020 , 12:12:50

తొలి అడుగు ఘనంగా

తొలి అడుగు ఘనంగా

కొత్త ఏడాదిని టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఇలా అన్ని రంగాల్లో అదరగొట్టిన విరాట్‌సేన.. లంకపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చక్కటి గెలుపును అందుకున్నది. పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న ఈ ఏడాదిని అదే ఫార్మాట్‌తో ఆరంభించిన భారత్‌.. విశ్వసమరానికి శంఖం పూరించింది. అచ్చొచ్చిన మైదానంలో మొదట ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కోహ్లీ అండ్‌ కో.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. రెగ్యులర్‌ పేసర్లు షమీ, భువనేశ్వర్‌, దీపక్‌ అందుబాటులో లేకున్నా.. శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైనీ దుమ్మురేపితే.. రోహిత్‌ గైర్హాజరీలో రాహుల్‌, ధవన్‌ దంచికొట్టారు.


ఇండోర్‌: దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో శ్రీలంకపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న టీమ్‌ఇండియా కొత్త ఏడాది కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షార్పణం కాగా.. మంగళవారం ఇక్కడి హోల్కర్‌ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో కుర్రాళ్ల సత్తా పరీక్షిస్తామన్న కోహ్లీ ఫీల్డ్‌లోనూ అదే ధోరణి కనబర్చాడు. సారథి అంచనాలకు తగ్గట్లే శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైనీ, శ్రేయాస్‌ అయ్యర్‌ వంటి యువ ఆటగాళ్లు చెలరేగడంతో భారత్‌ అలవోకగా గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్‌ గెలిచిన విరాట్‌ మరో ఆలోచన లేకుండా లక్ష్యఛేదనవైపు మొగ్గుచూపగా.. మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. కుషాల్‌ పెరెరా (28 బంతుల్లో 34; 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో (16 బంతు ల్లో 22; 5 ఫోర్లు), గుణతిలక (20) త లా కొన్ని పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్‌ 3, సైనీ, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాహు ల్‌ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు), శిఖర్‌ ధవన్‌ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు), శ్రే యాస్‌ అయ్య ర్‌ (26 బంతు ల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లీ (17 బం తుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్సర్లు) విజృంభించడంతో భారత్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నవ్‌దీప్‌ సైనీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 శుక్రవారం పుణెలో జరుగనుంది.

బౌలర్ల జోరు..

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మలింగ టాస్‌ ఓడటంతో లంక మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఆరంభం నుంచి భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో లంకేయులు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగిన ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (1/32) వైడ్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. మరో ఎండ్‌లో సైనీ, శార్దూల్‌ ఆకట్టుకున్నారు. చాన్నాళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న శార్దూల్‌ కసిమీద కనిపించాడు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, గుణతిలక ఆరంభంలో చక్కటి షాట్లు ఆడటంతో లంక ఇన్నింగ్స్‌ సాఫీగానే సాగింది. తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించాక జోరుమీదున్న అవిష్కను ఔట్‌ చేసి వాషింగ్టన్‌ సుందర్‌ (1/29) భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. కాసేపటికే సైనీ 148 కిలోమీటర్ల వేగంతో విసిరిన కచ్చితమైన యార్కర్‌కు గుణతిలక పెవిలియన్‌ బాటపట్టాడు. శ్రేయాస్‌ తప్పిదం కారంణంగా రనౌట్‌ నుంచి బయటపడ్డ పెరెరా ధాటిగా ఆడాడు. మూడు సిక్సర్లు బాది దూకుడు కనబర్చాడు. అయితే కుల్దీప్‌ వరుస ఓవర్లలో ఒషాడా ఫెర్నాండో (10), పెరెరాను ఔట్‌ చేశాడు. ఇక అక్కడి నుంచి లంక ఇన్నింగ్స్‌ గాడితప్పింది. ఒక దశలో 97/3తో పటిష్ఠంగా కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాజపక్స (9) కథ సైనీ ముగిస్తే.. షనక (7)కు బుమ్రా డగౌట్‌ దారి చూపాడు. 19వ ఓవర్‌లో శార్దూల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి ధనంజయ (17) కథ ముగించిన ఠాకూర్‌.. చివరి రెండు బంతులకు వరుసగా ఉడాన (1), మలింగ (0)ను ఔట్‌ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ చివరి మూడు బంతులను హసరంగ (16 నాటౌట్‌) బౌండ్రీలు బాదడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
rahul

బ్యాట్స్‌మెన్‌ హోరు..

ఓ మాదిరి లక్ష్యఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం పోటీపడుతున్న శిఖర్‌ ధవన్‌, లోకేశ్‌ రాహుల్‌ చక్కటి షాట్లతో అలరించడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి టీమ్‌ఇండియా 54/0తో నిలిచింది. గబ్బర్‌ కాస్త ఆచితూచి ఆడినా.. రాహుల్‌ మాత్రం బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌.. చిన్న మైదానం కావడంతో లోకేశ్‌ ధాటిగా ముందుకు సాగాడు. ఆరంభంలో మలింగ యార్కర్లను ఆడేందుకు ధవన్‌ సంశయిస్తుంటే.. రాహుల్‌ మాత్రం లంక కెప్టెన్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. ఆ తర్వాత లహిరు కుమార ఓవర్లోనూ 4,4 బాదిన లోకేశ్‌.. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించాక ఔటయ్యాడు. భారీషాట్‌ ఆడేందుకు క్రీజువదిలి బయటకు వచ్చిన రాహుల్‌.. హసరంగ వేసిన గూగ్లీకి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. హసరంగ తదుపరి ఓవర్‌లో ధవన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మొదట అంపైర్‌ ఔట్‌ ఇవ్వకున్నా.. లంక రివ్యూ కోరి ఫలితం రాబట్టింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌తో కలిసి విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అప్పటివరకు మూ డు ఓవర్లు వేసి కేవలం 13 పరుగులే ఇచ్చిన హసరంగ చివరి ఓవర్‌లో.. అయ్యర్‌ అదరగొట్టాడు. 4,4,6 బాది 17 రన్స్‌ రాబట్టాడు. మరుసటి ఓవర్‌లో మలింగను కోహ్లీ అరుసుకున్నాడు. 4,2,6,2,1తో మొత్తం 16 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్నాడు. చివర్లో అయ్యర్‌ వెనుదిరిగినా.. కోహ్లీ సూపర్‌ సిక్సర్‌తో మరో 15 బంతులు మిగిలుండగానే భారత్‌కు విజయాన్నందించాడు. లంక బౌలర్లలో హసరంగ 2, లహిరు ఒక వికెట్‌ పడగొట్టారు.
saini

అదే తడబాటు

సైనీ వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి టీమ్‌ఇండియా చక్కటి అవకాశాన్ని చేజార్చుకుంది. అంతకుముందు బంతికే సైనీ సూపర్‌ యార్కర్‌కు గుణతిలక ఔట్‌ కావడంతో.. ఒషాడా ఫెర్నాండో సింగిల్‌ తీసి నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌కు చేరిపోవాలనుకున్నాడు. అందుకు తగ్గట్లే.. బంతిని పాయింట్‌ దిశలో నెట్టి పరుగు ప్రారంభించాడు. అయితే మరో ఎండ్‌ నుంచి పెరెరా సరిగ్గా స్పందించకపోవడంతో మధ్యలో ఓసారి ఆగి తిరిగి వేగం పెంచాడు. పెరెరా మాత్రం బౌలింగ్‌ ఎండ్‌ నుంచి నాలుగడుగులు కూడా ముందుకు వేయలేదు. సరిగ్గా అదే సమయంలో బంతిని అందుకున్న శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎండ్‌ వైపు కాకుండా బౌలింగ్‌ ఎండ్‌ వైపు వికెట్లకు ‘త్రో’వేశాడు. అప్పటికే ఒషాడా క్రీజులోకి చేరుకోవడంతో పాటు బంతి కూడా వికెట్లను తాకలేదు. అయితే బంతిని పట్టుకొని బ్యాటింగ్‌ ఎండ్‌ వైపు పరుగెత్తుకొచ్చినా పెరెరా ఔటయ్యేవాడే. కోహ్లీ కూడా ఇదే అంశాన్ని శ్రేయాస్‌కు సైగల ద్వారా చెప్పినట్లు కనిపించింది. కుల్దీప్‌ వేసిన 18వ ఓవర్‌ రెండో బంతికి హసరంగ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కోహ్లీ వదిలేశాడు.

టెస్టులకు మార్పులొద్దు


Sachin-Tendulkar
సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌ను నాలుగు రోజుల ఆటగా మార్చాల్సిన అవసరమే లేదని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. సుదీర్ఘం కాలంగా కొనసాగుతున్నట్టే భవిష్యత్తులోనూ టెస్టులు జరిగితే బాగుంటుందని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2023 నుంచి టెస్టులను నాలుగు రోజులే నిర్వహించాలన్న ఐసీసీ ప్రతిపాదనను చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్‌ కూడా ఐసీసీ ఆలోచన పట్ల విముఖత వ్యక్తం చేశాడు. క్రికెట్‌ ఉజ్వలంగా ఉండాలని కోరుకునేవాడిగా ప్రస్తుతం టెస్టులకు ఆ మార్పు అవసరం లేదనుకుంటున్నానని మాస్టర్‌ బ్లాస్టర్‌ స్పష్టం చేశాడు. ఐదో రోజును తీసేయడమంటే స్పిన్నర్ల పాత్రకు ప్రాధాన్యం తగ్గించినట్టేనని చెప్పాడు. నాలుగు రోజుల టెస్టులు వస్తే టెస్టు క్రికెట్‌ పట్ల ఆటగాళ్ల ఆలోచనా తీరు కూడా మారుతుందని టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు.

స్కోరు బోర్డు

భారత్‌: రాహుల్‌ (బి) హసరంగ 45, ధవన్‌ (ఎల్బీ) హసరంగ 32, శ్రేయాస్‌ (సి) షనక (బి) లహిరు 34, కోహ్లీ (నాటౌట్‌) 30, పంత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 17.3 ఓవర్లలో 144/3. వికెట్ల పతనం: 1-71, 2-86, 3-137, బౌలింగ్‌: మలింగ 4-0-41-0, లహిరు 3.3-0-30-1, ధనంజయ 2-0-15-0, షనక 4-0-26-0, హసరంగ 4-0-30-2.శ్రీలంక: గుణతిలక (బి) సైనీ 20, అవిష్క ఫెర్నాండో (సి) సైనీ (బి) సుందర్‌ 22, కుషాల్‌ పెరెరా (సి) ధవన్‌ (బి) కుల్దీప్‌ 34, ఒషాడా ఫెర్నాండో (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 10, రాజపక్స (సి) పంత్‌ (బి) సైనీ 9, షనక (బి) బుమ్రా 7, ధనంజయ (సి) దూబే (బి) శార్దూల్‌ 17, హసరంగ (నాటౌట్‌) 16, ఉడాన (సి) సైనీ (బి) శార్దూల్‌ 1, మలింగ (సి) కుల్దీప్‌ (బి) శార్దూల్‌ 0, లహిరు (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 142/9. వికెట్ల పతనం: 1-38, 2-54, 3-82, 4-97, 5-104, 6-117, 7-128, 8-130, 9-130, బౌలింగ్‌: బుమ్రా 4-0-32-1, శార్దూల్‌ 4-0-23-3, సైనీ 4-0-18-2, సుందర్‌ 4-0-29-1, కుల్దీప్‌ 4-0-38-2.


logo